Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొని అడిషనల్ ఎస్పీ దుర్మరణం
ABN , Publish Date - Mar 23 , 2025 | 05:25 AM
హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ వాక్‌కు వెళ్లొస్తూ రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని అడిషనల్ ఎస్పీ టీఎం నందీశ్వర బాబ్జీ(50) దుర్మరణం చెందారు.

మార్నింగ్ వాక్‌కు వెళ్లొస్తూ రోడ్డు దాటుతుండగా ప్రమాదం
హయత్‌నగర్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ వాక్‌కు వెళ్లొస్తూ రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని అడిషనల్ ఎస్పీ టీఎం నందీశ్వర బాబ్జీ(50) దుర్మరణం చెందారు. 1995 బ్యాచ్ ఎస్సైగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేసిన బాబ్జీ నాలుగు రోజుల క్రితమే అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. నందీశ్వర బాబ్జీ తన భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు రాకేష్ శరత్ ప్రీతంతో కలిసి హయత్‌నగర్ ప్రాంతంలోని లక్ష్మారెడ్డిపాలెంలో నివాసముంటున్నారు.
నందీశ్వర బాబ్జీ ఎప్పట్లాగే శనివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్ కోసం సమీపంలోని జాతీయ రహదారి వద్దకు వెళ్లారు. వ్యాయామం ముగించుకుని ఇంటికి తిరిగొస్తూ తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో రోడ్డు దాటేందుకు యత్నించారు. బాబ్జీ రహదారి మధ్యలో ఉన్న గ్రిల్‌ను దాటగానే విజయవాడ వైపు నుంచి నగరంలోకి వేగంగా వస్తున్న ఓ ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఆయన్ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాబ్జీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.