Share News

క్యాపిటల్‌.. గ్యాంబ్లింగ్‌!

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:34 AM

విజయవాడ నగర పాలక సంస్థ 2025-26 బడ్జెట్‌ను వైపీపీ పాలకపక్షం ఏమార్చింది. ఎంత క్యాపిటల్‌ ఆదాయం వస్తుందో, ఎంత ఖర్చు పెట్టాలో తెలియకుండా.. వీటినే ఎక్కువగా చూపి భారీ బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. నూతన ఆర్థిక సంవత్సరంలో రూ.30 కోట్ల మేర ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమైంది. తప్పుల తడకగా ఉన్న బడ్జెట్‌పై విపక్షలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సభ్యుల అభ్యంతరాల నడుమే బడ్జెట్‌ను ఆమోదించారు. ఇది క్యాపిటల్‌ గ్యాంబ్లింగ్‌ బడ్జెట్‌ అంటూ సభ్యులు విమర్శనాస్త్రలు సంధించారు.

క్యాపిటల్‌.. గ్యాంబ్లింగ్‌!

- విజయవాడ నగర బడ్జెట్‌ 2025-26లో ఏమార్చిన వైసీపీ పాలకపక్షం

- క్యాపిటల్‌ ఆదాయం ఎంత వస్తుందో, ఎంత ఖర్చు పెట్టాలో తెలియని వైనం

- వీటిని ఎక్కువుగా చూపి భారీ బడ్జెట్‌కు రూపకల్పన

- నూతన ఆర్థిక సంవత్సరంలో రూ.30 కోట్ల మేర ప్రజలపై వడ్డన

- ఆదాయం రూ.1309.53 కోట్లు, ఖర్చు రూ.1,454.58 కోట్లు

- బడ్జెట్‌పై కౌన్సిల్‌లో అధికారపక్షంపై విపక్షాల మాటల దాడి

- సభ్యుల అభ్యంతరాల నడుమ బడ్జెట్‌కు ఆమోదం

విజయవాడ నగర పాలక సంస్థ 2025-26 బడ్జెట్‌ను వైపీపీ పాలకపక్షం ఏమార్చింది. ఎంత క్యాపిటల్‌ ఆదాయం వస్తుందో, ఎంత ఖర్చు పెట్టాలో తెలియకుండా.. వీటినే ఎక్కువగా చూపి భారీ బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. నూతన ఆర్థిక సంవత్సరంలో రూ.30 కోట్ల మేర ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమైంది. తప్పుల తడకగా ఉన్న బడ్జెట్‌పై విపక్షలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సభ్యుల అభ్యంతరాల నడుమే బడ్జెట్‌ను ఆమోదించారు. ఇది క్యాపిటల్‌ గ్యాంబ్లింగ్‌ బడ్జెట్‌ అంటూ సభ్యులు విమర్శనాస్త్రలు సంధించారు.

రూపాయి రాక :

- రెవెన్యూ ఆదాయం రూ.808.33 కోట్లు

- క్యాపిటల్‌ ఆదాయం రూ.454.15 కోట్లు

- డిపాజిట్లు, ఆడ్వాన్సులు రూ.47.05 కోట్లు

----------------------------------------------------------

మొత్తం రూ. 1,309.53 కోట్లు

------------------------------------------------------------

రూపాయి పోక:

