పైసా వసూల్!
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:20 AM
నంద్యాల మార్కెట్ యార్డులో ఓ కీలక అధికారి వివిధ రూపాల్లో సాగిస్తున్న దందా పలు విమర్శలకు తావిస్తోంది

మార్కెట్ యార్డులో ఓ అధికారి వసూళ్ల పర్వం
గోడౌన్ల అద్దె ముసుగులో అధిక వసూళ్లు?
రికార్డుల్లో తక్కువ నమోదు
లక్షల్లో అక్రమ ఆదాయం
పశువుల సంత.. రెన్యువల్స్‌లోనూ చేతివాటం
ఏళ్ల తరబడి అధికారి తీరు వివాదాస్పదం
నంద్యాల మార్కెట్ యార్డులో ఓ కీలక అధికారి వివిధ రూపాల్లో సాగిస్తున్న దందా పలు విమర్శలకు తావిస్తోంది. యార్డు పరిధిలోని గోడౌన్ల అద్దె ముసుగులో ప్రతి నెల ఎక్కువ మొత్తం వసూలు చేసి.. రికార్డుల్లో తక్కువ నమోదు చేసి సదరు అధికారి సొమ్ముచేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటితోపాటు చెక్‌పోస్టులు, పశువుల సంత, పలు గోడౌన్లు, పలు రకాలు మిల్లుల రెన్యువల్‌లో తమదైన శైలిలో అక్రమ వసూళ్లకు తెరలేపారని సమాచారం. మొత్తంగా వివిధ రూపాల్లో ప్రతినెలా అక్రమ వసూళ్ల రూపంలో సదరు అధికారికి కాసుల వర్షం కురుస్తోందని ఆ శాఖ వర్గాల్లో జోరుగా చర్చసాగడం పలు విమర్శలకు తావిస్తోంది. నంద్యాల నగరంలోని మార్కెట్ యార్డులో 15 గోడౌన్లు ఉన్నాయి. ఇందులో సుమారు 10 గోడౌన్ల వరకు ఇతరులకు అద్దెకు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఇదే అదనుగా భావించి సదరు అధికారి సైతం తమదైన శైలిలో ఎక్కడికక్కడ చేతివాటం ప్రదర్శించి లక్షల్లో అక్రమంగా పోగు చేసుకుంటున్నారనే విమర్శలు జోరందుకున్నాయి. గోడౌన్ అద్దెలు భారీగా కలెక్ట్ చేస్తూ .. రికార్డుల్లో మాత్రం తక్కువ నమోదు చేస్తున్నారనే చర్చ ఆ శాఖ వర్గాల్లో సాగుతోంది.
అన్నింటా అనుమానాలే!
విశ్వసనీయ సమాచారం మేరకు.. సదరు మార్కెట్ యార్డు పరిధిలోని ఆరు గోడౌన్ల నుంచి అద్దెకు తీసుకున్న వారి నుంచి ఒక్కొక్కరితో నెలకు రూ.26 వేలు వసూలు చేస్తుండగా రికార్డుల్లో మాత్రం అద్దె రూపంలో ఒక్కో గోడౌన్‌కు రూ.10 వేలు అద్దె, జీఎస్టీ రూ.1,800 చొప్పున మొత్తంగా రూ.11,800 మాత్రమే చెల్లించినట్లు రికార్డుల్లో నమోదు చేసినట్లు సమాచారం. అదే విధంగా మరో మూడు గోడౌన్లను మాత్రం అగ్రిమెంట్ రూపంలో అద్దెకు ఇచ్చి వారు చెల్లించే మొత్తం అమౌంట్‌ను క్రమం తప్పకుండా రికార్డుల్లో నమోదు చేస్తున్నారని తెలిసింది. ఎందుకంటే అగ్రిమెంట్ ఉంది కదా..? అని చెబుతున్నారు. అయితే సదరు గోడౌన్లలోని ఓ వ్యాపారి మాత్రం గోడౌన్ ముందు వచ్చే కొనుగోలుదారులకు ఇబ్బంది లేకుండా అనధికారికంగా షెడ్డు వేసుకున్నారు. ఈ అనధికార షెడ్డుకు కూడా ప్రతి నెలా రూ.10వేల చొప్పున డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ మొత్తం ఇవ్వకపోవడంతో షెడ్డుకు తాళం వేశారు. తర్వాత ప్రతి నెలా రూ.4వేలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. వీటితో పాటు మరో గోడౌన్‌ను ఇరిగేషన్ వారికి అద్దెకు ఇచ్చారు. అయితే ఆ గోడౌన్‌ను రెండు పార్టులుగా విభజించి ప్రతి నెలా రూ.85 వేలు వసూలు చేస్తూ రికార్డుల్లో మాత్రం రూ.55వేలు చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు గోడౌన్‌కు జిఎస్టీ కూడా కట్టడం లేదని తెలిసింది. అదేవిధంగా సివిల్ సప్లైస్‌లోని ఓ పార్టు అద్దె తీసుకున్న ఓ కంపెనీ వ్యాపారి నుంచి నెలనెల సదరు అధికారి రూ.30 వేలు చోప్పున మొదటి మూడు నెలలు తీసుకున్నారని సమాచారం. సదరు గోడౌన్‌కు అగ్రిమెంట్ చేసి ప్రతినెలా రూ.30 వేలు అద్దె చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ఇదే తరహాలో మరో ఫ్రూట్స్ గోడౌన్ విషయంలో అద్దె నెలకు రూ.36 చొప్పున మూడు నెలలకు కలిపి రూ.1.08 లక్షలు స్వాహా చేసి ఆ తర్వాత అద్దె అగ్రిమెంట్ చేసినట్లు తెలిసింది.
నూనెపల్లిలోనూ అంతే..!
నంద్యాలలోని నూనెపల్లిలో షాపులను కొన్నింటికి అగ్రిమెంట్ చేయకుండానే అద్దెకు ఇచ్చినట్లు తెలిసింది. అయితే వారి నుంచి అక్రమంగా అద్దెలు వసూలు చేస్తున్నారని తెలిసింది. పైగా సదరు అద్దెలకు రసీదులు కూడా ఇవ్వకుండా రూ.లక్షల్లో స్వాహా చేస్తున్నారని ఆ శాఖలోని కొందరు అధికారుల ద్వారా తెలిసింది. నూనెపల్లి పశువుల సంత నుంచి కూడా సిబ్బందిని బెదిరించి ప్రతివారం రూ.15 వేలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదేళ్లకు ఒకసారిగా రెన్యువల్ చేసే పలు గోడౌన్లు, దాల్ మిల్లులు తదితర వాటిని రెన్యువల్ చేయడంలోను సదరు అధికారి చేతివాటం ప్రదర్శించి క్యాష్ చేసుకున్నారని సమాచారం. గత వైసీపీ హయాంలో సదరు మార్కెట్ బోర్డు మీటింగ్ పెట్టకుండా.. ఇష్టారాజ్యంగా బిల్లులు డ్రా చేశారు. ఆ బిల్లులను బోర్డు మీటింగ్‌లో పెడితే కొందరు డైరెక్టర్లు విభేదించడంతో అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. చేయని వాటికి కూడా బిల్లులు పెడితే ఎలా అని కీలక అధికారిని డైరెక్టర్లు నిలదీశారు. ఈ వ్యవహారంలో అప్పటి చైర్మన్‌కు కొంత వాటా ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా రెండు తనిఖీ కేంద్రాలు, మొబైల్ డ్యూటీ నుంచి సిబ్బందిని బెదిరించి నెలనెల రూ.37 వేలు అక్రమంగా వసూలు చేస్తున్నారని సమాచారం. మొత్తంగా అక్రమార్జనే లక్ష్యంగా సదరు అధికారి పనిచేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎవరైనా ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తే వారిపై సదరు అధికారి చుక్కలు చూపిస్తారని బాధితులు అంతర్గతంగా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్రస్థాయి అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని బాధిత వ్యాపారులు, మార్కెటింగ్ శాఖలోని కొందరు అధికారులు డిమాండ్ చేస్తున్నారు.
ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం
నిబంధనలకు విరుద్ధంగా అద్దె వసూలు చేసినా ఎక్కువ మొత్తంలో వసూలు చేసినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. అద్దెదారులు కూడా అద్దె చెల్లించిన తరువాత రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎంత చెల్లిస్తే అంతకే బిల్లు తీసుకోవాలి. ఒకవేళ రసీదు ఇవ్వకపోతే మాకు ఫిర్యాదు చేయండి
- శ్రీకాంత్‌రెడ్డి, రీజనల్ డైరెక్టర్, కడప