lift irrigation scheme: పాలమూరు గట్టెక్కే దారేది!
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:23 AM
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ హోదా సాధించేందుకు పలు సవాళ్లు ఎదుర్కొంటోంది. పోలవరం వాటా వివాదం, మైనర్ ఇరిగేషన్ అనుమతులు, ఇంకా అనేక అనుమతులపై ఉన్న అనిశ్చితి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో ఆటంకంగా మారింది.

జాతీయహోదా ఇవ్వలేమన్న కేంద్రం
కృష్ణా ట్రైబ్యునల్-2లో నీటి పంపకాలు తేలిన తర్వాతే తుది అనుమతులు!
హైదరాబాద్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని ఇటీవల లోక్‌సభలో కేంద్రం ప్రకటించడంతో ఈ అంశం మరో సారి చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కాలన్నా... ఆ ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపు ఉండాలి. కానీ, ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే.. మైనర్ ఇరిగేషన్ కింద పొదుపు చేస్తున్న 45.66 టీఎంసీలతోపాటు పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల్లో ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ విషయంపై సీడబ్ల్యూసీ పలు అభ్యంతరాలు లేవనెత్తింది. మైనర్ ఇరిగేషన్‌లో పొదుపు ఏ విధంగా చేస్తారు? పొదుపు చేస్తున్నారనడానికి ప్రాతిపదిక ఏంటి? వంటి వివరాలన్నీ జతచేసి, నిర్దేశిత ప్రొఫార్మాలో వివరాలు అందించాలని సీడబ్ల్యూసీ కోరగా... రాష్ట్ర ప్రభుత్వం బదులివ్వలేదు. దీనికితోడు పోలవరం వాటాలో దక్కిన నీటిపై తెలంగాణకు పూర్తి అధికారం లేదని, తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం లేదా ట్రైబ్యునల్ తీర్పు తర్వాతే ఆ నీటిపై అధికారం ఉంటుందని రెండేళ్ల కిందటే సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టు అప్రైజల్(సౌత్) డైరెక్టరేట్ స్పష్టం చేసింది. లేదంటే నీటి పంపకాలపై జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్(కృష్ణా ట్రైబ్యునల్-2) నిర్ణయం వెలువరించేవరకూ వేచిచూడాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబరులోనే పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపించింది. పోలవరం వాటా కింద దక్కిన 45 టీఎంసీల వాటా వివాదం తేలాలంటే తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరడం తప్ప మరో మార్గం లేదు. సీడబ్ల్యూసీ కూడా పలుమార్లు ఇదే చెప్పింది.
రెండు రాష్ట్రాలు పరస్పర అవగాహన ఒప్పందం చేసుకుంటే ఈ వాటాను వాడుకోవడానికి వీలు చిక్కనుంది. ఆ వివాదం సద్దుమణిగితేనే ఇరు రాష్ట్రాలు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అంతే కాదు..మైనర్ ఇరిగేషన్‌లో మిగిలిన 45టీఎంసీలతో ముందుకెళ్లాలన్నా.. ఏపీ అభ్యంతరాలు లేవనెత్తకుండా చూసుకోవాలి. ఒక వేళ ఈ తతంగమంతా పూర్తయి.. నీటి కేటాయింపులు కొలిక్కి వచ్చినా.. జాతీయ హోదా రావాలంటే చాలా ప్రక్రియలు దాటాలి. సీడబ్ల్యూసీలోని అన్ని డైరెక్టరేట్లు అనుమతి ఇచ్చాక, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సాంకేతిక అనుమతి పొందాలి. ఆ తదుపరి అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఇచ్చాక... చివరిగా కీలకమైన ఇన్వె్‌స్టమెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాతే జాతీయ హోదా ఇవ్వాలా... ? వద్దా...? అనే దానిపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అయితే, సుప్రీం కోర్టు ఇచ్చిన వెసులుబాటు ప్రకారం తాగు నీటి అవసరాల కోసం 7.5టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే అవకాశం ఉన్నా.. ఆ దిశగా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అనుసరిస్తుండడంతో 15 నెలలుగా పనుల్లో వేగం మందగించింది.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News