Judicial Magistrate : పోసానికి ఆదోని కోర్టు రిమాండ్
ABN , Publish Date - Mar 06 , 2025 | 03:45 AM
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆదోని కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

కర్నూలు జిల్లా జైలుకు తరలింపు
బెయిల్ పిటిషన్‌పై నేడు నరసరావుపేట కోర్టులో విచారణ
ఇటు బెజవాడలోనూ పీటీ వారెంట్లు
కర్నూలు/గుంటూరు లీగల్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆదోని కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆయన అసభ్య పదజాలంతో దూషించారని ఆదోని జనసేన నాయకుడు మలిశెట్టి రేణువర్మ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆదోని మూడో పట్టణ పోలీసులు పీటీ వారెంట్‌పై పోసానిని గుంటూరు జైలు నుంచి మంగళవారం తీసుకొచ్చారు. అర్ధరాత్రి దాటాక కర్నూలు వీఆర్ కాలనీలో నివాసముంటున్న ఆదోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ ఇన్‌చార్జి మేజిస్ర్టేట్ అపర్ణ ఎదుట హాజరుపరిచారు. న్యాయాధికారి ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. తనను ఆదోని జైలులో కాకుండా కర్నూలు జిల్లా జైలులో ఉంచాలని పోసాని కోరగా.. ఆయన విజ్ఞప్తి మేరకు కర్నూలు జిల్లా జైలుకు పంపుతూ మేజిస్ర్టేట్ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయన్ను కర్నూలు శివారులోని పంచలింగాలలో ఉన్న జిల్లా కారాగారానికి తరలించారు. కాగా.. మరో కేసులో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై పల్నాడు జిల్లా నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో గురువారం విచారణ జరుగనుంది. నరసరావుపేట రెండో పట్టణ పోలీసులు పీటీ వారెంట్‌పై అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి తీసుకొచ్చి స్థానిక కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు పంపిన విషయం విదితమే. ఇంకోవైపు.. పోసానిపై విజయవాడలో బుధవారం పీటీ వారెంట్లు దాఖలయ్యాయి. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారంటూ సూర్యారావుపేట, భవానీపురం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.