Share News

Pending Contractor Bills in AP: చిన్న కాంట్రాక్టర్లకు చిల్లు

ABN , Publish Date - Apr 02 , 2025 | 04:37 AM

టీడీపీ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉండగా, ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పనుల బిల్లులు చకచకా చెల్లించారని ఆరోపణలు వస్తున్నాయి. ఐప్యాక్‌ ప్రాజెక్టులకే ముఖ్యతనిస్తూ వేల కోట్ల రూపాయలు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది

Pending Contractor Bills in AP: చిన్న కాంట్రాక్టర్లకు చిల్లు

  • ఐప్యాక్‌ పనులకు మాత్రం బిల్లులు

  • ఎన్నికల ముందు ఐప్యాక్‌ సూచనలతో పనులు

  • నేడు రాజకీయ ఒత్తిళ్లతోవాటికి చెల్లింపులు

  • సర్కారు మారినా... పాత కాంట్రాక్టర్లకు కష్టాలే

  • 2014-19లో చేసిన బిల్లులు ఇంకా పెండింగే

  • ఇప్పుడు గుంతలు పూడ్చిన తమ్ముళ్లకూ బిల్లుల్లేవ్‌

  • రూ.కోటిలోపు బకాయిల చెల్లింపు ఉత్తుత్తిదేనా!?

  • 1200 కోట్లలో సగం జగన్‌ హయాం పనులకే

మేస్త్రిగా మారిన కాంట్రాక్టర్‌

2014-19 మధ్య పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో ఒక కాంట్రాక్టరు చిన్న చిన్న పనులు చేశారు. ఆయనకు రావాల్సిన బిల్లుల మొత్తం రూ.30 లక్షలు. దీని కోసం అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. జగన్‌ సర్కారు పట్టించుకోలేదు. దీంతో కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినా... పైసా విడుదల కాలేదు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. స్థాయికి మించి అప్పుల్లో మునిగిపోయాడు. కుటుంబాన్ని పోషించడం కోసం ఇప్పుడు తాపీ మేస్త్రిగా పనులకు వెళ్తున్నాడు. ఈయన దయనీయస్థితిని తోటి కాంట్రాక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా... స్పందన లేదు.

వీవీఐపీ పనులు చేయలేం

వీవీఐపీ ప్రోగ్రామ్‌... అంటే ముఖ్యమంత్రి పర్యటన సమయంలో కుర్చీలు, బారికేడ్లు, షామియానాల వంటి పనులు చేసే కాంట్రాక్టర్ల బిల్లులు కొన్ని ఐదేళ్లుగా, మరికొన్ని తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ పనులు చేసిన బిల్లులను జగన్‌ సర్కారు చెల్లించనే లేదు. ఒక్కొక్కరికి పాతిక లక్షల్లోపే పెండింగ్‌లో ఉంటాయి. ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన ప్రకారం... వీళ్లందరికీ చెల్లింపులు జరగాలి. కానీ... పైసా రాలేదు. ఇటీవల చంద్రబాబు తణుకు వెళ్లినప్పుడు, అక్కడ పనులు చేయడానికి కాంట్రాక్టర్లెవరూ ముందుకు రాలేదు. అధికారులు నానా తంటాలు పడి వాళ్లనూ వీళ్లను బతిమాలి ఏర్పాట్లు చేయించారు.


గాజువాకలో ఒక కాంట్రాక్టరు 2018 డిసెంబరులో పాఠశాల గదులను నిర్మించారు. బిల్లు రూ.63 లక్షలు. జగన్‌ ఉన్న ఐదేళ్లూ ఈ బిల్లు క్లియర్‌ కాలేదు. ఇప్పుడు రూ.కోటిలోపు బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఆ కాంట్రాక్టరు తన కష్టం తీరుతుందనుకున్నారు. కానీ... ఇదీ క్లియర్‌ కాలేదు. ఏడేళ్లుగా అదే కష్టం!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు జగన్‌ సర్కారు చుక్కలు చూపించింది. కోర్టులకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నా బిల్లులు చెల్లించలేదు. ఈ సంగతి అందరికీ తెలిసిందే! మరి ఇప్పుడేం జరుగుతోందో తెలుసా?

