తెగిన సినిమా రీల్
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:00 AM
ఆ రోజుల్లో సినిమా చూడటం ఒక మధురానుభూతి. ముఖ్యంగా నేల టికెట్ కొని, కిక్కిరిసిన హాల్లో, ఉక్కిరిబిక్కిరి చేసే బీడీ పొగల మధ్య, ఊలలు, కేరింతల సంరంభంలో సినిమా చూసిన వాళ్లకు ఎన్నేళ్లయినా అలనాటి అనుభవం నిలిచే ఉంటుంది.

ప్రాభవం కోల్పోతున్న ఽథియేటర్లు
అలనాటి సినిమా ప్రేక్షకుల ఆనందమే వేరు
టిక్కెట్ల కోసం కొట్లాటలు
ఫ్యాను కింద సీటు కోసం పోటీ
నల్లులతో యుద్ధం.. చుట్టుముట్టే బీడీపొగలు
మూతపడుతున్న సినిమా హాళ్లు
కోడుమూరు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ఆ రోజుల్లో సినిమా చూడటం ఒక మధురానుభూతి. ముఖ్యంగా నేల టికెట్ కొని, కిక్కిరిసిన హాల్లో, ఉక్కిరిబిక్కిరి చేసే బీడీ పొగల మధ్య, ఊలలు, కేరింతల సంరంభంలో సినిమా చూసిన వాళ్లకు ఎన్నేళ్లయినా అలనాటి అనుభవం నిలిచే ఉంటుంది. ఇప్పటిలాగ అప్పట్లో ఏసీలు లేవు. ఫ్యాన్ కింద సీటు దొరకడమే కష్టం. నేల టిక్కెట్టు, బెంచి, కుర్చీ టిక్కెట్టు ఉండేవి. ఎక్కువ మందికి నేల టికెట్ ఆర్థిక స్తోమత ఉండేది. చీకటి పడ్డాక 7గంటలకు పరదాలు వేసి సినిమా మొదలు పెట్టేవారు. అట్లా నేల మీద కూచొని చూసిన సినిమాలు జీవితమంతా గుర్తున్నాయని అప్పటి వాళ్లు చెప్పుకొని మురిసిపోతుంటారు.
కోడుమూరులో 1960లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన కీలుగుర్రం సినిమాతో మహాత్మా టూరింగ్ టాకీస్ (పరదా టాకీస్) ప్రారంభించారు. ఆ తార్వాత ఎన్టీ రామారావు నటించిన శ్రీవెంకటేశ్వర మహాత్యం సినిమా 6నెలలు ప్రదర్శించారు. 1973లో శ్రీరామచంద్ర టాకీస్ (ఎస్‌ఆర్‌టీ) నిర్మించారు. ఇందులో మొదటి సినిమా సంపూర్ణరామాయణం. 1984లో శ్రీనివాస టాకీస్ నిర్మించారు. టిక్కెట్టు ధర 1960లో ఆణా, రెండు పైసలు మాత్రమే. ఆ తర్వాత నేల 25పైలు, బెంచి 50, కుర్చీ 75పైసలు అయ్యాయి. బెంచిలో జనం ఎక్కువైతే అదరంగా బెంచీలు, బాల్కనీలో ఇనుప కుర్చీలు ఉండేవి. బెంచి, కుర్చీలకు మాత్రమే ఫ్యాన్ సౌకర్యం ఉండేవి. నేల టిక్కెట్టు వాళ్లకు ఎక్కడో ఒక చోట ఫ్యాన్ ఉండేది. ఫ్యాన్ కింద కూచోడానికి అవకాశం దొరికితే వాడు అదృష్ట వంతుడు. ఉన్న ఫ్యాన్లు కూడా కీచ్ కీచ్ అనే శబ్దాలతో తిరిగేవి. సినిమా విశ్రాంతిలో బయట అమ్మే నిమ్మసోడ తాగడం ఒక సరదా. ఇక శనక్కాలు అమ్మేవాడు హాల్లోకి వచ్చి సినిమా చూస్తున్న జనాన్ని తొక్కుకొంటూ తన వ్యాపారాన్ని సాగించేవాడు. నాడు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ హీరోల సినిమాలు రిలీజ్‌కు ముందు రోజు నుంచి ఆ ఊర్లో పండుగ వాతావరణం. ఇక సినిమా టాకీసు దగ్గర అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. ఎద్దుల బండ్లు, రిక్షాలపై తప్పెట్ల నడుమ ఊరేగింపుగా గజమాలలు టాకీస్ దగ్గర చేరుకొంటారు. సినిమా ఆవరణలో ఏర్పాటు చేసిన హీరో కటౌట్, పోస్టర్లకు పూల వర్షం కురిపిస్తూ గజమాలలను వేసి అభిమానాన్ని చాటుకునే వాళ్లు. సినిమా హిట్టు, సూపర్ హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా సినిమాను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున కదలివచ్చే వాళ్లు. జిల్లా కేంద్రాలల్లో 100 రోజులు, 175 రోజులు, ఏకంగా సంవత్సరం ఆడిన సినిమాలు ఉన్నాయి. ప్రతి హీరో సినిమా ఏడాదికి 5 నుంచి 8 సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో హీరో కృష్ణ ఒకే ఏడాదిలో 18 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు సృష్టించారు.
గ్రాఫిక్స్ పేరుతో ఏడాదికి ఒక సినిమా :
ప్రస్తుత హీరోలు గ్రాఫిక్స్ పేరుతో ఏదాదికి ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేక పోతున్నారు. టీవీలు, ఓటీటీలతో పాటు సినిమా రిలీజ్ అయిన రోజే ఆన్‌లైన్‌లో దర్శనం ఇస్తున్నాయి. దీంతో చాలా మంది సినిమా ప్రేక్షకులు టాకీస్‌లకు వచ్చే వాళ్ల సంఖ్య తగ్గిపోయింది. సినిమా రిలీజ్ అయిన నెలకే ఓటీటీలో రిలీజ్ చేయడం కూడా చాలా మంది ఇండ్లలోనే టీవీలల్లో సినిమాలు చూసేస్తున్నారు. నగరలోనే కాకుండా మండల స్థాయిలో కూడా సినిమా థియోటర్లు మూతబడుతున్నాయి. ఇందులోనే కోడుమూరు మూడు టాకీస్‌లు ఉండగా ప్రస్తుతం ఒక్క టాకీస్ మాత్రమే నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అలనాటి నేల సినిమా గురించి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ల మాటలు విందాం.
టాకీస్‌లో యుద్ధాలు జరుగుతున్నా టిక్కెట్ బుకింగ్ ఆగేది కాదు : బడెసాగౌడ్, బృందావనం హోటల్ యజమాని, కోడుమూరు.
టాకీస్ లోపల ప్రేక్షకులు ఎక్కువై యుద్ధాలు జరుగుత ున్నప్పటికీ టిక్కెట్ బుకింగ్ ఆగేదు కాదు. అప్పట్లో సీట్ల పరిమితి అంటూ లేదు. ఎంత మంది జనం వచ్చినా టాకీస్‌లోకి పంపించే వాళ్లు. నేల టిక్కెట్టులో ఒకరి మీద ఇంకొకరు కూర్చోని సినిమా చూడాల్సిన పరిస్థితులు. చివరకు స్ర్కీన్ ముందు ఉన్న ఆరుగు మీద కూర్చోని సినిమా చూడాలి. తెర మీద కనిపించే నటులను చూడాలంటే తలను పైకి ఎత్తి మెడను అటూ ఇటూ ఆడిస్తూ సినిమా మొత్తం చూసే వాళ్లం. అప్పట్లో రాత్రిపూట రెండు ఆటలు మాత్రమే సినిమా ప్రదర్శించేవాళ్లు.
వంద రోజుల అనంతరం సినిమాలు వచ్చేవి : మాదన్న, సినిమా అభిమాని, కోడుమూరు.
సినిమా రిలీజైన 100 రోజుల అనంతరం, మరి కొన్ని సినిమాలు ఏడాది తరువాత కోడుమూరుకు వచ్చేవి. రాష్ట్రమంతా ఆడిన వచ్చిన పాత ప్రింట్లు కాబట్టి కొన్ని సినిమాలు తెరపై గీతలు గీతలు వచ్చేవి. అయినా సినిమాను ఎంతో ఓపికతో చూసేవాళ్లు. ఇలాంటి సమయంలో గీతలు పడకుండా సరికొత్త కాపీ అంటూ ప్రింట్లు వాడుకలోకి తీసుకొచ్చారు. ప్రేక్షకులు సినిమా చూస్తూ బీడి, సిగరేట్లు ముట్టించి గుప్పు గుప్పుమని పొగను వదిలితే టాకీస్ మొత్తం బీడి పొగలే కనిపించేవి. బీడి తాగిన వాడికి తాగని వాడికి తేడా ఉండేది కాదు. ఒక వైపు నల్లులతో తాము యుద్ధం చేస్తూ మరో వైపు సినిమాను ఎంజాయ్ చేసేవాళ్లం. హీరో చేసే కత్తి యుద్ధం, ఫైట్లు, పాటలకు ఆనందంతో ఎగిరిగి గంతేసి, ఈలలు, చప్పట్లు, అరుపులు మధ్య సినిమా చూస్తుంటే ఆ మజా వేరుగా ఉండేది.
