Bandi Sanjay: కేసీఆర్ విషయంలో మౌనమేల..?
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:41 AM
దొంగ నోట్ల కేసుతో సంబంధమున్నట్లు ఆరోపణలు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఆయన దొంగనోట్లు ముద్రిస్తున్నారని.. ధర్నాలు చేసింది కాంగ్రెస్ నేతలే కదా
కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): దొంగ నోట్ల కేసుతో సంబంధమున్నట్లు ఆరోపణలు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్‌పై మౌనం.. కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌ల మధ్య ఉన్న అవగాహనకు నిదర్శనమని స్పష్టం చేశారు. నాడు టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా కేసీఆర్ పనిచేసినప్పుడు.. ‘‘దొంగ నోట్ల మంత్రిని సాగనంపుదాం’’ అంటూ కాంగ్రెస్ నాయకులు ధర్నాలు కూడా చేశారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ అధినేతకు బీదర్‌లో దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని, ఎన్నికలప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు పంచినవన్నీ దొంగనోట్లే అంటూ బండి సంజయ్ ఆదివారం కరీంనగర్‌లో చేసిన ఆరోపణపై బీఆర్‌ఎస్ నాయకులు మూకుమ్మడిగా ఎదురుదాడి చేశారు.
కొన్ని పోలీసు స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ దొంగ నోట్ల వ్యవహారం తాను కొత్తగా చెప్పింది కాదని.. 1997లోనే కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున ఆందోళనలు చేశారని పేర్కొన్నారు. మరోవైపు, బండి సంజయ్ వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమేనని, అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్, జాతీయ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ స్పష్టం చేశారు. ‘‘1996-99 మధ్య కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రతాని రామకృష్ణ గౌడ్‌తో కలిసి దొంగ నోట్లను ముద్రించారు’’ అని వారు పేర్కొన్నారు.