Heavy Rain: ఈదురుగాలులు, వడగళ్లు..
ABN , Publish Date - Mar 23 , 2025 | 05:17 AM
రాష్ట్రంలో ఓవైపు ఎండలు మండుతుంటే.. కొన్ని జిల్లాల్లో మబ్బు పట్టి వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి పలు జిల్లా ల్లో జోరు వాన కురిసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 278 మండలాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.

పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం
నేడు, రేపు అక్కడక్కడా వర్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రంలో ఓవైపు ఎండలు మండుతుంటే.. కొన్ని జిల్లాల్లో మబ్బు పట్టి వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి పలు జిల్లా ల్లో జోరు వాన కురిసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 278 మండలాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా పెగడపల్లిలో 5.2 సెం.మీ, మంచిర్యాలలో 4.7, పెద్దపల్లి జిల్లా ధర్మారంలో 4.6, కరీంనగర్ జిల్లా గంగాధరలో 4.2, మెదక్ జిల్లా శంకరంపేట్-ఆర్‌లో 4, మేడ్చల్ జిల్లా కీసరలో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వాంకిడి, కెరమెరి, జైనూరు మండలాల్లో శనివారం మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. కాగజ్‌నగర్ మండలంలోని నజ్రూల్‌నగర్ విలేజ్-7లో వడగండ్లతో ఓ కోళ్ల ఫాంలోని 300 కడక్‌నాథ్ కోళ్లు మృతి చెందాయి. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం వడగళ్లు పడ్డాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతో పాటు నవాబ్‌పేట మండలంలో మోస్తరు వర్షం కురిసింది. నల్లగొండతో పాటు దేవరకొండ, కొండమల్లేపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షాలు, వడగళ్లతో అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడంతో పాటు మామిడి కాయలు రాలిపోయాయి. ఆది, సోమవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్‌లో కుండపోత..
హైదరాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుండపోత కురిసింది. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 5.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. కూకట్‌పల్లి అల్లాపూర్ వివేకానందనగర్‌లో 5, మాదాపూర్‌లో 4.8, బోరబండలో 4.8 సెం.మీ వర్షం పడింది. యూస్‌ఫగూడ, శేరిలింగంపల్లి, బోరబండ, రాజేంద్రనగర్, కాప్రా తదితర ప్రాంతాల్లో వడగళ్లు కురిశాయి. ఈదురుగాలులతో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడటంతో అనేక ప్రాంతాల్లో గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి.. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
ఎండదెబ్బకు ఉపాధి కూలీ మృతి
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శనివారం ఎండ మండిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో అత్యధికంగా 39.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉపాధి హామీ పనులు చేస్తున్న ఓ కూలీ అస్వస్థతకు గురై పని స్థలంలోనే మృతి చెందాడు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎనగల్ గ్రామానికి చెందిన పసుల లచ్చయ్య(60) శనివారం గ్రామంలో రోడ్డు పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం విరామ సమయంలో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు.