ఉగాది వైభవం
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:29 PM
ఉగాది సందర్భంగా ఆదోనిలో గ్రామదేవతలు మారెమ్మ, సుంకులమ్మ ఆలయాల్లో పూజలు చేశారు. చిన్న మార్కెట్ సుంకులమ్మ, మారెమ్మ ఆలయాలకు ఉదయం ఆరు గంటల నుంచి భక్తులు బారలు తీరారు.

ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో వేడుకలు
పంచాంగాన్ని వినిపించిన పండితులు
ఆదోని టౌన్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఉగాది సందర్భంగా ఆదోనిలో గ్రామదేవతలు మారెమ్మ, సుంకులమ్మ ఆలయాల్లో పూజలు చేశారు. చిన్న మార్కెట్ సుంకులమ్మ, మారెమ్మ ఆలయాలకు ఉదయం ఆరు గంటల నుంచి భక్తులు బారలు తీరారు. జనం బారులు తీరి గ్రామదేవతలను దర్శించుకుని తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. తెలుగు సంవత్సరాది సందర్భంగా గ్రామదేవతలను దర్శించుకుని, చీర సారేలతో పాటు, నైవేద్యం సమర్పించుకొని ప్రత్యేక పూజలతో మొక్కుబడులు తీర్చుకోవడం ఆనవాయితీ.
ఆదోని అగ్రికల్చర్: పట్టణంలోని చిన్న మార్కెట్ మారెమ్మ, సుంకలమ్మ ఆలయం, కొత్త బస్టాండ్ రోడ్డులోని ఆలయంలో భక్తులు పూజలు చేశారు.
పూజారికి ఉగాది పురస్కారం
మద్దికెర: మండలంలోని రంగనాథ స్వామి ఆలయ పూజారి రంగనా థాచారికి ఉగాది పురస్కారం లభించింది. ఈమేరకు ఆదివారం కర్నూ లులో మంత్రి టీజీ భరత్, కలెక్టర్ రంజిత్‌బాషా సన్మానం చేశారు. మండలంలోని మద్దికెర, పెరవలి, ఎం.అగ్రహారం తదితర గ్రామాల్లో ఉగాది పండుగను వైభవంగా జరుపుకున్నారు. మద్దమ్మ ఆలయం, పెరవలి రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మద్దికెరలో కవిరెడ్డి వీది యువకులు ఉగాది సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. వ్యక్తిగత కక్షలు ఉండకూడదని, ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగిస్తూ వస్తున్నామని తెలిపారు.
ఉగాది ఉత్సవాలు... పంచాంగ పఠనం
తుగ్గలి: తెలుగు సంవత్సరాదిని గ్రామాల్లో జరుపుకున్నారు. ఆదివారం విశ్వవసునామ సంవత్సరం సందర్భంగా ఉగాది పచ్చడి, పిండి వంటలు చేసుకుని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. రైతులు పొలాలకు వెళ్లి ఈ ఏడాది పంటలు బాగా పండాలని, సేద్యం పనులు ప్రారంభించారు. వేద పండితులు పంచాంగ పఠనం చేశారు.
దేవనకొండ: మండలంలో ఉగాది పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయాలకు నైవైద్యం సమర్పించేం దుకు భక్తులు పోట్టేత్తారు. గద్దెరాళ్ల మారెమ్మ ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పంచాగ పఠనం చేశారు. చెన్నకేశవస్వామి, భూదేవి, శ్రీదేవిని ఉరేగించారు.
ఆదోని రూరల్: మండలంలోని నాగలాపురం, పెసలబండ ఆంజనేయస్వామి ఆలయం, పెద్దహరివాణం అయ్యమ్మ ఆలయాల్లో వేడుకలు నిర్వహించారు. మామిడి ఆకులు, విద్యుత్ దీపాలతో అంగరంగ వైభవంగా అలంకరించారు. ఉత్సవమూర్తిని పూలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఉదయం నుంచి మహిళలు నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కొనసాగుతున్న వీరభద్రస్వామి ఉత్సవాలు
ఆస్పరి: మండలంలోని కైరుప్పల గ్రామం కాళికాదేవి వీరభద్ర స్వామి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం పల్లకీ సేవ నిర్వహించారు. ఉదయం పూజలు నిర్వహించి, పల్లకిలో ఉంచి పుప్పలదొడ్డి, యాటకల్లు, కల్లపరి, వెంగళ్ళయ దొడ్డి గ్రామ పొలమేరలలో ఊరేగిస్తూ కైరుప్పుల వీరభద్ర స్వామి ఆలయంలోకి తెచ్చారు. గ్రామాల ప్రజలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
ఘనంగా ఉగాది వేడుకలు
పత్తికొండ టౌన్: విశ్వవసు నామ సంవత్సరం సందర్బంగా పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుమ్మరి వీదిలో ఉప్పర కట్ట వద్గ పెద్దమ్మవ్వ దేవాలయం, తేరుబజారులో చెన్నకేశవస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. చెన్నకేశవస్వామి ఆలయంలో సాయంత్రం 5 గంటలకు పురోహితులు పవన్‌కుమార్ పంచాంగ పఠనం నిర్వహించారు. రైతులు, ఆ ప్రాంత ప్రజలు పంచాంగాన్ని విన్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉగాది వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
వైభవంగా సోమేశ్వర స్వామి రథోత్సవం
ఆలూరు రూరల్: మండలంలోని ముసనహళ్ళి గ్రామంలో సోమేశ్వర స్వామి మనేకుర్తిలో రామలింగేశ్వర స్వామి, కురకుందలో శనేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించారు. సీఐ రవి శంకర్ రెడ్డి బందోబస్తు నిర్వహించారు. సర్పంచులు పార్వతి సోమలింగ, కురవ కొల్లమ్మ, మాజీ సర్పంచ్ సోమ శేఖర్‌పాటిల్ శేషాద్రి రెడ్డి, కురవ దేవేంద్ర, కలబాయి అయ్యళ్ళి, కలబాయి దేవేంద్ర పాల్గొన్నారు.
పంటలు సమృద్ధిగా పండుతాయి..
వెల్దుర్తి టౌన్: విశ్వవసునామ సంవత్సరంలో పంటలు సమృద్దిగా పండుతాయనీ పంచాంగ శ్రవణకర్త అన్నదానం కృష్ణశాస్త్రి అన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పురస్కరించుకుని స్థానిక ఆలయంలో పంచాంగ పఠనం చేశారు. బొమ్మన దశరథరామిరెడ్డి, బొమ్మన రాజశేఖర్ రెడ్డి, చిన్నభాస్కర్ గౌడ్, రైతులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.