Farmers: అపరాల రైతులు లబోదిబో!
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:48 AM
క్వింటా పెసలు రూ.8,682, మినుము రూ.7,400, శనగ(బెంగాళీగ్రామ్) రూ.5,440గా కేంద్రం మద్దతు ధరలు ప్రకటించింది. కానీ మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారి పెసలు, మినుములు, రూ.7వేలు, ఎర్రశనగలు రూ,5వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. తెల్ల శనగలు రూ.7వేలు పలుకుతున్నాయి.

దళారుల సిండికేట్ మాయాజాలంతో నష్టాలు
పెసర, మినుము, శనగలకు దక్కని మద్దతు ధర
పెసలుకు 8,682 ఉంటే 1,600 తక్కువ..
మినుము, శనగ 500-1000 తక్కువకు కొనుగోలు
కంది, పొద్దు తిరుగుడు ధరలదీ అదే దారి
ప్రభుత్వ కొనుగోలు అవకాశం 15ు-17ు మాత్రమే
కేంద్ర మద్దతు ధర ప్రకటించినా అమలు కాని వైనం
కర్నూలు, ఆదోని మార్కెట్లలో మరీ దారుణం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆరుగాలం శ్రమించినా అపరాల పంటలకు మద్దతు ధరలు దక్కక బోదిబోమంటున్నారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించినా, వ్యాపారుల సిండికేట్ మాయాజాలంతో గిట్టుబాటు ధర దక్కక రైతులు నష్టాలపాలవుతున్నారు. పంట ఉత్పత్తిలో ప్రభుత్వం కేవలం 15 నుంచి 17శాతం మాత్రం కొనుగోలుచేసే అవకావశం ఉండడంతో పూర్తి పంటను సరైన ధరలకు అమ్ముకోలేక రైతులు సతమతమవుతున్నారు. క్వింటా పెసలు రూ.8,682, మినుము రూ.7,400, శనగ(బెంగాళీగ్రామ్) రూ.5,440గా కేంద్రం మద్దతు ధరలు ప్రకటించింది. కానీ మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారి పెసలు, మినుములు, రూ.7వేలు, ఎర్రశనగలు రూ,5వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. తెల్ల శనగలు రూ.7వేలు పలుకుతున్నాయి. 2023-24లో తీవ్ర వర్షాభావం వల్ల అపరాల సాగు తగ్గి, పంట ఉత్పత్తుల ధరలు పెరిగాయి. దీంతో 2024-25లో ధరలు బాగుంటాయన్న ఆశతో రైతులు అపరాలను విరివిగా సాగు చేశారు. ఖరీ్‌ఫలో తెగుళ్లతో దిగుబడులు తగ్గగా, రబీలో బెట్ట వాతావరణంతో ఉత్పత్తి తగ్గిందని రైతులు చెప్తున్నారు. పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చే సమయంలో దళారులు, స్థానిక వ్యాపారులు సిండికేట్ అవుతున్నారు. దిగుబడులు తగ్గినా రైతులకు మద్దతు ధర కూడా దక్కడం లేదు. పెసలు క్వింటాకు రూ.1600దాకా తక్కువకు అడుగుతున్నారు. మినుము, శనగ క్వింటాకు రూ.500 నుంచి రూ.వెయ్యి దాకా తగ్గిస్తున్నారు. రబీలో శనగ 7.5, పెసర 1.37, మినుము 7లక్షల ఎకరాల్లో పండించారు.
సగటున ఎకరానికి 5నుంచి8 క్వింటాళ్ల దిగుబడులు వచ్చే ఈ పంటలకు ఎకరానికి రూ.35-45వేల దాకా ఖర్చవుతుంది. కౌలు రైతులకు అదనంగా మరో రూ.15వేలదాకా పెట్టుబడి అవుతోంది. గతేడాది శనగలకు మంచి ధరరాక, రైతులు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేశారు. శనగల దిగుమతులపై కేంద్రం ప్రీ ట్యాక్స్ నిర్ణయం తీసుకుని, దిగుమతి సుంకాన్ని 28ు నుంచి జీరో చేసింది. ఈ నిర్ణయం ఈఏడాది అక్టోబరు వరకు అమలులో ఉండనున్నది. దీంతో దేశీయ శనగల ధర పతనమైంది. ఉత్పత్తిలో శనగలు17ు, మినుము 15ు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉండగా, మిగిలిన ఉత్పత్తిని ప్రైవేట్ వ్యాపారులు అడిగిన ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పైగా ఇటీవల పంట ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు తెరుస్తున్నట్లు అధికారులు ప్రకటించినా ఇంకా కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో మద్దతు ధర కన్నా తక్కువకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మితే నష్టాలే మిగులుతాయని రైతులు వాపోతున్నారు. కందుల పరిస్థితి ఇంతే ఉంది.
సన్‌ఫ్లవర్ సీడ్ పరిస్థితి ఇంతే!
కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, బిహార్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో పొద్దు తిరుగుడు అధికంగా పండుతోంది. మార్కెట్‌లో సన్‌ఫ్లవర్ రిఫండ్ ఆయిల్ లీటర్ రూ.150దాకా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు డిమాండ్ ఉంది. పచ్చళ్ల తయారీ, వంట నూనెగా కూడా రాష్ట్రంలో సన్‌ఫ్లవర్ అధికంగానే వాడుతున్నారు. కానీ సన్‌ఫ్లవర్ సీడ్‌కు చాలాకాలంగా కనీస గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా అమలు కావడం లేదు. 2023-24లో క్వింటా రూ.6,760 మద్దతు ధర ఉండగా, 2024-25లో రూ.7,280గా కేంద్రం ప్రకటించింది. కానీ మార్కెట్‌లో రూ.6వేలు కూడా మించడం లేదు. గత నెలలో క్వింటా సన్‌ఫ్లవర్ సీడ్ రూ.రూ.5,273 ఉండగా, ప్రస్తుతం కర్నూలు మార్కెట్‌లో రూ.5,119 ఉండగా, ఆదోనిలో రూ.4,815 మాత్రమే పలికింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి, మద్దతు ధర కన్నా.. క్వింటాకు రూ.2వేలుపైన తక్కువకు అడుగుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం నిరుటి మద్దతు ధర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో ఏటా ఖరీ్‌ఫలో 5 వేలు, రబీలో 8వేల హెక్టార్లలో రైతులు పొద్దు తిరుగుడు పండిస్తున్నారు. ప్రధానంగా ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఈ పంట సాగవుతోంది. కానీ పంటకు గిట్టుబాటు ధర రాక, పెట్టుబడులు కూడా రాక సాగు తగ్గిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే