Nara Lokesh : ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై లోకేశ్ అసంతృప్తి
ABN , Publish Date - Jan 19 , 2025 | 06:02 AM
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ లోపంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

ఘాట్ గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోవడంపై అసహనం
సొంత నిధులతో మరమ్మతులకు ఆదేశాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ లోపంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా శనివారం ఎన్టీఆర్ ఘాట్‌లో తల్లి భువనేశ్వరితో కలిసి ఆయన నివాళులర్పించారు. ఘాట్ గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోవడం, గార్డెన్‌లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండటాన్ని చూసి లోక్‌శ్ అసహనం వ్యక్తం చేశారు. అవసరమైన అనుమతులు తీసుకొని వీలైనంత తొందరగా ఘాట్ మరమ్మతులు పూర్తి చేయాలని ఆయన తన సిబ్బందిని ఆదేశించారు. ‘ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించే విషయమై కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని.. కచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తెలంగాణలో టీడీపీని పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్ ఘాట్‌కు కుటుంబసభ్యులు, అభిమానులు, టీడీపీ నేతల రాక మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తో కలసి వచ్చి నివాళులర్పించి కొంత సమయం ఘాట్ వద్ద కూర్చున్నారు. అనంతరం సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తన సోదరుడు రామకృష్ణ, ఇతర నాయకులతో కలసి వచ్చి ఘాట్ వద్ద నివాళులర్పించారు.
ఎన్టీఆర్ పథకాలే వేరేపేర్లతో అమలు: బాలకృష్ణ
ప్రపంచంలోనే ఎన్టీఆర్‌ను మించిన నటనాచార్యులు ఎవరూ లేరని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పథకాలు ఇప్పటికీ పేర్లు మార్చి కొనసాగిస్తున్నారని చెప్పారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను ఆయన అభిమానులు, టీడీపీ నేతలు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆస్పత్రుల్లో రక్తదానంతో పాటు రోగులకు పండ్ల పంపిణీ, అన్నదానం చేపట్టారు.