Supreme Court: ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:11 AM
కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతో అనువదించే ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్)ల సహకారంతో కోర్టులో జరిగే వాదనలు, తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.

కృత్రిమ మేధతో అనువాదం
కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతో అనువదించే ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్)ల సహకారంతో కోర్టులో జరిగే వాదనలు, తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. నేషనల్ ఇన్‌ఫర్మటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) ఇందులో కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. పార్లమెంటులో ఇటీవల మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. తెలుగుతోపాటు అస్సామీ, బెంగాలీ, గారో, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, ఖాసీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంథాలీ, తమిళం, ఉర్దూల్లోకి అనువదిస్తున్నట్టు వివరించారు.
ఇందుకోసం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ.. ఐఐటీ-మద్రాసు సహకారం తీసుకుంటోందని తెలిపారు. అనువాదాలకు సంబంధించిన నమానాలను 200 మంది అడ్వకేట్ ఆన్ రికార్డు(ఏవోఆర్)లకు అందించామని పేర్కొన్నారు. వాటిపై వారి అభిప్రాయాలను కోరామని తెలిపారు. ఏఐ సాంకేతికతను కేవలం కోర్టులోని వాదనలు, తీర్పుల అనువాదానికి మాత్రమే పరిమితం చేస్తున్నామని, న్యాయ నిర్ణయంలో ఎటువంటి పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు.