2027 నాటికి పోలవరం పూర్తి
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:23 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను 2027 డిసెంబరు నాటికి పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుం టున్నట్టు రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

నేడు సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన.. మంత్రి నిమ్మల ఏర్పాట్లు పరిశీలన
భారీ భద్రతా దళాల మోహరింపు..
రెండు రోజులుగా ప్రాజెక్టు పరిసరాల్లో నిఘా
పోలవరం/ఏలూరు క్రైం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను 2027 డిసెంబరు నాటికి పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుం టున్నట్టు రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం సీఎం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానున్న నేపథ్యంలో బుధవారం మంత్రి నిమ్మల ఏర్పాట్లను పరిశీలించారు.ఐదేళ్లలో పోలవరం నిర్మాణం ఆలస్యం కావడంతో రాష్ట్రం ఆర్థికంగా 50 వేల కోట్లు నష్టపోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి న వెంటనే చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి రూ.12,157 కోట్ల నిధులు సాధించారని తెలిపారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు రానీయకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికా రులను ఆదేశించారు. డయా ఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతం, ఎగువ, దిగువ కాపర్ డ్యాం ప్రాంతాలను పరిశీలించారు. సీఈ నరసింహమూర్తి, ఎస్‌ఈ రామచంద్రరావు, మేఘా జీఎం అంగర సతీష్ తదితరులు ఉన్నారు.
ఏర్పాట్లు పటిష్టంగా చేయాలి : ఎస్పీ, జేసీ
సీఎం పోలవరం పర్యటన ఏర్పాట్లను పటిష్టంగా చేయా లని ఎస్పీ ప్రతాప్‌శివకిశోర్, జేసీ ధాత్రిరెడ్డి అధికారులకు ఆదేశించారు. సీఎం పర్యటించనున్న ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను వీరు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులకు నిర్దేశించిన విధుల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని హెచ్చరించారు. అనుమతి ఉన్న వారికి మాత్రమే హెలిప్యాడ్ వద్దకు అను మతి ఇవ్వనున్నారు. ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, ఆర్డీవో ఎంవీ రమణ, డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సివిల్ సప్లైస్ డీఎం వి.శ్రీలక్ష్మి, డీఎస్‌వో ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు
సీఎం పోలవరం ప్రాజెక్టు పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ పర్యవేక్షణలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా గ్రే హౌండ్స్ దళాలు, యాంటీ నక్సల్స్ స్వాడ్ దళాలు అటవీ ప్రాంతంలో జల్లెడ పట్టాయి. అటవీ ప్రాంతం, పోలవరం ప్రాజెక్టు పరిసర 15 కిలోమీటర్ల వరకూ పోలీసులు పట్టు బిగించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
సీఎం పర్యటన ఇలా..
గురువారం ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి హెలీకాఫ్టర్‌లో బయలు దేరతారు.
10.45 గంటలకు పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ పాయింట్ నుంచి వీక్షిస్తారు.
11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు వరకు సీఎం ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించి, అధికారులతో సమీక్షిస్తారు.
3.10కు హెలీకాప్టర్‌లో ఉండవల్లి బయలుదేరతారు.