Share News

Traffic Police: నీరసంగా మగతగా ఉన్నారు

ABN , Publish Date - Apr 01 , 2025 | 05:25 AM

పాస్టర్ ప్రవీణ్‌కుమార్ కేసు దర్యాప్తులో పోలీసులు అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ ఎస్‌ఐ సుబ్బారావు ప్రకారం, ఆయన రామవరప్పాడు రింగ్ వద్ద నీరసంగా కనిపించి, గార్డెన్‌లో నిద్రపోయారని తెలిపారు

Traffic Police: నీరసంగా మగతగా ఉన్నారు

ప్రవీణ్‌ అని తెలియదు: ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుబ్బారావు

విజయవాడ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కేసు దర్యాప్తులో పోలీసులు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విజయవాడలో నాలుగు గంటలు ఎక్కడున్నాడో తేలిపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. రామవరప్పాడు రింగ్‌ సమీపంలో బైక్‌పై నుంచి కిందపడిన ప్రవీణ్‌ను పైకిలేపిన ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుబ్బారావు సోమవారం మీడియాతో మాట్లాడారు. 24వ తేదీ సాయంత్ర జరిగిన పరిణామాలను వివరించారు. ‘‘ఆయన ఎవరో నాకు తెలియదు. నీరసంగా కనిపించారు. మగతగా ఉన్నారు. నేను ట్రాఫిక్‌ బూత్‌ వద్దకు తీసుకొచ్చాను. సమీపంలోని గార్డెన్‌లో ఆయన నిద్రపోయారు’’ అని తెలిపారు. రామవరప్పాడు రింగ్‌ వద్ద పాస్టర్‌ ప్రవీణ్‌ ఫొటోలను ఎస్‌ఐ సుబ్బారావు తీసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ బుల్లెట్‌పై వచ్చిన వ్యక్తి ప్రవీణ్‌కుమార్‌ అనే విషయం తనకు తెలియదని, తలపై హెల్మెట్‌, మూతికి నలుపు రంగు మాస్క్‌ ధరించి ఉన్నారని చెప్పారు. గార్డెన్‌లో నిద్రపోతున్న ఆయన్ను.. తాను డ్యూటీ దిగి వెళ్లిపోతున్న సమయంలో లేపానని వివరించారు. ముఖం కడుక్కున్న తర్వాత టీ తాగడానికి తీసుకెళ్లానని చెప్పారు. తర్వాత బుల్లెట్‌ హెడ్‌లైట్‌ ఊడిపోవడంతో.. టీస్టాల్‌లో పనిచేసే యువకుడిని పిలిచి, సరిచేయమని చెప్పానన్నారు. మగతగా ఉండడంతో రాత్రికి హోటల్‌లో బస చేసి వెళ్లమని సలహా ఇచ్చానని, అయినా ఆయన వెళ్లిపోయారని పేర్కొన్నారు. టీ స్టాల్‌లో పనిచేసే నాగార్జున అనే యువకుడు మాట్లాడుతూ దారంతో హెడ్‌లైట్‌ కట్టేందుకు ప్రయత్నించానని, అయితే అది ఆగకపోవడంతో ఇనుప తీగ తీసుకురావడానికి వెళ్లానని తెలిపారు. ఎస్‌ఐ సుబ్బారావు జీపులో తాడు ఉంటే తీసుకురావడానికి వెళ్లారని, ఇద్దరం తిరిగి వచ్చేటప్పటికీ ప్రవీణ్‌ ట్రాఫిక్‌ బూత్‌ వద్ద కనిపించలేదని తెలిపారు.

Updated Date - Apr 01 , 2025 | 05:26 AM