Share News

Delhi High Court: ప్రాథమిక ఆధారాలున్నాయి.. లోతైన దర్యాప్తు జరపాల్సిందే

ABN , Publish Date - Mar 24 , 2025 | 02:17 AM

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయకు ఈ వ్యవహారం గురించి మార్చి 15 సాయంత్రం తెలియగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన ఈ విషయాన్ని సుప్రీం సీజే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా దృష్టికి తీసుకెళ్లారు.

Delhi High Court: ప్రాథమిక ఆధారాలున్నాయి.. లోతైన దర్యాప్తు జరపాల్సిందే

జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై సీజేఐకి ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్‌ ఉపాధ్యాయ సిఫారసు

మార్చి 15నే సీజేఐ దృష్టికి డబ్బు కట్టల విషయం

జస్టిస్‌ వర్మకు మూడు ప్రశ్నలు వేసి లిఖితపూర్వక సమాధానాలు రాబట్టాలని సూచించిన సీజేఐ

ఆర్నెల్ల కాల్‌ రికార్డులూ తీసుకోవాలని సూచన

మొబైల్‌ఫోన్లు పారేయవద్దని, వాటిలో డేటా డిలీట్‌

చేయొద్దని జస్టి్‌సవర్మకు సూచించాలని ఆదేశం

ఆ గది నా ఇంట్లో భాగం కాదు.. ప్రాంగణంలో ఉంది

ఇది నా ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర: జస్టిస్‌ వర్మ

ఇప్పటికీ మాకు ఆ ప్రాంతంలో కాలిన నోట్లు

దొరుకుతున్నాయి.. పారిశుధ్య కార్మికుల వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 23: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించి.. సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన నివేదిక ద్వారా పలు కీలక అంశాలు బయటపడ్డాయి! ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయకు ఈ వ్యవహారం గురించి మార్చి 15 సాయంత్రం తెలియగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన ఈ విషయాన్ని సుప్రీం సీజే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా దృష్టికి తీసుకెళ్లారు. శనివారం రాత్రి పొద్దుపోయాక సుప్రీంకోర్టు అప్‌లోడ్‌ చేసిన 25 పేజీల డాక్యుమెంట్‌లో రెండో పేజీలోనే ఈ విషయం స్పష్టంగా ఉంది. జస్టిస్‌ వర్మ ఇంటి ప్రాంగణంలోని స్టోర్‌రూమ్‌లో సగం తగలబడిపోయిన డబ్బు కట్టలున్న నాలుగైదు గోనెసంచులున్నట్టు ఢిల్లీ పోలీసు కమిషనర్‌ ఇచ్చిన నివేదిక, సీజేఐకి ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ ఇచ్చిన నివేదిక, వారి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు, ప్రమాదం జరిగిన స్టోర్‌ రూమ్‌లో డబ్బుకట్టలున్న ఫొటోలు, వీడియో లింకుతో సహా.. మొత్తం 25 పేజీల పీడీఎ్‌ఫను సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఇందులో జస్టిస్‌ ఉపాధ్యాయసీజేఐకి ఇచ్చిన నివేదికలో పలు కీలక విషయాలు ఉన్నాయి.

gtkh.gif

మార్చి 14వ తేదీన రాత్రి 11.30 గంటల సమయంలో జస్టిస్‌ వర్మ ఇంటి ప్రాంగణంలో జరిగిన అగ్ని ప్రమాదం, సగం కాలిన నోట్ల కట్టల గురించి ఢిల్లీ పోలీసు కమిషనర్‌ సంజయ్‌ అరోరా...


మార్చి 15 సాయంత్రం 4.50 గంటల సమయంలో లఖ్‌నవూలో ఉన్న తనకు వెల్లడించారని తెలిపారు. అదే రోజు తాను ఆ విషయాన్ని సీజేఐ దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్నీ అందులో ప్రస్తావించారు. ప్రమాదం జరిగిన రోజు జస్టిస్‌ వర్మ వ్యక్తిగత కార్యదర్శి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేశారని.. అగ్నిమాపక కేంద్రానికి ఫోన్‌ చేయలేదని జస్టిస్‌ ఉపాధ్యాయ స్పష్టం చేశారు. అగ్నిప్రమాదం జరిగిన స్టోర్‌ రూమ్‌లోకి ఎవరో బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లేవీ లేవని.. జస్టిస్‌ వర్మ కుటుంసభ్యులకు, పనివారికి మాత్రమే దాంట్లోకి ప్రవేశం ఉందని తేల్చిచెప్పారు. ఆ గదికి తాళం కూడా ఉందన్న విషయాన్ని.. 15వ తేదీ ఉదయం ఆ గది నుంచి సగం కాలిన వస్తువులు, ఇతర వ్యర్థాలను తొలగించిన విషయాన్ని.. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్‌ ధ్రువీకరించాడని వెల్లడించారు. ఘటనాస్థలికి వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సిందిగా తనకు కేటాయించిన రిజిస్ట్రార్‌ కమ్‌ సెక్రటరీని ఆదేశించానని.. లఖ్‌నవూ నుంచి వచ్చాక, 16వ తేదీన తాను స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించానని చెప్పారు. అనంతరం సీజేఐని కలిసి వివరాలు సమర్పించినట్టు వెల్లడించారు. సీజేఐ ఆదేశాల మేరకు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మతో ఫోన్‌లో మాట్లాడానని, 17వ తేదీన ఉదయం 8.30 గంటల సమయంలో ఆయన తనను కలిశారని చెప్పారు.


‘‘మంటలు చెలరేగిన స్టోర్‌ రూమ్‌లో పనికిరాని వస్తువులు, పాడైపోయిన గృహపకరణాలు, పాత ఫర్నిచర్‌, పరుపుల వంటివాటిని పడేస్తాం. పనివారికి, తోటపని చేసేవారికి కొన్ని సందర్భాల్లో సీపీడబ్ల్యూడీ (కేంద్ర ప్రజాపనుల విభాగం) సిబ్బందికి కూడా ఆ గది అందుబాటులో ఉంటుంది’’ అని జస్టిస్‌ వర్మ తనకు చెప్పినట్టు వెల్లడించారు. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ తనకు వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేసిన ఫొటోలు, వీడియోలను (సగం కాలిన నోట్ల కట్టల తాలూకూ) చూపించగా.. అదంతా తనపై జరుగుతున్న కుట్రగా జస్టిస్‌ వర్మ పేర్కొన్నారని వివరించారు. 20వ తేదీన ఆ ఫొటోలు, వీడియోలను సీజేఐకి పంపినట్టు వెల్లడించారు. అదే రోజు సాయంత్రం.. జస్టిస్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదన గురించి తనకు సీజేఐ నుంచి సమాచారం వచ్చిందని, అందుకు తాను అంగీకరించానని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న వివరాలు, జస్టిస్‌ వర్మ స్పందన, పోలీసు కమిషనర్‌ ఇచ్చిన నివేదిక, తాను జరిపిన విచారణ ప్రకారం.. ఆ గదిలోకి పనివారు, తోటపనివారు, కుటుంబసభ్యులు, సీపీడబ్ల్యూడీ సిబ్బందికి తప్ప బయటివారెవరికీ ప్రవేశం లేదని తేల్చిచెప్పారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు.


ఈ ప్రశ్నలు అడగండి..

ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్‌ ఉపాధ్యాయ ఇచ్చిన నివేదికను పరిశీలించిన సుప్రీం సీజే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా..

అసలు జస్టిస్‌ వర్మ ఇంటి ప్రాంగణంలో దొరికిన డబ్బుకు ఆయనకు సంబంధమేమిటి?

స్టోర్‌ రూమ్‌లో కనిపించిన నగదు ఎక్కణ్నుంచీ వచ్చింది? దాని మూలమేమిటో వివరించాలి?

మార్చి 15వ తేదీ ఉదయం.. సగం తగలబడిన నోట్లను ఎవరు తొలగించారు?

...అనే మూడు ప్రశ్నలూ జస్టిస్‌ వర్మను అడిగి, మార్చి 22 మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆయన్నుంచి లిఖితపూర్వక సమాధానం తీసుకోవాలంటూ జస్టిస్‌ ఉపాధ్యాయకు లేఖ రాశారు. అలాగే, గత ఆరు నెలలుగా జస్టిస్‌ వర్మ వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత భద్రతాధికారుల వివరాలను, ఆయన ఇంటివద్ద విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బంది వివరాలను పొందుపరచాలని పేర్కొన్నారు. జస్టిస్‌ వర్మ అధికారిక, వ్యక్తిగత ఫోన్‌ నంబర్లకు సంబంధించిన ఆరు నెల కాల్‌ రికార్డ్స్‌ వివరాలను ఇవ్వాల్సిందిగా సర్వీస్‌ ప్రొవైడర్లకు లేఖలు పంపాలని సూచించారు. అంతేకాదు.. తన మొబైల్‌ ఫోన్‌(ల)ను పారేయడం/అందులోని సంభాషణలను, మెసేజ్‌లను, డేటాను డిలీట్‌ చేయడం (లేదా) మార్చేయడం వంటివాటికి పాల్పడవద్దని జస్టిస్‌ వర్మకు సూచించాల్సిందిగా కూడా సీజేఐ ఆదేశించారు. జస్టిస్‌ వర్మ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానాన్ని వెంటనే తనకు సమర్పించాలని.. అప్పుడు తదుపరి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈమేరకు.. జస్టిస్‌ ఉపాధ్యాయ జస్టిస్‌ వర్మకు ఆ మూడు ప్రశ్నలూ సంధించారు. వాటికి నిర్ణీతగడువులోపు జస్టిస్‌ వర్మ సమాధానమిచ్చారు. ఆ గదిలో పనికిరాని వస్తువులే ఉంటాయని పునరుద్ఘాటించారు. ఆ గదిలోకి తన ఇంటి ముందువైపు గేటు నుంచి, వెనకవైపు స్టాఫ్‌ క్వార్టర్స్‌ నుంచి ప్రవేశించవచ్చని.. పైగా, అది ప్రధాన నివాసానికి దూరంగా ఉందని.. వివిధ పత్రికల్లో వచ్చినట్టుగా అది తన ఇంట్లో భాగం కాదని పేర్కొన్నారు. మంటలు ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది తమ ఇంట్లో ఉన్నవారందరినీ అక్కణ్నుంచీ దూరంగా పంపించారని తెలిపారు. మంటలు ఆరిన తర్వాతే వారంతా అక్కడికి వచ్చారని.. అక్కడ డబ్బు ఆనవాళ్లేవీ లేవని వెల్లడించారు. ‘‘ఆ స్టోర్‌రూమ్‌లో నేనుగానీ, నా కుటుంబసభ్యులుగానీ ఎలాంటి డబ్బూ పెట్టలేదని రూఢిగా చెప్తున్నాను. ఆ డబ్బు మాదేనన్న ఆరోపణను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాను. అక్కడ మేము డబ్బు భద్రపరిచామన్న మాటే పూర్తిగా అసంబద్ధం. అందరూ ఉపయోగించే, స్వేచ్ఛగా వచ్చిపోగలిగే చోట.. స్టాఫ్‌ క్వార్టర్స్‌కు సమీపంలో అందరూ ఉపయోగించే స్టోర్‌ రూమ్‌లో డబ్బును దాచిపెడతారన్న ఆలోచనే విడ్డూరమైనది, నమ్మశక్యం కానిది.’’ అని పేర్కొన్నారు.


మార్చి 15న తాను భోపాల్‌ నుంచి వచ్చాక అక్కడికి వెళ్లి చూశానని.. అక్కడ ఎలాంటి నగదు ఆనవాళ్లూ లేవని తెలిపారు. మార్చి 15న ఉదయం తమ సిబ్బందిలో ఎవరూ ఆ గదిలోంచి నగదును తొలగించలేదని చెప్పారు. ‘‘అవుట్‌హౌ్‌సలోని స్టోర్‌రూమ్‌లో డబ్బు ఉన్న విషయం నాకుగానీ, నా కుటుంబసభ్యులకుగానీ తెలియదు. మాకు దాంతో ఏ సంబంధమూ లేదు. అందుచేత.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆ గదిలో నుంచి మేం నగదును తొలగించామన్న ఆరోపణను నేను గట్టిగా, పూర్తిగా తిరస్కరిస్తున్నాను. తగలబడ్డట్టుగా చెబుతున్న నోట్లను మాకెవరూ చూపలేదు, అప్పగించనూ లేదు.’’ అని వివరణ ఇచ్చారు. తన నివాసంలో నోట్ల కట్టలు బయటపడ్డాయన్న ఆరోపణలను.. తనను ఇరికించడానికి, తన పేరు ప్రతిష్ఠలను దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. ఆయన ఇచ్చిన సమాధానాలతో జస్టిస్‌ డీకే ఉపాధ్యాయ.. సీజేఐకి మరో లేఖ రాశారు. దాంతోపాటు, ఆయన మొబైల్‌ఫోన్లకు సంబంధించిన ఆర్నెల్ల కాల్‌ డేటా రికార్డుల వివరాలనూ పెన్‌డ్రైవ్‌లో వేసి సమర్పించారు.


ఇవి కూడా చదవండి..

Delhi High Court Judge: నోట్ల కట్టల ఆరోపణలు నిరాధారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ

Karnataka: ఘోర ప్రమాదం.. భారీ రథాలు కూలిపోయి.. బాబోయ్..

Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్

Read Latest and National News

Updated Date - Mar 24 , 2025 | 02:17 AM