‘వైసీపీ అధికారంలో లేదు’ అనే లోటు ఏమాత్రం తెలియకుండా... జగన్‌ హయాంలో, కేవలం రాజకీయ కోణంలో చేపట్టిన పనులకూ చకచకా బిల్లులు చెల్లిస్తున్నారు. 2014-19 మధ్య పనులు చేసిన కాంట్రాక్టర్లతోపాటు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు రూ.4వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అయినా సరే... ‘ఐప్యాక్‌’ పనులకే బిల్లుల చెల్లింపులో పెద్ద పీట వేస్తుండటం విశేషం! ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పనులకు సంబంధించి రూ.600 కోట్ల బిల్లులను క్లియర్‌ చేసేశారు. మూడు రోజుల క్రితం ఈ చెల్లింపులు జరిగిపోయాయి.

‘ఐప్యాక్‌’ పనులే ముద్దు...

వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందించిన ‘ఐప్యాక్‌’ ఐదేళ్లూ రాష్ట్రంలో చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ఏడాది ముందు ఎక్కడ ఏ పని చేయాలో కూడా ఐప్యాక్‌ దిశా నిర్దేశం చేసింది. ప్రజావసరాలు, ప్రాధాన్యాలతో నిమిత్తం లేకుండా... కేవలం ఓట్లు, రాజకీయ కోసం అక్కడ రోడ్డేయండి, ఇక్కడ బ్రిడ్జి కట్టండంటూ ఐప్యాక్‌ సూచనలు చేసింది. ఆ పనులను వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. కానీ... కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు. జగన్‌ ఎక్కడికి పోయినా ‘వైసీపీ కాంట్రాక్టర్లు’ చుట్టు ముట్టి... బిల్లుల కోసం గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఇప్పుడు కూటమి సర్కారు ఆ బిల్లులను ఎంచక్కా చెల్లిస్తోంది.


ఎవరికి ఎంత...

మార్చి 30వ తేదీన రూ.2,000 కోట్ల బిల్లులు చెల్లించామని... ఇందులో 90 శాతం రూ.కోటిలోపు బిల్లులున్న చిన్న కాంట్రాక్టర్లేనని ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఇచ్చింది. అయితే... చిన్న కాంట్రాక్టర్లకు రూ.1200 కోట్లకు మించి చెల్లింపులు జరగలేదని తెలుస్తోంది. ఇందులో రూ.600 కోట్లు ఎన్నికల ముందు వైసీపీ హయాంలో జరిగిన ‘ఐప్యాక్‌’ పనులకే చెల్లించినట్లు సమాచారం. విచిత్రమేమిటంటే... ఇప్పుడు అధికారంలో ఉన్న నేతల ఒత్తిడితోనే ఈ బిల్లులు క్లియర్‌ చేసినట్లు చెబుతున్నారు.

చిన్న కాంట్రాక్టర్ల గోడు

‘రూ.2 వేల కోట్లు ఇచ్చేశాం’ అని ప్రభుత్వం ప్రకటించగానే... బిల్లుల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లంతా సంబర పడిపోయారు. ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని మూడు రోజులు వేచి చూసినా ఫలితం లభించలేదు. మరోవైపు... ‘మీకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చేసింది. మా బాకీ కట్టేయండి’ అంటూ అప్పట్లో సిమెంటు, స్టీల్‌, ఇతర మెటీరియల్‌ సరఫరా చేసిన వ్యాపారులు చిన్న కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచారు. ‘మాకు డబ్బు రాలేదు మొర్రో’ అని చెప్పినా... నమ్మడంలేదు. గట్లు బలోపేతం చేయడం, మోటార్ల మరమ్మతులు, కాలువలు పూడిక తీయడం, గుర్రపు డెక్కలు తీయడం, ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పూయడంలాంటి మెయింటెనెన్స్‌ పనుల బిల్లులు 2017-18 నుంచి దాదాపు రూ.80 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పనులు చేసిన వారంతా చిన్న చిన్న కాంట్రాక్టర్లే. ఇవి ఇప్పటికీ క్లియర్‌ కాలేదు. 2018లో జలవనరుల శాఖ కింద పనిచేసిన ఒక కాంట్రాక్టర్‌కు రూ.73 లక్షల బిల్లు రావాలి. తాజా చెల్లింపుల్లో దీనికీ మోక్షం లభించలేదు. తాజాగా... మళ్లీ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పనుల కింద చిన్న కాంట్రాక్టర్లు రోడ్లపై గుంతలు పూడ్చే పనులు చేశారు. వీరిలో కొందరు టీడీపీకి చెందిన వారూ ఉన్నారు. వీటికి సంబంధించి రూ.100 కోట్ల వరకు బిల్లులు ఉన్నాయి. వీటిని కూడా పక్కన పడేశారు. ‘ఐప్యాక్‌’ పనులకు మాత్రం జై కొట్టారు.