- రెవెన్యూ ఖర్చులు రూ. 705.95 కోట్లు

- క్యాపిటల్‌ ఖర్చులు రూ. 691.78 కోట్లు

- రుణాల చెల్లింపులు రూ. 9.80 కోట్లు

- డిపాజిట్లు అడ్వాన్సులు రూ. 47.05 కోట్లు

-------------------------------------------------------------------

మొత్తం రూ. 1454.58 కోట్లు

-------------------------------------------------------------------

విజయవాడ/కార్పొరేషన్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ ఆశయాలకు అనుగుణమైన బడ్జెట్‌ను తీర్చిదిద్దలేదు. అభివృద్ధి ప్రణాళికలకు నయా పైసా కేటాయింపులు జరపలేదు. కిందటి ఆర్థిక సంవత్సరం క్యాపిటల్‌ ఆదాయాలు కేవలం రూ. 91 కోట్లు మాత్రమే రాగా, 2024- 25 ఆర్థిక సంవత్సరంలో రూ.501.41 కోట్లు వస్తాయని బడె ్జట్‌లో అంకెల గారడీ చేశారు. తీరా చూస్తే మరికొద్ది రోజుల్లో ముగియబోతున్న ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 292 కోట్లనే క్యాపిటల్‌ ఆదాయాలుగా చూపించారు. రానున్న 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.454.15 కోట్ల మేర క్యాపిటల్‌ ఆదాయాలు వస్తాయని చూపారు. వాస్తవంగా క్యాపిటల్‌ ఆదాయాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్స్‌, వివిధ పథకాల నిధులను చూపుతారు. గ్రాంట్స్‌ కొంత మేర వస్తాయి కానీ, కేంద్ర పథకాల నిధులు అయితే ప్రస్తుతం లేవు. మరి ఎలా క్యాపిటల్‌ ఆదాయాలు వస్తాయో వైసీపీ పాలకపక్షం చెప్పాల్సి ఉంది. ఎంత ఆదాయం వస్తుందో, ఎంత ఖర్చు చేస్తామో తెలియని క్యాపిటల్‌ ఆదాయాలు, క్యాపిటల్‌ ఖర్చుల పేరుతో భారీ బడ్జెట్‌కు శ్రీకారం చుట్టి మేము పెద్ద బడె ్జట్‌ పెట్టాం.. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవటం వల్ల ఏమీ చేయలేకపోతున్నామని చెప్పుకునేందుకు వీలుగా వైసీపీ పాలక పక్షం అంకెల గారడీ చేసింది.

పన్నుపోటు తప్పదు!

క్యాపిటల్‌ ఖర్చుల విషయానికి వస్తే 2023 - 24 ఆర్థిక సంవత్సరం వచ్చిన క్యాపిటల్‌ ఆదాయం రూ. 91 కోట్లు కంటే ఎక్కువుగా రూ.167 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి రూ. 779.93 కోట్లు ఖర్చుకు కేటాయింపులు జరిపితే కేవలం రూ. 314.48 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీనర్థం ఏమిటి ? క్యాపిటల్‌ ఖర్చులో కూడా సగం పైగా కోత విధించారు. అలాగే పన్నుల వాత కూడా కనిపించకుండా మోపారు. 2025 - 26 వార్షిక బడ్జెట్‌లో పన్నుల ద్వారా ఆదాయం రూ.333 కోట్లుగా చూపారు. 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా రూ. 303 కోట్ల మేర ఆదాయం సాధించటం జరిగింది. అంటే దీనిని బట్టి చూస్తే నూతన ఆర్థిక సంవత్సరంలో రూ. 30 కోట్ల మేర పన్నుపోటు తప్పదన్నది అర్థమవుతోంది. .

బడ్జెట్‌పై కౌన్సిల్‌లో ధూమ్‌ ధామ్‌

విజయవాడ నగర వార్షిక బడ్జెట్‌ 2025-26 సమావేశం శనివారం కౌన్సిల్‌ హాలులో మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగింది. బడె ్జట్‌ నగరాభివృద్ధిని పెంపొందించే విధంగా లేదని ప్రతిపక్షాలు బడ్జెట్‌పై గొడవ చేశాయి. ప్రతిపక్షాల అభ్యంతరాల నడుమ అధికార వైసీపీ రూ.1,309.53 కోట్ల వార్షిక బడ్జెట్‌ను వీఎంసీ ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించింది. బడ్జెట్‌లో ప్రజలపై పన్నుల భారం లేదని, అభివృద్ధి, సుందరీకరణ, పచ్చదనం, పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇచ్చామని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు.