ఆడవాళ్ల కళ్లల్లో కన్నీళ్లు ఆగేవి కాదు : మగ్బుల్, ప్రొజెక్టర్ ఆపరేటర్, ఎస్‌ఆర్‌టీ టాకీస్, కోడుమూరు.
1973లో శ్రీరామచంద్ర టాకీస్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాను. అప్పట్లో కథ, ఫైట్, పాటలకు డిమాండ్ ఉండేది. ఎక్కువగా కుటుంబ చిత్రాలు వచ్చేవి. కొన్ని సన్నివేశాలకు ఆడవాళ్ల కళ్లల్లో కన్నీళ్లు ఆగేవి కాదు. విలన్, శాడిస్ట్టు భర్త, కోడలిని హింసించే అత్తమామలు తెరపై కనిపిస్తే చీవాట్లు పెడుతూ కన్నీరు పెట్టుకొనే వాళ్లు. సినిమా అయిపోయాక కళ్లు తూడుచుకుంటూ ఇంటికి పోయే వాళ్లు. ఇలాంటి సమయంలో తెరపైన పద్మనాభం, రాజబాబు, అల్లురామలింగయ్య వంటి హాస్యనటులు కనిపిస్తే మనసారా నవ్వుకొనేవారు. సినిమా మధ్యలో కరెంటు పోతే జనం పిచ్చెక్కి ఈలలు, కేకులు, ఆరుపుతో పాటు మమ్మల్ని తిట్టేరు. ఎంత అరిచి గీపెట్టినా కరెంటు వచ్చే వరకు ఆగాల్సిందే. లేదా జనరేటర్ సాయంతో సినిమాను నడిపేవాళ్లం, కొన్ని సందర్భాల్లో కరెంటు రాక, జనరేటర్ పని చేయక చివరకు ప్రేక్షకులకు పాస్‌లు ఇచ్చి ఇంటికి పంపించే వాళ్లం. మరుసటి రోజు పాస్‌లు చూపించి హాలులోని లోపలికి వెళ్లాలి.
ప్రజల ఆదరణ లేక టాకీస్‌ను కూల్చివేశాం : ఎక్బాల్, నబి టూరింగ్ టాకీస్, కోడుమూరు.
మా కుటుంబ పెద్దలు 1960లో మహాత్మా టూరింగ్ టాకీస్‌ను కట్టారు. కొన్ని రోజుల అనంతరం మహాత్మా పేరు తొలగించి నబీ టూరింగ్ టాకీస్‌గా పేరు మార్చాం. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద హీరోల సినిమాలు లేక టీవీ, ఓటీటీల ప్రభావంతో థియేటర్‌కు వచ్చే వాళ్లు లేక చాలా ఆటలను నిలిపివేశాం. పని చేసే వాళ్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. 2024లో టూరింగ్ టాకీస్‌ను పడగొట్టి వేశాం. ఆ సమయంలో చాలా బాధ కలిగింది.
అప్పట్లో జనాన్ని అదుపు చేయలేకపోవాళ్ళం: వెంకట్రామిరెడ్డి, ఎస్‌ఆర్‌టీ, యజమాని, కోడుమూరు.
అలనాడు కుటుంబ చిత్రాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉండేది. అప్పట్లో టాకీస్‌కు వచ్చే జనాన్ని అదుపు చేయలేకపోయాం. ఇప్పుడు ఉన్న సీట్లు కూడా నిండటం లేదు. సినిమా హిట్టా.. ఫట్టా అనే తేడా లేకుండా సినిమాను చూసేందుకు ప్రేక్షక అభిమానులు టాకీస్‌కు క్యూ కట్టే వాళ్లు. జనాన్ని అదుపు చేయలేక చివరకు పోలీసుల బలగాలను రప్పించే వాళ్లం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సినిమా హిట్టు అంటే కూడా జనం థియేటర్‌కు రావడం లేదు. కొన్ని సందర్భాల్లో 10 మంది కూడా లేక షోలను నిలిపి వేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే టాకీస్‌ను కొనసాగిస్తున్నాము.