జడివాన
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:27 AM
పది రోజులుగా ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వర్షం రాకతో కాస్త ఉపశమనం పొందారు. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జడివాన కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై కనిపించగా సాయంత్రం పలుచోట్ల రెండు గంటల దాకా వరుణుడు కరుణించాడు. ఉమ్మడి జిల్లా అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది.

కరెంటు సరఫరా నిలిపివేతతో చిమ్మచీకట్లు
మార్కెట్ యార్డులో కూరగాయల రైతు అవస్థలు
పిడుగులు పడి ఒకరు మృతి.. స్పృహ తప్పిన ఆరుగురు
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): పది రోజులుగా ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వర్షం రాకతో కాస్త ఉపశమనం పొందారు. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జడివాన కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై కనిపించగా సాయంత్రం పలుచోట్ల రెండు గంటల దాకా వరుణుడు కరుణించాడు. ఉమ్మడి జిల్లా అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. కర్నూలు నగరంతో పాటు పత్తికొండ, కోడుమూరు, డోన్, పాణ్యం, కొలిమిగుండ్ల, ప్యాపిలి తదితర మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎమ్మిగనూరులోని కందనాతి గ్రామంలో పిడిగు పడి రవి (15) అనే యువకుడు మృతి చెందాడు. సి.బెళగల్ మండలం యనగండ్ల క్రాస్ రోడ్డు వద్ద పిడుగు పడి ఆరుగురు స్పృహ తప్పి పడిపోయారు.
మండువేసవిలో వాన
మహానంది, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): మండు వేసవిలో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మహానందిలో ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. దీంతో మహానంది క్షేత్రానికి దైవదర్శనం కోసం వచ్చిన భక్తులు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు. గంటపాటు ఏకధాటిగా వర్షం కురవడంతో క్షేత్ర వీధులన్నీ జలమయం అయ్యా యి. అలాగే ఎం.తిమ్మాపురం, బుక్కాపురం, తమ్మడపల్లి, శ్రీనగరం గ్రామాల్లో ఈదురు గాలులకు పలుచోట్ల అరటిచెట్లు నేలకొరిగాయి. రైతులు ఆరబోసిన పసుపు దిగుబడి తడిసింది.
రైతుల ఇబ్బందులు
పగిడ్యాల: ఉపరితల ఆవర్తన ప్రభావంతో మండలంలోని గామాల్లో గురువారం తేలికపాటి వర్షం కురిసింది. ప్రస్తుతం కేసీ కాలువ కింద రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట నూర్పిడి చేసి ధాన్యాన్ని కళ్లాల్లో నిల్వ చేసుకున్నారు. వర్షం కురవడంతో ధాన్యం తడవకుండా రైతులు ఇబ్బంది పడ్డారు.
నేలమట్టమైన వరి పంట
బండిఆత్మకూరు: మండలంలోని గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. గురువారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన రావడంతో ఈర్నపాడు, కడమలకాల్వ, వెంగళరెడ్డిపేట, మణికఠపురం, శింగవరం, సోమయాజులపల్లె గ్రామాల్లో వేలాది ఎకరాల్లో వరి పంట పూర్తిగా నేలమట్టమైంది.
కొలిమిగుండ్ల: మండలంలోని తిమ్మనాయినిపేట, కోటపాడు, బెలుం, బెలుంశింగవరం తదితర గ్రామాల్లో గురువారం వర్షం కురిసింది. రైతులు కలాల్లో ఆరబోసిన పంట దిగుబడులు దెబ్బతిన్నాయి. తిమ్మనాయినిపేట గ్రామంలో పసుపు రైతులకు నష్టం వాటిల్లినట్లు వాపోతున్నారు.
మెరుపు ప్రభావంతో ఆరుగురికి అస్వస్థత
సి. బెళగల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇనగండ్ల క్రాస్‌రోడ్డులో ఆర్‌టీసీ బస్సు కోసం వేచి ఉన్న ఆరుగురు ప్రయాణికులు మెరుపు ప్రభావానికి గురై అస్వస్థతకు గురయ్యారు. ఆ దారిలో కారులో వెళుతున్న టీడీపీ మాజీ మండల కన్వీనర్ డాక్టర్ తిమ్మప్ప మెరుపు ప్రభావంతో సృహ కోల్పోయిన వారిని తన వాహనంలో చికిత్స నిమిత్తం కర్నూలుప్రభుత్వ వైద్యశాలకు తర లించారు. ఎస్‌ఐ తిమ్మారెడ్డి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని మెరుపు దాడికి గురైయిన వారి వివరాలు తెలుసుకుని, వారి బంధువులకు సమాచారం అందజేసి నట్లు తెలిపారు.
కర్నూలులో కుమ్మేసిన వాన
కర్నూలు నగరంలో రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కర్నూలు నగరంలో దాదాపు రెండు గంటల సేపు వాన దంచి కొట్టింది. కరెంటు సరఫరా నిలిపివేయడంతో బళ్లారి చౌరస్తా పరిధిలోని సంపత్‌నగర్, విఠల్‌నగర్, ఠాగూర్ నగర్, మురారినగర్, తదితర కల్లూరు పరిధిలోని కాలనీల ప్రజలు చిమ్మచీకటిలోఇబ్బందులు పడ్డారు. కర్నూలు మార్కెట్‌యార్డులో రాత్రి సమయంలోనే రైతులు కూరగాయలను విక్రయా నికి తెస్తుంటారు. జడివానకు రైతులు తెచ్చిన కూరగాయలు తడిసిపోయాయి.
పిడుగుపాటుకు బాలుడి మృతి
ఎమ్మిగనూరు రూరల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): మండలంలో పిడుగు పాటుకు గురై 15ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద సంఘటన గురువారం జరిగింది. గ్రామానికి చెందిన మారెన్న, మస్తానమ్మల కుమారుడు బోయ రవి(15) పొలం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో వర్షపు జల్లులు పడడంతో రవితో పాటు అదే గ్రామానికి చెందిన గజ్జన్న, తిక్కయ్య, స్టాలిన్ కూడా చెట్టుకిందకు వెళ్లారు. ఒక్కసారిగా పిడుగు పడడంతో చెట్టు కింద ఉన్న రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన బాలుడు రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి గజ్జన్న, తిక్కయ్య, స్టాలిన్‌లకు ప్రభుత్వ వైద్యశాల లో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. తహసీల్దార్ శేషఫణి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.