Share News

నిధులు దిగమింగినా చర్యల్లేవు..!

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:29 AM

జిల్లాలో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లీనిక్‌లను నిర్మించాలని గత వైసీపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది, కనీసం నిర్మాణాలు ప్రారంభించారో లేదో కూడా అధికారులు పరిశీలించలేదు. కాంట్రాక్టులన్నీ అప్పటి అధికార వైసీపీ నాయకులే హస్తగతం చేసుకున్నారు. కొన్ని చోట్ల నిర్మాణం పేరుతో సిమెంట్‌ను తరలించుకుపోయారు, స్టీల్‌ నిమిత్తం అడ్వాన్స్‌ పేమెంట్‌లు చేసేసుకున్నారు. వైసీపీ నాయకులు, ఆనాటి పంచాయితీరాజ్‌ శాఖ అధికారులు కుమ్మకై ప్రభుత్వ సొమ్మును లక్షల రూపాయలు స్వాహా చేశారు. ఈ నిజాలు సోషల్‌ ఆడిట్‌లో వెలుగుచూసి సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ చర్యల్లేవు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

నిధులు దిగమింగినా చర్యల్లేవు..!

- భవనాలు నిర్మించకుండానే సిమెంట్‌, స్టీల్‌ మాయం

- గత వైసీపీ ప్రభుత్వంలో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లీనిక్‌ల నిర్మాణాలకు నిధులు మంజూరు

- వైసీపీ నాయకులే కాంట్రాక్టర్లు.. కుమ్మక్కైన అధికారులు

- సోషల్‌ ఆడిట్‌లో బయటపడ్డ నిజాలు

- నందివాడ మండలంలోనే లక్షలాది రూపాయలు పక్కదారి

- అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.36 లక్షల ఇనుము స్వాహా

- చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్న జిల్లా అధికారులు

జిల్లాలో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లీనిక్‌లను నిర్మించాలని గత వైసీపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది, కనీసం నిర్మాణాలు ప్రారంభించారో లేదో కూడా అధికారులు పరిశీలించలేదు. కాంట్రాక్టులన్నీ అప్పటి అధికార వైసీపీ నాయకులే హస్తగతం చేసుకున్నారు. కొన్ని చోట్ల నిర్మాణం పేరుతో సిమెంట్‌ను తరలించుకుపోయారు, స్టీల్‌ నిమిత్తం అడ్వాన్స్‌ పేమెంట్‌లు చేసేసుకున్నారు. వైసీపీ నాయకులు, ఆనాటి పంచాయితీరాజ్‌ శాఖ అధికారులు కుమ్మకై ప్రభుత్వ సొమ్మును లక్షల రూపాయలు స్వాహా చేశారు. ఈ నిజాలు సోషల్‌ ఆడిట్‌లో వెలుగుచూసి సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ చర్యల్లేవు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఆంధ్రజ్యోతి-గుడివాడ:

గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలోని అరిపిరాల గ్రామానికి రూ.4.84 లక్షల విలువ గల సిమెంట్‌, స్టీల్‌ను విడుదల చేశారని పీఆర్‌ అధికారులు ధ్రువీకరించారు. ఈ గ్రామంలో కనీసం నిర్మాణం చేపట్టలేదని సామాజిక తనిఖీల్లో గుర్తించారు. పోలుకొండ గ్రామంలో మూడు నిర్మాణాల కోసం సిమెంట్‌, స్టీల్‌ నిమ్తితం రూ.3.71 లక్షల నిధులను వినియోగించుకున్నట్లు పంచాయితీ రాజ్‌ అధికారులు ధ్రువీకరించారు. సదరు సిమెంట్‌ ఎక్కడికి వెళ్లిందో, మిగిలిన నిధులు ఏమయ్యాయో మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పుట్టగుంట గ్రామంలో నిర్మాణాల పేరుతో 2021లో విడుదల చేసిన 1300 సిమెంట్‌ కట్టలు ఏమయ్యాయో పంచాయితీరాజ్‌ అధికారులు తెలపడం లేదు. వాటిని పంచాయితీరాజ్‌ ఇంజనీర్లు, అప్పటి వైసీపీ నాయకులు కుమ్మకై తరలించుకుపోయారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

