Kadiri: నమో నారసింహా!
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:17 AM
వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో పుర వీధులు మార్మోగాయి. రథంపై దేవదేవుడిని వీక్షించిన భక్తులు.. తన్మయత్వంతో నమో నారసింహ అని నినాదాలు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనది బ్రహ్మరథోత్సవం.

వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మ రథోత్సవం
కదిరి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మ రథోత్సవం కన్నుల పండువగా సాగింది. వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో పుర వీధులు మార్మోగాయి. రథంపై దేవదేవుడిని వీక్షించిన భక్తులు.. తన్మయత్వంతో నమో నారసింహ అని నినాదాలు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనది బ్రహ్మరథోత్సవం. ఈ వేడుకకు రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారి బ్రహ్మరథోత్సవం గురువారం ఉదయం 8.16 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.56 గంటలవరకూ సుమారు 7.40 గంటల పాటు కొనసాగింది. ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మరథోత్సవాన్ని వీక్షించడానికి తరలివచ్చిన భక్తులతో కదిరి వీధులన్నీ బుధవారం రాత్రి నుంచే కిక్కిరిశాయి. రథంపై కొలువుదీరిన శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుడిని దర్శించుకోవడానికి భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. నిప్పులు చెరిగే ఎండను సైతం లెక్కచేయకుండా మిద్దెలు ఎక్కారు. రోడ్లపై నిలబడ్డారు. ‘నాలుగు గోపురాల వాడా.. గోవిందా.. లక్ష్మీ నారసింహా.. గోవిందా’ అంటూ రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఉత్సవం ముగిసిన తర్వాత ఆలయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..