కరోనా విలయం.. ఓ చేదు జ్ఞాపకం
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:44 AM
సమా జంలో ఒకరి చూసి మరొకరు భయపడే పరిస్థితి కల్పించింది. రక్తబంధువులే మృత దేహాలను పట్టుకోవడానికి, సమీపంలోకి రావడానికి భయబ్రాంతులకు గురయ్యారు. ఆ వ్యాధి పేరే కరోనా. దీనిని కట్టడి చేసేం దుకు ఐదేళ్ల క్రితం ఇదే రోజున లాక్‌డౌన్ విధించారు. అప్పటి భయానక పరిస్థితులు నేటికీ జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి.

లాక్‌డౌన్.. నేటికి ఐదేళ్లు
ఏలూరుక్రైం/తణుకు రూరల్/తాడేపల్లిగూడెం రూ రల్/భీమవరం క్రైం/ నరసాపురం/పాలకొల్లు,మార్చి 23 (ఆంధ్రజ్యోతి) :
పూర్వం ప్లేగు, మశూచి, క్షయ వచ్చిన వారిని ఎక్కడో ఊరిచివర ఉంచేవారని, వారిని చూడడానికి రక్తబంధువులే వెళ్లే వారు కాదని చరిత్రలో చదువుకున్నాం. అయితే ఇప్పటి తరానికి అటువంటి దృశ్యా లను కళ్ళారా చూపింది ఓ వ్యాధి. సమా జంలో ఒకరి చూసి మరొకరు భయపడే పరిస్థితి కల్పించింది. రక్తబంధువులే మృత దేహాలను పట్టుకోవడానికి, సమీపంలోకి రావడానికి భయబ్రాంతులకు గురయ్యారు. ఆ వ్యాధి పేరే కరోనా. దీనిని కట్టడి చేసేం దుకు ఐదేళ్ల క్రితం ఇదే రోజున లాక్‌డౌన్ విధించారు. అప్పటి భయానక పరిస్థితులు నేటికీ జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవితాలను అతలాకుతలం చేసి చరిత్రలో కొవిడ్–19 చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఎక్కడో చైనా లోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ఖండాలు దాటి మానవాళిని భయబ్రాంతులకు గురి చేసి జీవవిధా నాన్నే మార్చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమవరం, తణుకు ప్రాంతాల నుంచి కొంతమంది ముస్లింలు ఢిల్లీలోని ఒక మసీదు వద్ద జరిగిన ప్రార్థనలకు 2020 మార్చి 14న వెళ్లి 19న వచ్చారు. తిరిగి వచ్చిన ప్పటి నుంచి అనారోగ్యానికి గురికావడంతో మార్చి 30న పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 1న మొత్తం ఒకేసారి 19 కేసులను గుర్తించడంతో జిల్లా ఉలిక్కి పడింది. వారందరినీ ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత వ్యాధి క్రమేపీ అన్ని ప్రాంతా లకు పాకింది. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో సుమారు 1800 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో చాలా మంది మృతదేహాలను తీసుకెళ్లకపోవడంతో చివరకు ప్రభు త్వమే దహనాలు చేయించింది. మృతదేహాలను తీసుకెళ్లితే దహన ఖర్చుల నిమిత్తం రూ.15వేలు అందించింది. కరోనాలో మృతి చెందిన ప్రతి ఒక్కరి పేరిట కుటుంబ సభ్యులకు రూ.50 వేలను ఆర్థిక సాయంగా అందించింది. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పో యిన చిన్నారులు 13 మంది ఉన్నారు. లాక్‌డౌన్ కార ణంగా రోజూ వారీ కూలీ పని చేసుకుంటేనే గానీ పూట గడవని అనేక కుటుంబాలకు దాతలు,స్వచ్ఛంద సంస్థలు అందించిన సహాయం మరువలేం. నిత్యావస ర వస్తువులు, బియ్యం అందజేసి ఆదుకున్నారు.
సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి నియంత్రించడానికి లాక్‌డౌన్ ప్రకటించిన రోజు. 2020 మార్చి 22న జనతాకర్ఫ్యూ అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఆ మరుసటి రోజే దేశ వ్యాప్తంగా నెల రోజుల పాటు లాక్‌డౌన్ అంటూ ప్రకటించా రు. భారత దేశంలో మొత్తం ఐదు లాక్‌డౌన్‌లు కరోనా పేరిట జరిగాయి. 2020 మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు (21 రోజులు), రెండో దశగా ఏప్రిల్ 15 నుంచి మే 3వ తేదీ వరకు (19 రోజు లు), మూడో దశగా మే 4 నుంచి 17 వరకు (14 రోజులు), నాల్గో దశగా మే 18 నుంచి 31 వరకు (14 రోజులు), ఐదవ దశగా జూన్ 1 నుంచి జూన్ 30 వరకు (30 రోజులు) లాక్‌డౌన్లను ప్రక టించారు. లాక్‌డౌన్ ఉప సంహరణను మాత్రం 22 దశలుగా 2021 అక్టోబరు ఆఖరు నాటికి ఉప సంహరించారు. లాక్‌డౌన్ కాలంలో అత్యవసర సర్వీసులు మినహా మిగిలిన వారెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని నిషేధాజ్ఞలు విధిం చారు. కరోనా సోకిన ప్రాంతంలో రెడ్‌జోన్లు గా ప్రకటించి పోలీసు పహరాతో నిర్బంధం విధించా రు. అక్కడి వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు 15 రోజుల పాటు నిర్బంధంలో ఉంచి పరీక్షలు చేసిన అనంతరం పంపించేవారు. రోడ్లపై జన సంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. ప్రజా రవాణా వ్యవస్థలైన రైల్వే, ఆర్టీసీ, విమాన సర్వీసులను ప్రభుత్వమే నిలిపివేసింది. కేవలం ప్రభుత్వ వైద్యశాలలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. స్వాతంత్య్ర భారత దేశంలో 1947లో దేశ విభజన తర్వాత ఆస్థాయిలో ప్రజా జీవనంపై ప్రభావం చూపిన ఘటనగా ఈ జనతా కర్ప్యూ చరిత్రలో నిలిచిపోయింది.
కొవిడ్ –19 పరిణామాలు
కొవిడ్–19 వల్ల మానవ జీవితంలో అనేక మార్పు లు వచ్చాయి. ముఖ్యంగా లాక్‌డౌన్ కాలంలో ఉద్యో గులు, విద్యార్థులకు ఆన్‌లైన్ పని, ఆన్‌లైన్ స్టడీలు కొత్తగా ప్రవేశించాయి. దీనితో చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ ఇంటి నుంచే విధులు నిర్వర్తించి జీతాలు పొందే అవకావం కల్పించారు. ఇప్పటికీ కొన్ని సంస్థల్లో ఇంటి నుంచే పని చేసే విధానం అమలవు తోంది. కొవిడ్ కాలంలో విద్యార్థులకు సూచించిన ఆన్‌లైన్ విద్యా విధానంతో విద్యార్థులలో అనేక మా ర్పులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో మొబైల్‌లోనే పాఠాలు చదవడం, రాయడం వంటి చేయడం వల్ల పుస్తక పఠనంపై విద్యార్థులకు ఆసక్తి తగ్గిపోయింది. మరో వైపు ప్రస్తుతం యువత పూర్తి స్థాయిలో మొబైల్ ఫోన్‌లకు బానిసలుగా మారిపోయారు. యువతతో పాటు చిన్నారులు మొబైల్ చూడకుండా ఉండలేక పోతున్నారు. మరోవైపు వీటితో పాటు ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధవహిస్తున్నారు. పోషకాహారం తినాలనే అవసరం ఏర్పడింది. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరి శుభ్రత పాటించడం, ఆచరించడం వంటి అలవాట్లు ఎక్కువ మందిలో ఏర్పడింది.
భీమవరానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రాము (పేరు మార్చాం) కొవిడ్‌కు ముందు భారీగా పొలాలు కొనుగోలు చేసి వెంచర్లు వేశాడు. అప్పులు చేసి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. కొవిడ్ రావడంతో లాక్‌డౌన్ విధించారు. వెంచర్లు అమ్ముడుకాలేదు. అప్పులకు వడ్డీలు భారీగా పెరిగాయి. చివరకు ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో ఆత్మ హత్య చేసుకున్నాడు. అతని కుటుంబం రోడ్డునపడింది. అప్పులు ఇచ్చినవారు ఆ వెంచర్లను స్వాధీనం చేసుకున్నారు.
భీమవరం సమీపంలో పాలకోడేరు మండలానికి చెందిన సతీష్ (పేరు మార్చాం) వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించాడు. ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తెకు వివాహం చేయడానికి మంచి సంబంధం చూశాడు. ఇంతలో లాక్‌డౌన్ రావడంతో సీన్ రివర్స్ అయ్యింది. వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. అనుకున్న కట్నం ఇవ్వలేకపోయాడు. దానికితోడు అతనికి కొవిడ్ సోకి ఆస్పత్రిలో కన్నుమూశాడు. పెళ్లి రద్దయింది. ఆ కుటుంబం పరిస్థితి చిన్నాభిన్నం అయ్యింది. పిల్లలు ఇద్దరూ జీతానికి పని చేస్తున్నారు.
