కరువు కాలంలో ఉపశమనం..!
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:12 AM
ఖరీఫ్ కాస్త కరుణించినా, రబీ సీజన్ కన్నీరే నింపింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో వానలు సరిగా కురవలేదు.

ఉమ్మడి జిల్లాలో 15 కరువు మండలాల ఎంపిక
తీవ్ర కరువు ప్రభావిత మండలాలు 10
కర్నూలు జిల్లాలో 9, నంద్యాల జిల్లాలో ఒకటి
రబీ సీజన్ కోసం ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఖరీఫ్ కాస్త కరుణించినా, రబీ సీజన్ కన్నీరే నింపింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో వానలు సరిగా కురవలేదు. నానా కష్టాలుపడి పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రబీ రైతులకు ఉపశమనం కల్పిస్తూ ఉమ్మడి జిల్లాలో 15 కరువు మండలాలను ఎంపిక చేసింది. అందులో పది మండలాలు తీవ్రంగా కరువువాత పడ్డాయని గుర్తించింది. ఇందులో కర్నూలు జిల్లాలో తొమ్మిది, నంద్యాల జిల్లాలో ఒక మండలం ఉన్నాయి.
కర్నూలు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కరువు పీడిత మండలాల రైతులకు కొంతలో కొంత ఉపశమనం కలిగించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. కరువు మండలాలను ప్రకటించింది. వర్షపాతం, పొడి వాతావరణంతో పాటు సాగు విస్తీర్ణం, పంట నష్టం, భూగర్భ జలాల స్థాయి, వ్యవసాయ స్థితిగతులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని 2024-25 రబీ సీజన్‌లో కరువు మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. జిల్లా కలెక్టర్లు పంపిన ప్రతిపాదన మేరకు ఈ నెల 28న వర్చువల్ ద్వారా సమావేశమైన కరువు ప్రభావ కమిటీ ఆరు జిల్లాల్లో 37 మండలాలను కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కర్నూలు జిల్లాలో 9, నంద్యాల జిల్లాలో 5 మండలాలు ఎంపిక చేస్తూ రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. జిల్లా పశ్చిమ మండలాల్లో తీవ్ర కరువుతో తల్లడిల్లుతున్న పలు మండలాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. రెండో విడతలోనైనా ఎంపిక చేయాలని రైతులు కోరుతున్నారు.
కర్నూలు జిల్లాలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1,17,288 హెక్టార్లు. గత ఏడాది 2023-24 రబీలో 94,391 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తే.. ఈ ఏడాది 2024-25 రబీ సీజన్‌లో 87,320 హెక్టార్లలో సాగు చేశారు. అంటే.. సాధారణం కంటే 29,968 హెక్టార్లు సాగు తగ్గింది. ఆహార ధాన్యాల (ఫుడ్ గ్రైన్స్) పంటలు 18,176 హెక్టార్లకు గానూ 19,548 హెక్టార్లలో సాగు చేశారు. పప్పు దినుసుల పంటలు 69,958 హెక్టార్లకు గానూ 43,345 హెక్టార్లలో సాగు చేశారు. సాధారణం కంటే 38 శాతం తక్కువ సాగు అయ్యింది. నూనే గింజల (ఆయిల్ సీడ్స్) పంటలు 16,081 హెక్టార్లకు గానూ 9,104 హెక్టార్లలో సాగు చేశారు. ఈ పంటలు కూడా సాధారణం కంటే 43 శాతం తక్కువ సాగు చేశారు. ఉద్యాన పంటలు 6,853 హెక్టార్లకు గాను 5,681 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. సాధారణం కంటే 17 శాతం తక్కువ సాగు చేశారు. అన్ని రకాల పంటలు పరిశీలిస్తే సాధారణం కంటే 26 శాతం తక్కువ సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. అదే క్రమంలో వర్ష్షపాతం కూడా రబీలో సాధారణం కంటే తక్కువే నమోదు అయ్యింది. పలు మండలాల్లో కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదని అధికారులు అంటున్నారు. కరువు మండలాల ఎంపిక కోసం భారత ప్రభుత్వ మాన్యువల్-2016 మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్‌బాషా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. పరిశీలించిన కరువు కమిటీ సిఫారసు మేరకు అత్యంత తీవ్ర కరువు మండలాలుగా ఆస్పరి, కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, మద్దికెర, ఓర్వకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి మండలాలను ఎంపిక చేశారు. పత్తికొండను సాధారణ కరువు మండలాల జాబితాలో చేర్చారు. ఆ మండలాల రైతులకు కరువు సహాయక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.
నంద్యాల జిల్లాలో కూడా పలు మండలాల్లో ఈ ఏడాది రబీ సీజన్‌లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు నగరి కాలువల కింద సాగునీటి వసతి ఉన్న మండలాలు కాకుండా ఇతర మండలాల్లో కరువు తీవ్రత అధికంగానే ఉంది. అయితే.. తీవ్ర కరువు మండలాల జాబితాలో కొలిమిగుండ్ల మండలాన్ని మాత్రమే ఎంపిక చేశారు. సాధారణ కరువు మండలాలుగా బేతంచర్ల, బనగానపల్లె, సంజామల, ఉయ్యాలవాడ మండలాలు ఎంపిక చేశారు. డోన్, బనగానపల్లె నియోజకవర్గాల్లో వర్షాధారంగా జీవనం సాగించే మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని, వాటిని కూడా ఎంపిక చేయాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాల వారీగా కరువు మండలాలు
వివరాలు కర్నూలు నంద్యాల
తీవ్రమైన కరువు మండలాలు 9 1
సాధారణ కరువు మండలాలు 1 4
మొత్తం 10 5
కరువు రైతులకు ప్రయోజనం
కరువు మండలాలుగా ఎంపికైన మండలాల్లో ఉపాధి పనులు గరిష్ఠంగా 150 రోజులు పనిదినాలు కల్పిస్తారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.13,660 అదనపు ప్రయోజనం కలుగుతుంది. వాతావరణ ఆధారిత పంటల బీమా ప్రయోజనం లభిస్తుంది. పంట రుణాలు రీ షెడ్యూల్ చేస్తారు. వేసవిలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. కరువు నివారణ పంటల సాగుపై ప్రోత్సాహం అందిస్తారు. ఆహార భద్రత కల్పిస్తారు. స్కేల్ ఆఫ్ రిలీఫ్ నిబంధనలు ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్ట పరిహారం అందిస్తారు.