Share News

Telangana Police: మత్తు వదిలించి.. మనుషుల్ని చేసి..

ABN , Publish Date - Apr 01 , 2025 | 05:19 AM

మత్తుకు బానిసలైన వారిని మామూలు స్థితికి తీసుకురావడానికి తెలంగాణ పోలీసులు బృహత్తర ప్రయత్నాలు చేస్తున్నా. ఎన్‌సీబీ పర్యవేక్షణలో 38 డీ అడిక్షన్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి, వాటి ద్వారా ఇప్పటిదాకా 536 మందికి చికిత్స అందించడమే కాకుండా కొందరికి పునరావాసం కూడా కల్పించారు.

Telangana Police: మత్తు వదిలించి.. మనుషుల్ని చేసి..

ఎన్‌సీబీ డీ అడిక్షన్‌ కేంద్రాలతో సత్ఫలితాలు

536 మందికి చికిత్స, పలువురికి పునరావాసం

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల కేసుల్లో అరెస్టయిన వారిలో మత్తుకు బానిసలైన వారిని తిరిగి మామూలు మనుషులుగా మార్చేందుకు తెలంగాణ పోలీసు శాఖ బృహత్తర ప్రయత్నం చేస్తోంది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) పర్యవేక్షణలోని డీ అడిక్షన్‌ కేంద్రాల ద్వారా మత్తుకు బానిసలైన వారికి చికిత్స అందించి సాధారణ స్థితికి తీసుకురావడమే కాక అవసరమైన వారికి పునరావాసం కూడా కల్పిస్తోంది. సాధారణంగా మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారెవరైనా పట్టుబడితే పోలీసులు వారికి ఎన్‌సీబీ స్టేషన్లలో కౌన్సిలింగ్‌ ఇప్పిస్తారు. పలు దఫాలుగా జరిగే కౌన్సిలింగ్‌ అనంతరం చాలామందిలో మార్పు కనిపిస్తుంది. కౌన్సిలింగ్‌ అనంతరం కూడా మార్పు రాని వ్యక్తులను, మత్తుకు పూర్తిగా బానిసలైన వారిని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో, ఎన్‌సీబీ పర్యవేక్షణలో కొనసాగుతున్న డీ అడిక్షన్‌ కేంద్రాల్లో చేర్పిస్తారు. సైకాలజిస్టులు ఆధ్వర్యంలో అవసరమైన వైద్య చికిత్స అందించి మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని మత్తుకు దూరం చేస్తారు. అయితే, ఇలా మారిన వారికి ఉపాధి లభించే అవకాశాలు చాలా తక్కువ. చాలా కేసుల్లో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తమ వారి బాధ్యతను తీసుకుంటారు. కొందరిని మాత్రం తమ కుటుంబసభ్యులు పూర్తిగా వదిలేస్తుంటారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎన్‌సీబీ అధికారులు డీఅడిక్షన్‌ కేంద్రాల నుంచి బయటికి వచ్చే వారికి పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టారు. పోలీసుశాఖ నిర్వహించే పెట్రోల్‌ బంకులు, ఇతర పోలీసు సంస్థల్లో ఉపాధి కల్పిస్తున్నారు. ఎన్‌సీబీ పర్యవేక్షణలో 26 డీ అడిక్షన్‌ కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటికి అదనంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కొందరు ఎన్‌జీఓలు నిర్వహించే డీ అడిక్షన్‌ కేంద్రాలు మరో 12 ఉన్నాయి. రాష్ట్రంలోని ఈ 38 డీఅడిక్షన్‌ కేంద్రాల్లో ఇప్పటిదాకా 536 మందికి చికిత్స అందించి మామూలు మనుషులను చేశారు. వీరిలో కొందరికి పునరావాసం కూడా కల్పించామని అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 05:19 AM