Share News

CPI Maoist: దక్షిణాదిపై హిందీని రుద్దడాన్ని వ్యతిరేకించండి

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:15 AM

దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే చర్యలను నిరసిస్తూ ప్రజలు విశాల ఉద్యమాలకు సిద్ధమవ్వాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ కోరింది. యూజీసీ నూతన నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల వైఖరిని మావోయిస్టు పార్టీ సమర్థిస్తోందని తెలిపింది.

CPI Maoist: దక్షిణాదిపై హిందీని రుద్దడాన్ని వ్యతిరేకించండి

‘విపక్ష విముక్త్‌’కు వ్యతిరేకంగా రాష్ట్రాలు ఉద్యమించాలి

ప్రజలు విశాల ఉద్యమాలకు సిద్ధమవ్వాలి

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపు

అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): జాతీయ విద్యావిధానం పేరిట త్రిభాషా సూత్రాన్ని హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా రుద్దాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వాలు తిప్పికొట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) పిలుపునిచ్చింది. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే చర్యలను నిరసిస్తూ ప్రజలు విశాల ఉద్యమాలకు సిద్ధమవ్వాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ కోరింది. యూజీసీ నూతన నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల వైఖరిని మావోయిస్టు పార్టీ సమర్థిస్తోందని తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో ప్రతిపక్షాలే లేకుండా చేసేందుకు బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సల దుష్ట లక్ష్యమైన విపక్ష్‌ విముక్త్‌కు వ్యతిరేకంగా రాష్ట్రాలు ఉద్యమించాలని, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అభయ్‌ కోరారు. మావోయిస్టు ముక్త్‌భారత్‌ పేరుతో కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ అంతటితోనే ఆగదని, దేశాన్ని కార్పొరేటీకరణ. సైనికీకరణ చేస్తుందని, హిందుత్వ విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్షపార్టీలన్నింటినీ అర్బన్‌ నక్సల్స్‌గా, దేశద్రోహులుగా చిత్రీకరించి దాడిచేసేవరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కగార్‌ దాడులను కూడా వ్యతిరేకించాలని ప్రతిపక్ష పార్టీలను కోరారు. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయనందుకు తమిళనాడు రాష్ట్రానికి సర్వశిక్ష అభియాన్‌ కింద ఇవ్వాల్సిన రూ.2వేల కోట్లను కేంద్రం నిలిపివేసి బెదిరిస్తోందని , ఇది నియంతృత్వ చర్య అని విమర్శించారు. వన్‌ నేషన్‌, వన్‌ రేషన్‌కార్డు, వన్‌ పవర్‌గ్రిడ్‌, వన్‌ ట్యాక్స్‌, వన్‌ పోలీసు, వన్‌ లాంగ్వేజీ, వన్‌ సివిల్‌కోడ్‌, వన్‌ ఎలక్షన్‌, ఏక్‌ భారత్‌ శ్రేష్ట్‌భారత్‌ పేరుతో బీజేపీ తన విధానాలను దేశంపై బలవంతంగా రుద్దాలని చేస్తోందన్నారు. ఈ ప్రయత్నాలను ప్రతిపక్షపార్టీలు, ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. ఇందుకోసం ప్రజలు చేసే ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుందని అభయ్‌ ప్రకటించారు.

Updated Date - Mar 21 , 2025 | 05:16 AM