Share News

Heart Transplant: ఒక్క సందేశం.. ప్రాణం పోసింది

ABN , Publish Date - Mar 28 , 2025 | 02:45 AM

గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన సుష్మ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్న ఆమె కుటుంబం, మంత్రి లోకేశ్ సహాయంతో అవయవాలను విభజించి ఇతరులకు ప్రాణదానం చేశారు. ఆయన ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి గ్రీన్ చానల్ ద్వారా అవయవాలు త్వరగా ఇతర ఆసుపత్రులకు తరలించబడ్డాయి

Heart Transplant: ఒక్క సందేశం.. ప్రాణం పోసింది

  • గుంటూరులో మహిళ బ్రెయిన్‌ డెడ్‌

  • అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబం

  • మంత్రి లోకేశ్‌కు మెసేజ్‌ చేసిన వైద్యులు

  • సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు

  • గ్రీన్‌చానల్‌లో గుంటూరు నుంచి తిరుపతికి

  • తెనాలి వాసికి గుండె మార్పిడి శస్త్రచికిత్స

అమరావతి, తిరుపతి, గుంటూరు మెడికల్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఒక్క సందేశం.. ఒక కుటుంబం ఆశయాన్ని.. మరో కుటుంబం అవసరాన్ని తీర్చింది. అవయవదానానికి సంబంధించిన సందేశం అందుకున్న మంత్రి నారా లోకేశ్‌ దాని ప్రాధాన్యాన్ని గుర్తించి సత్వరమే సొంత ఖర్చుతో విమానాన్ని ఏర్పాటుచేసి.. అవయవదానానికి తన వంతు సహకారం అందించారు. గుంటూరుకు చెందిన చెరుకూరి సుష్మ (47) తీవ్ర అనారోగ్యంతో ఈ నెల 23న గుంటూరులోని ఆస్టర్‌ రమేశ్‌ హాస్పిటల్స్‌లో చేరారు. ఆమె గురువారం బ్రెయిన్‌ డెడ్‌ అయ్యారు. జీవచ్ఛవంలా మారిన తమ ఇంటి వెలుగు సుష్మ మరణాన్ని సజీవం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆమె అవయవాలను దానం చేస్తామని రమేశ్‌ హాస్పిటల్స్‌ వైద్యులకు తెలిపారు. వారు వెంటనే.. అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని కోరుతూ మంత్రి లోకేశ్‌కు మెసేజ్‌ పంపారు. దీనిపై 12 నిమిషాల్లోనే స్పందించిన మంత్రి... బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి గుండె తరలింపు కోసం ప్రత్యేక విమానాన్ని సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడంతోపాటు తిరుపతి ఆసుపత్రికి చేరే వరకు గ్రీన్‌చానల్‌ ఏర్పాటు చేసేలా సంబంధిత అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. గురువారం సాయంత్రం గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలో గుండెను తరలించి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేర్చారు.


అక్కడి నుంచి రాత్రి 9.59 గంటలకు తిరుపతిలోని శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతున్న తెనాలికి చెందిన 53 ఏళ్ల వ్యక్తికి దాన్ని అమర్చేందుకు వైద్యులు వెంటనే గుండె మార్పిడి శస్త్ర చికిత్సను ప్రారంభించారు. మంత్రిగా ఎంత బిజీగా ఉన్నా మానవత్వంతో స్పందించి సొంత ఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడమే కాకుండా, గ్రీన్‌ చానల్‌కు మార్గం సుగమం చేసిన లోకేశ్‌కు ఇరువురి కుటుంబ సభ్యులు, రమేశ్‌ హాస్పిటల్‌ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.., బ్రెయిన్‌డెడ్‌ అయిన సుష్మ ఊపిరితిత్తులను చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌కు, ఒక మూత్రపిండాన్ని విజయవాడలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. కాలేయం, మూత్రపిండం గుంటూరు రమేశ్‌ హాస్పిటల్స్‌కు కేటాయించారు.


For More AP News and Telugu News

Updated Date - Mar 28 , 2025 | 02:45 AM