Vijayawada Hyderabad route: అమరావతికి హైదరాబాద్ మార్గంలో గ్రాండ్ ఎంట్రన్స్‌వే
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:23 AM
అమరావతి రాజధానికి విజయవాడ-హైదరాబాద్ మార్గంలో గ్రాండ్ ఎంట్రన్స్‌వే ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని మూలపాడు నుంచి రాయపూడి వరకు అనుసంధానించనున్నారు.

మూలపాడు నుంచి కృష్ణానది మీదుగా ఐకానిక్ బ్రిడ్జి
మారిన అలైన్‌మెంట్.. గతంలో ఇబ్రహీంపట్నం దగ్గర భూమిపూజ
ఐకానిక్ బ్రిడ్జి డీపీఆర్‌కు కన్సల్టెంట్ కోసం టెండర్లు
విజయవాడ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానికి విజయవాడ-హైదరాబాద్ మార్గంలో గ్రాండ్ ఎంట్రన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మూలపాడు నుంచి అమరావతి రాజధానికి గ్రాండ్ ఎంట్రన్స్‌వే తో పాటు కృష్ణానది మీదుగా ఐకానిక్ బ్రిడ్జి అలైన్‌మెంట్‌ను మార్చింది. ఇంతకు ముందు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర ఐకానిక్ బ్రిడ్జికి భూమి పూజ చేశారు. ఎన్‌హెచ్ - 65, ఎన్‌హెచ్ - 30 లకు అనుసంధానంగా దీనిని ప్రతిపాదించారు. అప్పట్లో 2016 లో ఐకానిక్ బ్రిడ్జికి ప్రతిపాదించినపుడు విజయవాడ వెస్ట్ బైపాస్ లేదు. తర్వాతి క్రమంలో గొల్లపూడి నుంచి సూరాయపాలెం మీదుగా కృష్ణానది మీద 3 కిలోమీటర్ల పొడవున విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం జరిగింది. అమరావతి రాజధానిలో వెంకటపాలెం మీదుగా కాజా వరకు ఇది సాగుతుంది. గొల్లపూడి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు దగ్గర దగ్గరగా ఉండటంతో ఐకానిక్ బ్రిడ్జి ఇక్కడ ఏర్పాటు చేయటం సముచితం కాదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు సరికొత్త అలైన్‌మెంట్‌పై కసరత్తులు చేశారు. ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మూలపాడు దగ్గర నుంచి ఎన్‌హెచ్ - 65 ను అనుసంధానిస్తూ గ్రాండ్ ఎంట్రన్స్ వే ఏర్పాటు చేయాలని భావించారు. ఈ గ్రాండ్ ఎంట్రన్స్‌వే నుంచి ఐకానిక్ బ్రిడ్జిని కృష్ణానదిపై నిర్మించాలని నిర్ణయించారు.
మూలపాడు నుంచి కృష్ణానది మీదుగా రాయపూడి వరకు 5.2 కిలోమీటర్ల మేర ఈ గ్రాండ్ మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిశ్చయించారు. ఎందుకంటే అమరావతి రాజధానిలో శాఖమూరు నుంచి రాయపూడి వరకు ఎన్ - 13 రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ గ్రాండ్ ఎంట్రన్స్ మార్గాన్ని రాయపూడి దగ్గర ఎన్ - 13 రోడ్డుకు అనుసంధానం చేయటం ద్వారా రాజధానిలోని అన్ని ప్రాంతాలకూ అనుసంధానమవుతుంది. అమరావతి గ్రాండ్ ఎంట్రన్స్ మార్గంలో భాగంగా కృష్ణానదిపై 4 కిలోమీటర్ల మేర ఐకానిక్ బ్రిడ్జి పొడవు ఉంటుందని తెలుస్తోంది. శనివారం అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు ఐకానిక్ బ్రిడ్జి కి సంబంధించి డీపీఆర్ తయారు చేసేందుకు కన్సల్టెంట్‌కు టెండర్లు పిలిచారు. మూలపాడు దగ్గర ఎన్‌హెచ్ - 65కు అనుసంధానం చేయటం ద్వారా హైదరాబాద్ రూట్‌లో ఈ మార్గం గేట్‌వేగా మారే అవకాశముంది.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News