సామాజిక తనిఖీలో గుట్టురట్టు

2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం ద్వారా సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. దీనికి గాను నందివాడ మండలం అరిపిరాల గ్రామ సచివాలయ నిర్మాణానికి స్టీల్‌ నిమిత్తం రూ.2,39,693 అడ్వాన్స్‌ పేమెంట్‌గా తీసుకున్నారని 2022 సామాజిక తనిఖీల్లో తేల్చారు. వారం వ్యవధిలో పనిని ప్రారంభించాలని లేని పక్షంలో నిధులను రికవరీ చేయాలని అప్పటి పంచాయితీరాజ్‌ ఏఈకి అప్పటి డ్వామా ఏ.పి.డి ఆదేశాలిచ్చారు. మూడేళ్లు కావస్తున్నా నేటికి నిర్మాణం ప్రారంభం కాలేదు, నిధులు రికవరీ చేయడంలో అధికారులు అలసత్వం చూపారు. వైసీపీ నాయకుల అవినీతిలో పంచాయితీరాజ్‌ అధికారులకు కూడా సంబంధం ఉండటంతో విచారణ ముందుకు సాగడం లేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఒక్క పైసా జమకాలేదు

సామాజిక తనిఖీల్లో సిమెంట్‌, స్టీల్‌ నిమిత్తం తీసుకున్న అడ్వాన్స్‌లు ఎక్కడా తిరిగి ఉపాధి హామీ ఖాతాల్లో జమ అయిన దాఖలాలు లేవు. ఈ విషయమై అధికారులను గత ఏడాది మేలో ప్రశ్నించగా, పంచాయితీలకు చెందిన స్పెషల్‌ ఖాతాల్లో నగదు ఉందని, దానిని రెండు రోజుల వ్యవఽధిలో ఆర్‌.డి(రూరల్‌ డెవలప్‌మెంట్‌), విజయవాడ ఖాతాల్లోకి జమ చేయిస్తామని పీఆర్‌ అధికారులు తేల్చి చెబుతున్నారు. రెండు రోజుల మాట చెప్పి మూడేళ్లు గడుస్తున్నా ఒక్క పైసా కూడా ఆర్‌.డి ఖాతాలోకి జమకాలేదు.

ఎమ్మెల్యే వెనిగండ్ల మాట బేఖాతరు

నందివాడ మండలంలో సిమెంట్‌, స్టీల్‌ పేరుతో మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు, పంచాయితీ ఏఈ, మండల పరిషత అధికారులు కుమ్మకై లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారని ఇటీవల నందివాడ మండల టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సదరు వ్యక్తులపై కేసులు పెట్టి, ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని మండల పరిషత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యే ఆదేశించి 4 నెలలు గడుస్తున్న అధికారులు సదరు సిమెంట్‌, స్టీల్‌ స్వాహా స్కాంలో ఒక్క అడుగు కూడా విచారణ ముందుకు సాగలేదు. ఎమ్మెల్యే వెనిగండ్ల ఆదేశాలను సైతం తుంగలో తొక్కి మండల పరిషత అధికారులు వైసీపీ నాయకులకు అండగా నిలిచారనే విమర్శలు ఉన్నాయి.

తవ్వేకొద్దీ వెలుగులోకి..

అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.36 లక్షలు, గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలోని మూడు గ్రామాల్లో రూ.11 లక్షల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారు. నందివాడ మండలంలో పుట్టగుంటలో 1300 సిమెంట్‌ కట్టలు మాయం చేశారు. మిగిలిన గ్రామాల్లో తనిఖీలు చేపట్టిన దాఖలాలు లేవు. నేటికి లెక్కలు తేలలేదు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయి విచారణ చేపడితే కోట్ల రూపాయల అవినీతి బయటపడే అవకాశం ఉంది.

విచారణ జరిపి ఐదు నెలలు గడుస్తున్నా..

అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జరిగిన అవినీతిపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ చేసి రూ.36 లక్షలు విలువ గల ఇనుమును స్వాహా చేసినట్లు విచారణ అధికారులు తేల్చారు. పూర్తి స్థాయి నివేదికను కలెక్టర్‌ కార్యాలయానికి పంపి ఐదు నెలలు కావస్తోంది. ఈ వ్యవహారంలో పంచాయితీ రాజ్‌ ఏఈల పాత్ర స్పష్టమవ్వడంతో వారందరిని జిల్లా కార్యాల యానికి బదిలీ చేసి కూర్చోపెట్టి నెలనెలా జీతాలు చెల్లిస్తున్నారు. కానీ వారిపై చర్యలు ఉపక్రమించలేదు.

Updated Date - Mar 23 , 2025 | 01:29 AM