Mayor Vs Commissioner: గుంటూరు నగర పాలక సంస్థలో ఏం జరుగుతోంది...
ABN , Publish Date - Jan 23 , 2025 | 03:37 PM
Mayor Vs Commissioner: బుడమేరు వరద సాయంలో గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు అవినీతికి పాల్పడ్డారని మేయర్ మనోహర్ ఆరోపించారు. కమిషనర్ అవినీతిపై చర్చకు రమ్మని సవాల్ విసిరానని.. కమిషనర్ పులి శ్రీనివాస్ కోసం మూడు గంటలు తన ఛాంబర్‌లో వెయిట్ చేసినట్లు తెలిపారు. కానీ కమిషనర్ నుంచి స్పందన లేదన్నారు.

గుంటూరు, జనవరి 23: గుంటూరు నగర పాలక సంస్థలో (Guntur Municipal Corporation) నిధుల దుర్వినియోగం వివాదం కొనసాగుతోంది. మేయర్ వర్సెస్ కమిషనర్‌గా పరిస్థితి మారిపోయింది. బుడమేరు వరద సాయంపై (Budameru flood relief) ఫిర్యాదులు చేసుకోవడంతో పాటు సవాళ్లు చేసుకునే పరిస్థితికి వెళ్లింది వివాదం. వరద సాయం పేరుతో కమిషనర్ పులి శ్రీనివాసులు (Commissioner Puli Srinivasulu) దోపిడీ చేశారని మేయర్ కావటి మనోహర్ నాయుడు (Mayor Manohar Naidu) ఆరోపిస్తున్నారు. అయితే మేయర్ ఆరోపణలను కమిషనర్ కొట్టిపారేస్తున్నారు. తొమ్మిది కోట్ల వరకు వరద సాయం చేసినట్లు కమిషనర్ లెక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో కమిషనర్‌కు మేయర్ సవాల్ విసిరారు. దమ్ముంటే వరద సాయం వివరాలను ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.
ఈరోజు మధ్యాహ్నం వరకు ఛాంబర్‌లోనే ఉంటానని.. తన ఛాలెంజ్‌ను కమిషనర్ స్వీకరించి వరద సాయం లెక్కలను చూపించాలని స్పష్టం చేశారు. చెప్పిన ప్రకారమే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల వరకు మేయర్ తన ఛాంబర్‌లోనే కమిషనర్ కోసం వేచి చూశారు. కమిషనర్ వచ్చి వివరాలు ఇస్తారా అనేదానిపై నగర పాలక సంస్థలోనూ ఆసక్తి నెలకొంది. అయితే కమిషనర్ మాత్రం అక్కడకు రాలేదు.
రాలేదంటే.. అర్ధం అదే కదా: మేయర్
బుడమేరు వరద సాయంలో గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు అవినీతికి పాల్పడ్డారని మేయర్ మనోహర్ ఆరోపించారు. కమిషనర్ అవినీతిపై చర్చకు రమ్మని సవాల్ విసిరానని.. కమిషనర్ పులి శ్రీనివాస్ కోసం మూడు గంటలు తన ఛాంబర్‌లో వెయిట్ చేసినట్లు తెలిపారు. కానీ కమిషనర్ నుంచి స్పందన లేదన్నారు. దీన్నిబట్టి వరద సహాయ నిధులను దోపిడీ చేశారని అర్థమవుతోందన్నారు. వరద సహాయ నిధులను మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు దోచేశారని ఆరోపణలు గుప్పించారు. అదంతా ప్రజల సొమ్ము అని.. కమిషనర్ ప్రజలకు లెక్క చెప్పాల్సి ఉందని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశం పెట్టమని కమిషనర్‌ను అడుగుతున్నామని.. కానీ పులి శ్రీనివాసులు ఎన్నికలను అడ్డంపెట్టి తప్పించుకున్నారని వ్యాఖ్యలు చేశారు.
‘‘అందుకే అవినీతి పైన చర్చించేందుకు నా చాంబర్ కు రమ్మని సవాల్ విసిరాను’’ అని తెలిపారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కూడా పులి శ్రీనివాసులు అవినీతిపై లెటర్లు రాసినట్లు తెలిపారు. ప్రజలు సొమ్మును దోచేసిన పులి శ్రీనివాసులు నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామన్నారు. కమిషనర్ రిటైర్ అయినప్పటికీ ఆయనను వదిలే ప్రసక్తే లేదని గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పష్టం చేశారు.
కాగా.. బుడమేరు వరద సాయం పేరుతో గుంటూరు నగర పాలక సంస్థలో రూ.9.23కోట్లు పెట్టిన ఖర్చులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని కమిషనర్ పులి శ్రీనివాసులుపై మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు జిల్లా, రాష్ట్ర అధికారులకు కూడా ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. తాను అవినీతి పాల్పడినట్లు నిరూపిస్తూ ఐఏఎస్‌కు కూడా రాజీనామా చేస్తానని కమిషనర్ ప్రకటన చేశారు కూడా. అయితే కమిషనర్ అవినీతి చేయలేదని భావిస్తే రూ.9.23 కోట్ల లెక్కలు ఇవ్వాలని.. ఈరోజు తన ఛాంబర్‌లోనూ ఉంటానని మేయర్ సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
Lokesh Birthday: లోకేష్‌కు శుభాకాంక్షల వెల్లువ
Read Latest AP News And Telugu News