Janasena : స్థానిక నామినేటెడ్ పదవుల్లో 30-40% మనకే రావాలి!
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:51 AM
ప్రైమరీ, అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీలు, మార్కెట్ యార్డుల్లో పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కేలా చూసుకోవాలని.
అలా కేటాయింపులు జరిగేలా చూడండి
ప్రతి ఎమ్మెల్యేనూ ఐదుగురు సీనియర్లు కలవాలి
జనసేన నేతలకు అగ్రనాయకత్వం సూచన
అమరావతి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రైమరీ, అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీలు, మార్కెట్ యార్డుల్లో పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కేలా చూసుకోవాలని. కనీసం 30-40 శాతం సీట్లు కేటాయించేలా చూడాలని జనసేన అగ్రనాయకత్వం పార్టీ జిల్లా అధ్యక్షులను ఆదేశించింది. పార్టీ ఆగ్రనాయకులు ఆదివారం ఉదయం జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు తదితరులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులకు కీలక సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు జనసేన కీలక నేతలు స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లాలని.. నామినేటెడ్ పోస్టుల్లో పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు కేటాయించాలని కోరాలని సూచించారు. ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే నుంచి స్పందన సరిగ్గా లేకపోతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల పాటు రాష్ట్రాభివృద్ధి, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టామని.. ఇప్పుడు పార్టీ బలోపేతానికి అందరం కలిసి పని చేయాలని సూచించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఎలాగైతే కేడర్ పని చేసిందో.. సర్పంచ్ ఎన్నికల్లో కూడా అలాగే పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. కొంత మంది నాయకులు క్షేత్రస్థాయి సమస్యలను అగ్రనాయకుల దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నాయకులకు, కేడర్‌కు గుర్తింపు ఇవ్వడం లేదని, 10 శాతం పనులు కూడా జరగడం లేదని చెప్పారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, రాయలసీమ జిల్లాల నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. అగ్రనాయకులు స్పందిస్తూ.. కేడర్ నిరాశ చెందకుండా ధైర్యం చెప్పాలన్నారు. ముందుగా కమిటీలు ఏర్పాటు చేసుకుని, తాము చెప్పిన విధంగా ఎమ్మెల్యేల వద్దకు వెళ్లాలని.. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే నాయకత్వం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.