Share News

CM Chandrababu: ఏపీలో సుపరిపాలన అందిస్తాం

ABN , Publish Date - Apr 14 , 2025 | 01:44 PM

CM Chandrababu: . సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలను ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. స్వర్ణాంద్ర ప్రదేశ్ సాధన కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తెలుగు వారు ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పారు.

 CM Chandrababu: ఏపీలో సుపరిపాలన అందిస్తాం
AP CM Chandrababu

గుంటూరు: చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ పథకాలను ఏపీలో అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గత వైసీపీ పాలకులు అమరావతిని ఎడారి అన్నారని మండిపడ్డారు. రాజధానిని ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాకతో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.


గత ఐదేళ్లు వైసీపీ పాలనలో భయానక పరిస్థితులు ఉన్నాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. గత ఎన్నికల్లో 94 శాతం అభ్యర్థులు గెలిచారని గుర్తుచేశారు. మళ్లీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని అన్నారు. నష్టపోయిన ఏపీని పునర్‌ నిర్మాణం చేస్తున్నామని అన్నారు. ఏపీలో సుపరిపాలన అందిస్తున్నాం.. పేదలకు అండగా నిలిచామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇవాళ(సోమవారం) గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని పొన్నెకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.


అందరం స్వేచ్ఛగా ఉన్నామంటే రాజ్యాంగమే కారణమని సీఎం చంద్రబాబు అన్నారు. 2019-24 మధ్య ప్రజలు ఆనందంగా ఉన్న రోజులే లేవని చెప్పారు. తనలాంటి వాళ్లు కూడా బయటకు రాలేని పరిస్థితి ఉందని అన్నారు. విద్యార్థులు కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలని సూచించారు. అప్పుడే ఉన్నత లక్ష్యాలకు చేరుకోగలరని సీఎం చంద్రబాబు అన్నారు. అంబేద్కర్‌ చూపిన మార్గంలో అందరూ నడవాలని సూచించారు.


మనందరికీ హక్కులు ఉన్నాయంటే.. అంబేద్కరే కారణమని సీఎం చంద్రబాబు అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అంబేద్కర్‌ అని అభివర్ణించారు. దళితులకు 8 లక్షల ఎకరాలు పంచిన ఏకైక పార్టీ టీడీపీనేనని ఉద్ఘాటించారు. దళితులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని మాటిచ్చారు. రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఆలోచన చేసింది ఎన్టీఆరేనని గుర్తుచేశారు. అంబేద్కర్‌ ఓవర్సీస్‌ పథకంలో ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నామని తెలిపారు. ప్రతిష్టాత్మక వర్సిటీలు అమరావతికి తరలి వస్తున్నాయని అన్నారు. సబ్‌ ప్లాన్‌ ద్వారా దళితుల అభివృద్ధికి కృషిచేస్తున్నామని చెప్పారు.


రెసిడెన్షియల్‌ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. దళితులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల ద్వారా అభివృద్ధి సాధ్యమని అన్నారు. గతంలో ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారని చెప్పారు. ఇప్పుడు ఐటీలో మనమే నెంబర్‌ వన్‌‌గా ఉన్నామని తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌ తయారుచేశామని అన్నారు. ప్రపంచంలోనే తెలుగుజాతి నెంబర్ వన్‌గా ఉంటుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలను ఆదుకోవాలని చెప్పారు. అందుకే పీ4 కార్యక్రమం మొదలు పెట్టామని అన్నారు. విజన్ 2047 ద్వారా స్వర్ణాంద్ర ప్రదేశ్ సాధన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తెలుగు వారు ఉన్నారని అన్నారు.


చాలా చోట్ల అత్యధిక సంపాదన తెలుగు వారిదేనని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రవాసాంద్రులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని అన్నారు. మార్గదర్శి బంగారు కుటుంబంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో మన దేశంలో మౌలిక వసతులు చాలా వచ్చాయన్నారు. అందుకే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా పేదరిక నిర్మూలన కోసం పీ4 తెచ్చామని గుర్తుచేశారు. ప్రైవేటు భాగస్వామ్యంతో పేదల జీవితాలు మార్చడం కోసం పని చేస్తున్నామని అన్నారు. పొన్నెకల్లు గ్రామంలో ఇంకా 300 మందికి ఇంకా మరుగుదొడ్లు లేవని తెలిపారు. ఆరు నెలల్లో వారందరికి మరుగుదొడ్లను తమ ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. పొన్నెకల్లు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. 24 ఇళ్లల్లో ఇంకా విద్యుత్ సౌకర్యం లేదని.. ఆ ఇళ్లల్లో వెంటనే సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Unseasonal Rains Damage: చేతికొచ్చిన పంట నేలరాలింది.. అన్నదాత కంట కన్నీరు

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 02:13 PM