ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:58 PM
విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి.

చీఫ్‌లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లపై డిప్యూటీ డీఈవో ఆగ్రహం
ప్రొద్దుటూరు టౌన్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. సోమవారం జరగాల్సిన చివరి పరీక్ష సోషియల్ పరీక్షను రంజాన్ పండుగను పురష్కరించుకుని మంగళవారం నిర్వహించారు. ఉదయం 9 నుంచి 12.45 గంటల వరకు పరీక్ష జరిగింది. డివిజన్ పరిధిలోని 18 మండలాల్లో 75 పరీక్షా కేంద్రాల్లో 12,431 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 67 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే ప్రొద్దుటూరు మండలంలో 23 పరీక్షా కేంద్రాల్లో 3,758 మంది పరీక్ష రాయగా 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కాగా పరీక్ష చివరి రోజు ఉప విద్యాశాఖాధికారి యు.మీనాక్షి ఏడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి వివిధ పరీక్షా కేంద్రాల్లో చీఫ్, డిపార్టుమెంటల్ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు అన్ని గదులను పరిశీలించకుండా ఒక రూముకే పరిమితమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌బీ మెమోరియల్ పాఠశాల పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్లు, ఇతర పరీక్షా సిబ్బంది కాఫీ, టీలు తాగుతుండడంతో ఈ పరీక్షా కేంద్రమా, హోటలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పరీక్ష జరుగుతున్నా పాఠశాల వాచ్‌మెన్ పాఠశాలలోనే ఉండడంతో వారిని ఒక గదిలో ఉంచి పరీక్ష పూర్తయిన తర్వాత బయటకు పంపాలని పోలీసులకు సూచించారు. నడింపల్లె మున్సిపల్ హైస్కూలు పరీక్షా కేంద్రంలో చీఫ్, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు ప్రధానోపాధ్యాయులుగా పనికిరారని పరీక్షలకు ఎందుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులు పరీక్ష జరిగితే ఏ రోజు తనిఖీ చేయలేదు. ఉపవిద్యాశాఖాధికారి చివరి రోజు తనిఖీకి రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.