పాలకొల్లు మండలం గొల్లవానిచెర్వుకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు కేవలం వారం వ్యవధిలో కొవిడ్ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. కరోనా చికిత్స పొందుతూ ఇంటి యజమాని మృతిచెందగా మూడు రోజులు వ్యవధిలో అతడి భార్య, మరో మూడు రోజులు వ్యవధిలో అతని తల్లి మృతి చెందారు.
పాలకొల్లుకు చెందిన ముగ్గురు అన్నదమ్ములు కరోనాతో ఇరవై రోజుల వ్యవధిలోు మృతి చెందారు.
పాలకొల్లు టెలిఫోన్ ఎక్సేంజ్ ప్రాంతంలో వృద్ధ దంపతుల్లో భార్య తెల్లవారు జామున మృతి చెందగా ఆరోజు సాయంత్రానికి భర్త మృతి చెందారు.
భీమవరం సమీపంలోని ఓ గ్రామంలో ఓ ఇంటిలో యజమా నికి కరోనా వచ్చింది. దాంతో ఆ ఇంట్లో అందరికీ కరోనా పరీక్ష లు చేయగా భార్యకు కరోనా వచ్చిందని తేలడంతో వారిద్దరిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా కరోనాతో పోరాడి చివరికి ఆస్పత్రిలోనే కన్నుమూశారు. వారి మృతదేహాలను ఇంటికి తీసుకొచ్చే అవకాశం లేక బయటే ఖననం చేశారు. పిల్లలకు చివరిచూపు దక్కకపోవడంతో పిల్లల రోదన వర్ణణాతీతం.
ఏలూరునకు చెందిన ఒక కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి ఒక కొరియర్ సంస్థలో పనిచేస్తూ తన భార్య, పిల్లలను పోషించేవాడు. అత నికి కరోనా సోకి కోలుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు ఆడ పిల్లలతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కాస్త చదువుకోవ డంతో ఇంటి వద్దే విద్యార్థులకు ట్యూషన్లు చెప్పుకుంటూ తమ పిల్లలను చదివించుకుంటోంది. ఆ బిడ్డలకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందితే చిన్నపాటి వ్యాపారం చేసుకుని పిల్లలను ప్రయోజకులను చేయాలని ఆ తల్లి ఆశపడుతోంది.
ఏలూరులోని ఒక వ్యాపారం నిర్వహిస్తున్న యజమానికి కరోనా వచ్చి మరణించగా ఆయన భార్య, పెళ్లికాని కుమారుడు కరోనాతోనే మరణించాడు. చివరకు కుమార్తె అమెరికాలో ఉండడంతో ఆమె వచ్చి చూసి తల్లడిల్లిపోయింది. ఇలాంటి కుటుంబాలు మరెన్నో. జంగారెడ్డిగూడెం మండలం లోను ఇలాంటి ఘటనలే ఉన్నాయి.
నరసాపురానికి చెందిన ఓ పండ్ల వ్యాపారి ఉపాధి లేక రెండు నెలల పాటు ఆర్థికంగా కష్టాలు పడ్డారు. దాతలు ఇచ్చిన సాయంతోనే ఒక పూట తిని మరో పూట పస్తులతో ఉన్నారు. ఇక రెడ్ జోన్‌లో ఉన్నవారి పరిస్థితి మరింత దయనీయం. రెడ్ జోన్ వచ్చిదంటే.. చాలు 20 రోజుల వరకు బయటకు రాలేని పరిస్థితి. ఆ రోజుల్ని తలుచుకుంటేనే భయం వేస్తోందని పాతబజార్ ప్రాంతానికి చెందిన మౌలాలీ అప్పటి భయానక రోజులను గుర్తు చేసుకున్నాడు.
అప్పట్లో తాడేపల్లిగూడెంలోని జర్నలిస్ట్‌లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 57 మంది పరీక్షించుకోగా వారి లో 20 మందికి పైగా కరోనా పాజిటివ్ రావడంతో వారందరిని తాడేపల్లిగూడెం శివారు టిడ్కో ఇళ్ల వద్దకు తరలించారు. వారిలో ఓ జర్నలిస్ట్ సుధీర్ భయపడుతూనే ఏడు రోజులు క్వారంటైన్‌లో గడిపాడు. రెండోసారి పరీక్షలు చేస్తే కరోనా లేదని వైద్యులు చెబితే కొందరు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకోగా సుధీర్‌కు మాత్రం మళ్లీ కరోనా పాజీటివ్ రిపోర్టు రావడంతో హడలిపోయాడు. మరో ఓవారం క్వారంటైన్‌లోనే గడిపి కరోనా లేదని నిర్ధారించుకున్నాక బయటకు వచ్చాడు.
