Andhra University: ఆర్ట్స్ విద్యార్థికి 1.3 కోట్ల ప్యాకేజీ
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:16 AM
భారీ ప్యాకేజీలు, కోట్లలో వార్షిక వేతనాలు అంటే ముందుగా గుర్తొచ్చేది ఇంజనీరింగ్ విద్యార్థులే...!

భారీ జాక్‌పాట్ కొట్టిన శ్రీకాకుళం వాసి
చదివింది ఏయూలో ఎంహెచ్‌ఆర్‌ఎం పోలాండ్ కంపెనీకి హెచ్‌ఆర్ అసిస్టెంట్‌గా ఎంపిక
విశాఖపట్నం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): భారీ ప్యాకేజీలు, కోట్లలో వార్షిక వేతనాలు అంటే ముందుగా గుర్తొచ్చేది ఇంజనీరింగ్ విద్యార్థులే...! కానీ.. ఆర్ట్స్ విద్యార్థులు కూడా భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించవచ్చని శ్రీకాకుళం జిల్లా వాసి హనుమంతు సింహాచలం నిరూపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లో మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (ఎంహెచ్‌ఆర్‌ఎం) పూర్తిచేసిన హనుమంతు... రూ.1.3 కోట్ల వార్షిక ప్యాకేజీతో పోలాండ్‌కు చెందిన ప్రముఖ డెయిరీ సంస్థ (కోవై్‌స్క)లో హెచ్‌ఆర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించారు. ఈ క్రమంలో ఏయూలో ఇంజనీరింగ్ విద్యార్థి పేరిట ఉన్న అత్యధిక ప్యాకేజీ రికార్డును ఆయన బద్ధలు కొట్టారు. ఈ ఉద్యోగం సాధించేందుకు అనుసరించిన ప్రణాళికలు, నేర్చుకున్న స్కిల్స్ గురించి హనుమంతు సింహాచలం ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ప్రభుత్వ పాఠశాలలో చదువు.. పోలాండ్‌లో కొలువు మాది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఉద్దండపాలెం గ్రామం. తల్లిదండ్రులు భీమారావు, కమలకుమారి వ్యవసాయం చేస్తుంటారు. విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోనే సాగింది.
2022లో ఏయూలో ఎంహెచ్‌ఆర్‌ఎం కోర్సులో చేరినప్పటి నుంచి అధ్యాపకులు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సలహా మేరకు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాను. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. 2024లో కోర్సు పూర్తయిన వెంటనే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో హిందుస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్‌లో రూ.3.6 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అక్కడ పనిచేస్తూనే క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సలహా మేరకు మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా. ఈ క్రమంలో పోలాండ్‌లోని డెయిరీ సంస్థ తమ హెచ్‌ఆర్ విభాగంలో పోస్టుల భర్తీకి వర్సిటీ అధికారులను సంప్రదించగా... ప్లేస్‌మెంట్ ఆఫీసర్ నాకు సమాచారం ఇచ్చారు. లింక్డిన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరైతే.. నేను ఇంగ్లీషు మాట్లాడిన తీరు వారికి నచ్చింది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని సదరు సంస్థ నన్ను హెచ్‌ఆర్ అసిస్టెంట్‌గా ఎంపికచేసింది. మేలో విధుల్లో చేరేందుకు సిద్ధంకావాలని సమాచారం ఇచ్చింది.’’అని తెలిపారు.