కన్సల్టేంట్ల ఖర్చుపై విపక్షాల ఆందోళన

నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ విభాగంలో పలువురు సీనియర్‌ ఇంజనీర్‌లు ఉన్నారు. డ్రాప్టులు, డీపీఆర్‌ తయారు చేయటానికి కన్సల్‌టెంట్‌లకు రూ.3.41 కోట్ల చెల్లించడం ఏమిటని టీడీపీ కార్పొరేటర్లు ప్రశ్నించారు. ప్రజాధనం ఇలా వృథాగా ఖర్చు చేయడం సరికాదన్నారు. కొండప్రాంతాల అభివృద్ధికి కేటాయింపులు సక్రమంగా చేయలేదని, నగరంలో సుమారు 22 డివిజన్‌లు కొండ ప్రాంతాల్లోనే ఉన్నాయని, వాటి అభివృద్ధికి కేటాయింపులు చాలా తక్కువుగా ఉన్నాయని టీడీపీ, సీపీఎం ఫ్లోర్‌లీడర్లు నెలిబండ్ల బాలస్వామి, బోయి సత్యబాబు ఆరోపించారు.

తప్పుల తడకగా అజెండా

అజెండాలో ముద్రించిన అంకెలది ఒక తీరు. మేయర్‌ చెప్పిన అంకెలది మరో తీరు. ఈ రెండు కలిసి అధికారులపై మూకుమ్మడి దాడికి దారి తీశాయి. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యులు ఏక స్వరాన్ని వినిపిస్తూ అధికారులు చేసిన తప్పులను ఎండగట్టారు. నగర అభివృద్ధిని ప్రతిబింభించేందుకు పునాది అయినా వార్షిక బడ్జెటును ఇంత దారుణంగా రూపొందిస్తే ఎలా అంటూ మండిపడ్డారు. ఒకనొక సమయంలో కౌన్సిల్‌లో అధికార పార్టీ కార్పొరేటర్‌లే బడ్జెట్‌ తప్పుల తడకలను అధికారుల తీరును ఎండగట్టారు. దీంతో అధికార వైసీపీలో ఇద్దరు కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు వాగ్వివాదానికి దిగారు. మేయర్‌ కలుగుజేసుకోవడంతో గొడవ సర్థుమణిగింది.

అంచనాలు ఆకాశంలో.. అభివృద్ధి పాతాళంలో

వైసీపీ పాలకవర్గం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ గతంలో ఎన్నడూ చూడలేదు. నగరం పూర్తి స్థాయిలో అభివృద్ధి అయినట్లు మేయర్‌ ప్రసంగిస్తున్నారు. అంచనాలు ఆకాశంలో, వ్యయాలు, అభివృద్ధి పాతాళంలో ఉన్నట్టుగా బడ్జెట్‌ ఉంది. ప్రజలపై భారాలు మోపే బడ్జెట్‌ ఇది. క్రీడాకారులపై భారాలు మోపుతున్నారు. రాజీవ్‌గాంధీ పార్కు, కె.ఎల్‌రావు పార్కు, రాఘవయ్య పార్కు ప్రవేశ రుసుం ఎక్కువగా ఉంది. వెంటనే తగ్గించాలి. ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందించడానికి బడ్జెట్‌ను సవరించాలి. ఈ బడ్జెట్‌ వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగంలేదు. నగరాభివృద్ధి దృష్ట్యా పలు అంశాలకు సంబంధించి బడ్జెట్‌ను సవరణ చేయాలి.

-ఎన్‌.బాలస్వామి, టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌

భారాల బడ్జెట్‌ ఇది

ప్రజలపై భారాలు మోపే బడ్జెట్‌. అంకెల గారడీలా, అభివృద్ధిని కుంటుపర్చేలా ఉంది. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రెండు ఒకేలా వ్యవహరిస్తున్నాయి. నగరాభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించడంలో పాలక పక్షం విఫలమైంది. స్ర్టాం వాటర్‌ నిధులు రూ.289 కోట్లు ఎమైపోయాయో తెలియదు. ఈ బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగేది ఏమీలేదు. బడ్జెట్‌లో సవరణలు చేసి అన్ని వర్గాల సంక్షేమాన్ని, నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయాలి.

- బోయి సత్యబాబు, సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌

Updated Date - Mar 23 , 2025 | 01:34 AM