TDP Govt : రోడ్లకు మహర్దశ

ABN, Publish Date - Feb 03 , 2025 | 03:41 AM

రాష్ట్ర పరిధిలోని రోడ్లకు జగన్‌ సర్కారు కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. ఐదేళ్లలో తట్టెడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదు.

TDP Govt : రోడ్లకు మహర్దశ
  • నాడు నేడు

  • నాడు గజానికో గుంతతో విలవిల

  • నేడు అద్దంలా రోడ్లు మిలమిల

  • ఐదేళ్లూ పట్టించుకోని జగన్‌ సర్కారు

  • కూటమి ప్రభుత్వం రాగానే కదలిక

  • రాష్ట్రవ్యాప్తంగా మరమ్మతులు, కొత్త రోడ్లు

జగన్‌ పాలన అనగానే వెంటనే అవినీతి, అక్రమాలు, కేసులు, దోపిడీ, దౌర్జన్యాలు.. ఇలా ఎన్నో గుర్తుకొస్తాయి. ఈ విషయాలను కాసేపు పక్కనపెడితే గతుకుల రోడ్లతో గత ఐదేళ్లూ ప్రజలు నరకం చూశారు. రాష్ట్ర పరిధిలోని రోడ్లకు జగన్‌ సర్కారు కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. ఐదేళ్లలో తట్టెడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదు. నాడు వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లు ఏకంగా కాలువలు, మడుగులను తలపించేవి. బురద రోడ్లలో అడుగడుగునా గుంతలే. ఎన్నో ప్రమాదాలు జరిగినా జగన్‌ సర్కారు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిపై దృష్టిసారించింది. ఓవైపు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా.. యుద్ధప్రాతిపదికన పనులు చేయడానికి నిధులు మంజూరు చేసింది. పాడైన రోడ్లకు మరమ్మతులు చేయించడం, కొన్నిచోట్ల కొత్త రోడ్లు వేస్తుండటంతో జనం కష్టాలు తీరుతున్నాయి. నాటి గతుకుల రోడ్ల స్థానంలో అద్దంలా మెరిసిపోతున్న రోడ్లు దర్శనమిస్తున్నాయి. మట్టిరోడ్ల స్థానంలో గ్రామాలకు తారు రోడ్లు, గ్రామాల్లో సిమెంటు రోడ్లు నిర్మిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో కొత్తగా తారు రోడ్లు వేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు రోడ్లకు మహర్దశ వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నాడు, నేడు మచ్చుకు కొన్ని దృశ్యాలు...


ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, మద్దిపాడు మండలాలకు వారఽధిగా ఉండే నేకునంబాదు-దొడ్డవరం రోడ్డు ఇది. అప్పట్లో ఈ రోడ్డు నిర్మాణానికి అనుమతులిచ్చిన జగన్‌ ప్రభుత్వం నిధులు మాత్రం ఇవ్వలేదు. దాంతో మొన్నటి వరకూ ఈ రోడ్డుపై అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3.05 కి.మీ దూరం రహదారి నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేసి రోడ్డు నిర్మించేశారు.

కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా కోడూరు మండల కేంద్రం నుంచి రామకృష్ణాపురం వెళ్లే రోడ్డు ఇది. జగన్‌ ప్రభుత్వంలో రోడ్డంతా గుంతలు పడిపోయి కాల్వలను తలపిస్తున్నా పట్టించుకున్నవారు లేరు. వేల కోట్ల రూపాయలు బటన్లు నొక్కాను అని చెప్పుకొన్న అప్పటి సీఎం జగన్‌ దీని కోసం కేవలం రూ.71 లక్షలు కేటాయించలేకపోయారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక... ఆ 71 లక్షలు ఖర్చు పెట్టడంతో గుంతల రోడ్డు కాస్తా ఇలా మారిపోయింది.


నంద్యాల జిల్లా

కచ్చాపచ్చాగా నిర్మాణం సగంలో వదిలేసినట్లున్న ఈ రోడ్డు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం రామతీర్థం ఎస్టీ కాలనీలోని రహదారి. జగన్‌ ప్రభుత్వంలో ఇలాగే వదిలేసిన ఈ రోడ్డును ప్రస్తుత ప్రభుత్వం సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది.

గుంటూరు జిల్లా

వైసీపీ హయాంలో రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి నిదర్శనం ఈ చిత్రం. గుంటూరు నుంచి పెదపలకలూరు వెళ్లే ప్రధాన రహదారి ఇది. రోడ్డంతా గుంతలు... వాటి నిండా నీటితో ప్రమాదాలకు నెలవుగా మారిన వైనమిది. అయినా అప్పటి జగన్‌ ప్రభుత్వంలో గుంతలు పూడ్చాలన్న ఆలోచన కూడా రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ రహదారిని ఇలా అద్దంలా మార్చింది.


అనకాపల్లి జిల్లా

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఘాట్‌ రోడ్డు జంక్షన్‌ నుంచి మండల కేంద్రానికి వెళ్లే రహదారి ఇది. దారిపొడవునా గుంతలతో ఈ రోడ్డు నరకానికి మార్గంగా నిలిచింది. కేవలం 15 లక్షల రూపాయలు వెచ్చించలేని నాటి సీఎం జగన్‌ తీరుతో ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రజలు నరకం చూశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 15 లక్షలు కేటాయించడంతో ఇదుగో నాటి గుంతల రోడ్డు నేడు నున్నగా ముస్తాబైంది.

కర్నూలు జిల్లా

మట్టి దిబ్బలు... పారుదల లేక నిలిచిపోయిన మురుగునీరుతో కనిపిస్తున్న ఇది కూడా రోడ్డే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలోని అగ్రహారంలో ఉన్న బీసీ కాలనీ రోడ్డు జగన్‌ సీఎంగా ఉండగా ఇలా ఉండేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఈ రహదారిని అటూ ఇటూ డ్రైనేజ్‌లతో సీసీ రోడ్డుగా ఇలా నున్నగా మార్చేశారు.


పెందుర్తిలో...

పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని మండల కేంద్ర పరవాడ సినిమా హాల్‌ జంక్షన్‌ నుంచి బొట్టవానిపాలెం వరకు ప్రధాన రహదారి ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి దారుణంగా వుండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.12 లక్షలతో అభివృద్ధి చేశారు. దీంతో ప్రయాణం సాఫీగా సాగుతున్నదని ప్రజలు అంటున్నారు.

విజయనగరం జిల్లా

అడుగు తీసి అడుగు వెయ్యాలంటే భయం. వాహనం నడపాలంటే సర్కస్‌ ఫీట్లు చేయాల్సిందే. పై ఫొటోలలో మొదటిది విజయనగరం-నెల్లిమర్ల రోడ్డు. రెండోది నెల్లిమర్ల నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం వెళ్లే రహదారి. రోడ్ల నిండా గొతులు ఉండడంతో ఆ గోతులు ఎంత లోతున్నాయో తెలియక ఈ రహదారులపై ప్రయాణమంటే జనం హడలెత్తిపోయేవారు. జగన్‌ హయాం అంతా ఈ రోడ్లపై ప్రజలు ఇలాగే ఇక్కట్లు అనుభవించారు. ఎన్నో ప్రమాదాలు జరిగాయి. కొందరు ప్రాణాలూ కోల్పోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఈ రహదారులకు మహర్దశ పట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి

Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 03 , 2025 | 04:00 AM