ఫిఫో పాటించండి...

బిల్లుల చెల్లింపులకు ఒక పద్ధతి ఉంది. అదే... ఫస్ట్‌ ఇన్‌, ఫస్ట్‌ ఔట్‌ (ఫిఫో). మొదట పని చేసి, బిల్లులు సమర్పించిన వారికి మొదట చెల్లింపులు జరగాలి. ఈ పద్ధతికి వైసీపీ పాతరేసింది. టీడీపీ హయాంలో పనులు చేసిన వారిపై కక్షకట్టినట్లు వ్యవహరించింది. కనీసం ఇప్పుడైనా ‘ఫిఫో’ పాటించాలని చిన్న కాంట్రాక్టర్లు కోరుతున్నారు. కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న బిల్లులకైనా చెల్లింపులు చేయాలని వేడుకుంటున్నారు. రూ.2,000 కోట్లలో 90 శాతం చిన్న కాంట్రాక్టర్లకే ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పిన మాటల్లో నిజం లేదని... ఈ ముసుగులో కోటి రూపాయలు దాటి భారీగా ఉన్న బిల్లులూ చెల్లించేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు రూ.4000 కోట్లు కేటాయించగలిగితే 90 శాతం మంది కష్టాల నుంచి బయటపడతారని పేర్కొంటున్నారు.

ఎన్నెన్ని కష్టాలు..

15వ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లతో మునిసిపాలిటీల్లో నిర్వహించిన రోడ్లు, డ్రెయిన్లు, నీటి సరఫరాకు సంబంధించిన పనులు జరిగాయి. 10 మునిసిపాలిటీల్లో కలిపి రూ.70 కోట్లకు సంబంధించిన బిల్లులు సీఎఫ్ ఎంఎస్‌లో సిద్ధంగా ఉన్నాయి. కానీ... చెల్లింపులు జరగలేదు.

  • పంచాయతీ రాజ్‌లో చేసిన పనులకు బిల్లులు అసలు చేయలేదు. ఇవి దాదాపు రూ.200 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.

  • చిన్న కాంట్రాక్టర్లకు చెల్లింపుల ముసుగులో... నాబార్డు కింద పనులు చేసిన పనుల జాబితాలో బడా కంపెనీలకు కూడా చెల్లింపులు చేశారు.

  • రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు సీఎండీఎఫ్‌, ఎస్‌డీఎఫ్‌ ద్వారా చేసిన పనుల బిల్లులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా సీఎఫ్ ఎంఎస్‌లోకి కూడా ఎక్కలేదు. వైజాగ్‌, అనంతపురం మునిసిపాలిటీల్లో ఎస్‌డీఎఫ్‌ గ్రాంట్ల కింద 2014-19 సమయంలో చేసిన పనులకు కోర్టుకెళ్లి ఆదేశాలు తెచ్చుకుంటేనే బిల్లులు చెల్లించారు. వెళ్లని వాళ్లకు ఇంతవరకు చెల్లించలేదు. ఆ బిల్లులను సీఎఫ్ ఎంఎస్‌లోకి ఎక్కించలేదు. విశాఖ, అనంతపురం, మంగళగిరి-తాడేపల్లి మునిసిపాలిటీల్లో కలిపి ఈ బిల్లులు రూ.10 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 04:37 AM