Share News

Musical Show : సమాజం కోసం మనం సైతం!

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:31 AM

ప్రతి ఒక్కరూ సమాజం గురించి ఆలోచించి.... సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. తలసీమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూజికల్‌ షో గురించి వివరించేందుకు సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి గురువారం ఆమె విజయవాడలో మీడియాతో మాటాడ్లారు.

Musical Show : సమాజం కోసం మనం సైతం!

నిధుల సేకరణకు 15న మ్యూజికల్‌ షో

తన టీమ్‌తో ఉచితంగా నిర్వహిస్తున్న తమన్‌

ప్రతి రూపాయీ బాధిత పిల్లల కోసమే

సీఎం పీఏలైనా టికెట్‌ కొనాల్సిందే: భువనేశ్వరి

అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ సమాజం గురించి ఆలోచించి.... సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. తలసీమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూజికల్‌ షో గురించి వివరించేందుకు సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి గురువారం ఆమె విజయవాడలో మీడియాతో మాటాడ్లారు. ‘‘సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్లు అనే స్ఫూర్తితో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు స్థాపించాం. తలసీమియా బాధిత పిల్లలకు రెండు లేదా నాలుగు నెలల్లో రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. దీనికి ఎంతో రక్తం అవసరం. ప్రతి ఒక్కరూ, కుటుంబ సభ్యులతో సహా రక్తదానం చేయాలి. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తలసీమియా సెంటర్లు ప్రారంభించాలని అనుకున్నాం. ఈ సెంటర్లకు నిధుల సేకరణ కోసమే ఈ మ్యూజికల్‌ షో ఏర్పాటు చేశాం. దీని గురించి చెప్పగానే తమన్‌ అంగీకరించారు. మా ట్రస్ట్‌ చేసే కార్యక్రమాలు చూసిన తర్వాత షో మొత్తం ఫ్రీగా చేస్తానని అంగీకరించారు’’ అని భువనేశ్వరి తెలిపారు. ఈనెల 15వ తేదీన విజయవాడలో ‘యుఫోరియా మ్యూజికల్‌ షో’ పేరుతో దీనిని నిర్వహిస్తున్నామని... బుక్‌ మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ప్రభుత్వాన్ని సాయం అడగను...

రెండు రాష్ట్రాల్లో తలసీమియా సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని భువనేశ్వరి తెలిపారు. ‘‘ప్రస్తుతం హైదరాబాద్‌లో చిన్న సెంటర్‌ను ఏర్పాటు చేశాం. అది సరిపోవడం లేదు. విశాఖ, తిరుపతి, హైదరాబాద్‌, రాజమండ్రిలో బ్లడ్‌ బ్యాంక్‌లున్నాయి. అక్కడే తలసీమియా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అమరావతిలో బసవతారకం క్యాన్సర్‌ ఇనిసిట్యూట్‌కు ప్రభుత్వం కొంత స్థలాన్ని ఇచ్చింది. అందులో బాలకృష్ణ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారు’’ అని తెలిపారు. సీఎం సతీమణిగా ప్రభుత్వ మద్దతు ఉంటుంది కదా... ఈ షో నిర్వహించడం ఎందుకనే ప్రశ్నకు భువనేశ్వరి సూటిగా బదులిచ్చారు. ‘‘ఐ యామ్‌ భువనేశ్వరి. పదవులు వస్తాయి.. వెళ్తాయి. అది నాకు ముఖ్యం కాదు. నేను నా కాళ్ల మీద నిలబడాలని అనుకుంటాను. సీఎం చంద్రబాబును నేను ఏదీ అడగను. ఒకవేళ... ఎన్టీఆర్‌ ట్రస్ట్‌, హెరిటేజ్‌ గురించి అడిగినా ఆయన వెంటనే ‘నో’ చెబుతారు. ఇప్పుడు కూడా మ్యూజికల్‌ షో నిర్వహిస్తున్నానని చెప్పగానే... ‘మీరు చేయండి. మీరు చేయగలరు’ అని మాత్రమే చెప్పారు. మ్యూజికల్‌ షోకు ఎవరైనా టికెట్‌ కొని రావాల్సిందే అని స్పష్టం చేశారు. ‘‘మా కుటుంబానికి సంబంధించి రూ.6 లక్షలు తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించి చంద్రబాబు ఒక టేబుల్‌ బుక్‌ చేశారు. షోకు ఎవ్వరూ ఫ్రీగా రావడానికి లేదు. సీఎం చంద్రబాబుతోపాటు వచ్చే పీఏలు కూడా టికెటు కొని రావాల్సిందే’’ అని భువనేశ్వరి నవ్వుతూనే సూటిగా చెప్పారు. ఈ కార్యక్రమానికి పవన్‌ కల్యాణ్‌ను ఫోన్‌ చేసి పిలిచానని, తప్పకుండా వస్తారని అనుకుంటున్నానని చెప్పారు.


ఆనందంగా ఉంది: తమన్‌

‘‘సీఎం చంద్రబాబు రాష్ట్రం కోసం చాలా చేస్తున్నారు. భువనేశ్వరి కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. నాపై నమ్మకముంచి ఈ షో చేయిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. షో ద్వారా వచ్చే ప్రతి రూపాయి పిల్లలకు అందిస్తాం. 50 మంది సింగర్స్‌ పాల్గొంటున్నారు. సీఎం చంద్రబాబు, ఎండీ భువనేశ్వరి, హీరో బాలకృష్ణ తదితరులు హాజరవుతారు. ఇది అతి పెద్ద షో అవుతుంది. దీనిని విజయవంతం చేయడానికి మా టీమ్‌ కష్టపడుతోంది. షోను కొత్తగా చేయాలని ఆలోచిస్తున్నాం’’ అని తమన్‌ తెలిపారు. భువనేశ్వరి చాలా ఎనర్జిటిక్‌ అని ప్రశంసించారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ అంటే ఆత్మ గౌరవానికి ప్రతీకని ట్రస్ట్‌ సీఈవో రాజేంద్రకుమార్‌ అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ను 1997లో చంద్రబాబు నాయుడు ప్రారంభించారని చెప్పారు.

‘‘తలసీమియా ఉందని బాధితుల్లో చాలా మందికి తెలియదు. ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడతారు. మరికొన్ని సమస్యలతో బాధపడతారు. ప్రతి ఒక్కరూ తలసీమియా పరీక్షలు చేయించుకోవాలి. నేను బ్లడ్‌ బ్యాంక్‌కు వెళ్లి చూసినప్పుడు వారిని చూస్తే చాలా బాధ అనిపించింది. అందుకే పిల్లల్లో తలసీమియా నివారణ కార్యక్రమం చేపట్టాం. దేశంలో 70 వేల మంది పిల్లలు తలసీమియాతో బాధపడుతున్నారు. అందులో 10 శాతం మంది మన రెండు రాష్ట్రాల్లో ఉన్నారు. దీనిపై రీసెర్చ్‌ సెంటర్‌ పెట్టాలని అనుకుంటున్నాం.’’

- భువనేశ్వరి

Updated Date - Feb 07 , 2025 | 04:31 AM