వ్యాపారం సర్వనాశనం
సరిగ్గా ఐదేళ్ల క్రితం లాక్‌డౌన్ విధించ డంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితి. వ్యాపారాలు లేక అవస్థలు పడ్డాం. అద్దెలు చెల్లించలేని పరిస్థితి. ఇంట్లో గడవాలంటేనే అగమ్యగోచరం. కొవిడ్–19 మహమ్మారి మళ్ళీ రాకుండా ఉంటేనే అందరం బాగుంటాం. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవు.
– జి. విఠాబాశంకర్, వ్యాపారి, భీమవరం
వ్యాపారాలు కోలుకోలేదు
కొవిడ్–19 చాలామంది జీవితాలను నాశనం చేసింది. లాక్‌డౌన్‌లో పాలప్యాకెట్ వద్ద నుంచి నిత్యావసరాల వరకు అన్నీ అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాపారాలు కోలుకోలేదు. చాలామంది అప్పట్లో ఖరీదైన వైద్యానికి అప్పుల పాలయ్యారు. .
– బి. షావుకారు, వ్యాపారి, భీమవరం
ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోయాం
లాక్‌డౌన్‌తో చిరు వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. దీనికి తోడు కొవిడ్ 19తో బాధ పడుతూ కార్పొరేట్ వైద్యం కోసం రూ.లక్ష లు ఖర్చు చేయడంతో ఇప్పటికీ ఆ అనారోగ్య కారణంగా అనేక ప్రతి కూలత లతో జీవిస్తున్నాం. డయాబెటిక్ సమస్యలతో బాధపడుతున్న నాకు కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా ఏర్పడిన సమస్యల కారణంగా కార్పొరేట్ ఆస్పత్రి రూ. 8 లక్షలు ఖర్చు వ్యయం అయింది. అనంతరం కిడ్నీ సమస్యలతో మళ్లీ ఆస్పత్రికి వెళ్తే మరో రూ.5 లక్షలు ఖర్చు అయింది. ఇంకా ఆరోగ్యం కుదుట పడలేదు. కొవిడ్ మహమ్మారితో ఆరోగ్యంగా, ఆర్థికంగా నష్టపోయాం.
–సన్నిధి శ్రీలత, పైడిపర్రు, తణుకు
నాకు ఇది పునర్జన్మ...
జీవితం మీద అశలు పోయాయి. బతుకుతానని అనుకోలేదు, డాక్టర్లు కష్టమని చెప్పడం విన్నా. 15 రోజులు మంచంపై ఉన్నా. చివరికీ నన్ను ఇంటికి తీసుకెళ్లిపోమని డాక్టర్లు మా కుటుంబ సభ్యులకు చెప్పారు. అప్పటి వరకు ప్రాణమీద ఉన్న చిన్న ఆశ కూడా పోయింది. ఈ సమయంలో నా మిత్రుడు సందీప్ నాలో ధైర్యం నింపాడు. మరో అస్పత్రికి మార్చి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేశాడు. ఇది నాకు పునర్‌జన్మే. కొవిడ్ ప్రభావంతో ఇప్పటికీ ఆరోగ్యపరంగా ఏదో ఒక్క సమస్య వస్తూనే ఉంది. గతంలో మాదిరిగా ఉత్సాహవంతంగా ఉండలేకపోతున్నా.
– రామ్ గోపాల్ గోపి, ఫొటోగ్రాఫర్, నరసాపురం
కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతున్నారు ..
కొవిడ్–19 తర్వాత ప్రతీ ఒక్కరూ తమ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందు కు ఇష్టపడుతున్నారు. మానసిక ఒత్తిడికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడగడం, మాస్కులు ధరించడంపై అవగా హన పెరిగింది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రొటీన్, మినరల్, విటమిన్లు సమాన స్థాయిలో వుండేలా పోషకాహారం తీసుకోవాలనే అవగాహన పెరిగింది.
పి.గోపాల కృష్ణ ప్రసాద్, ఉపాధ్యాయుడు, పోషకాహార నిపుణుడు, తణుకు
కొవిడ్ అవశేషాలు మిగిలే వున్నాయి
కొవిడ్–19 బారిన పడి చికిత్స తీసుకున్న కొందరిలో ఆ వైరస్‌కు సంబం ధించిన అవశేషాలు ఇంకా వున్నాయి. వారిలో దీర్ఘకాలిక జీవన శైలి రుగ్మతలను గమనిస్తున్నాం. మధుమేహం, బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలు వున్నవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, జంక్ ఫుడ్‌కు దూరంగా వుంటూ మితాహారం తీసుకోవడం ద్వారా ఆరోగాన్ని కాపాడుకోవచ్చు.
–డాక్టర్ కె.సాయి భవాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, వేల్పూరు