Share News

Andhra Politics: మంచి రోజు చూసుకుని టీడీపీలో చేరుతా

ABN , Publish Date - Mar 21 , 2025 | 06:08 AM

ఆయన గురువారం తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీని వీడి నేను బయటకు రావడానికి పార్టీ అధినేతే కారణం. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి జగన్‌ జమానాలో కనిపించలేదు.

Andhra Politics: మంచి రోజు చూసుకుని టీడీపీలో చేరుతా

జగన్‌ తీరుతోనే వైసీపీ నుంచి బయటకు

అహర్నిశలు కష్టపడినా ప్రాధాన్యం లేదు: మర్రి రాజశేఖర్‌

చిలకలూరిపేట, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీకి రాజీనామా చేస్తున్నా. మంచి రోజు చూసుకుని టీడీపీలో చేరబోతున్నా’ అని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్‌ ప్రకటించారు. ఆయన గురువారం తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీని వీడి నేను బయటకు రావడానికి పార్టీ అధినేతే కారణం. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి జగన్‌ జమానాలో కనిపించలేదు. ఎంతో ఓర్పుగా ఉన్నప్పటికీ జగన్‌ విధానాలు, నిర్ణయాలు నచ్చక బయటకు రాక తప్ప లేదు. 40 ఏళ్లుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. నా మామ సోమేపల్లి సాంబయ్య, నేను కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో మంచి పనులు చేశాం. మాపై ప్రజలకు గౌరవభావం ఉంది. నియోజకవర్గంలో పార్టీ నిర్మాణం చేసి ఎంతో కష్టపడితే మాకు తీరని అన్యాయం జరిగింది. వైసీపీని బలోపేతం చేసి, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినప్పటికీ నాకు ప్రాధాన్యం ఇవ్వలేదు. నాకు మంత్రి పదవి, ఎమ్మెల్సీ ఇస్తానని 2019లో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో జగన్‌ ప్రకటించారు.


ఆ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కష్టపడ్డాం. అయితే ఎప్పటికప్పుడు దాటవేస్తూ నాలుగు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. 2024 ఎన్నికల సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని నాకు తెలియకుండానే చేశారు. అంతా అయ్యాక నన్ను పిలిపించి పార్టీని గెలిపించమని కోరారు. ఇద్దరు అభ్యర్థులను వెంటవెంటనే మార్చారు. మాజీ మంత్రి రజినీని ఇక్కడ నుంచి గుంటూరుకు ఎందుకు పంపారో, 53 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆమెను మళ్లీ అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో వాళ్లకే తెలియాలి. 2024 ఎన్నికల అనంతరం జగన్‌ నన్ను ప్రత్యేకంగా పిలిపించి చిలకలూరిపేటకు పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించాలని, మంచి రోజు చూసి ప్రకటన చేస్తామని చెప్పారు. ఇది జరిగిన కొద్ది రోజులకే మళ్లీ ఆ పదవిని కూడా నాకు తెలియకుండా ఆమెకే కట్టబెట్టారు. కార్యకర్తలకు అండగా ఉండాలని అన్నీ ఓర్చుకొని ఇంతకాలం పార్టీలో కొనసాగా. నాకే అనుకుంటే పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకూ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అన్యాయం జరిగింది. కొంతమందిపై కేసులు కూడా పెట్టారు. మా అవసరం పార్టీకి లేనప్పుడు, మాకు విలువ ఇవ్వనప్పుడు ఆ పార్టీలో ఎందుకు ఉండాలన్నది కార్యకర్తల అభిప్రాయం. నేను ఎమ్మెల్సీ పదవికి స్వచ్ఛందంగానే రాజీనామా చేశాను. కార్యకర్తలందరితో మాట్లాడి, మంచి రోజు చూసి టీడీపీలో చేరతాను’ అని మర్రి తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Shocking Video: నాదే తప్పు అయితే.. ఇక్కడి నుంచి వెళ్లిపోతా.. బస్సు డ్రైవర్ ఏం చేశాడో చూస్తే నివ్వెరపోవడం ఖాయం..

Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..

Updated Date - Mar 21 , 2025 | 06:08 AM