లీజుకు ఓఎఫ్‌సీ నెట్‌వర్క్
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:15 AM
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) వ్యాపారంలోకి అడుగు పెట్టింది.

ఈపీడీసీఎల్ యోచన
అదనపు ఆదాయం సాధించేందుకు యత్నం
బిడ్ల ఆహ్వానం
జాతీయ స్థాయిలో ఆసక్తి
ఎయిర్‌టెల్ వంటి సంస్థల సంప్రతింపులు
ప్రస్తుతం ఒక ఫైబర్‌కు కిలోమీటరుకు రూ.20 వేలు వసూలు చేస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్
విద్యుత్ పంపిణీ సంస్థ వద్ద 218 కిలోమీటర్ల మేర 96 ఫైబర్లు...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) వ్యాపారంలోకి అడుగు పెట్టింది. దీని ద్వారా అదనపు ఆదాయం సాధించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇవ్వగా జాతీయ స్థాయిలో పలు కంపెనీలు ఆసక్తి కనపరుస్తున్నాయి.
విశాఖపట్నంలో హుద్‌హుద్ తుఫాన్ వచ్చినప్పుడు విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి అలాంటి విపత్తు వస్తే విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా తీర ప్రాంతమంతా భూగర్భ విద్యుత్ కేబుల్ వేయాలని ఆదేశించారు. దాంతో రాష్ట్రంలో తొలిసారి విశాఖ నగరంలో మొదటి దశలో సముద్ర తీర ప్రాంతంలో 218 కి.మీ. పొడవున భూగర్భంలో విద్యుత్ కేబుళ్లు వేశారు. ఆ సమయంలోనే విద్యుత్ కేబుల్‌తో పాటు ‘96 ఎఫ్’ సామర్థ్యం కలిగిన ఓఎఫ్‌సీని వేశారు. దీనిని ఇంటర్నెట్ కోసం వినియోగిస్తారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈపీడీసీఎల్‌కు అవసరం లేకపోయినా ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దానిని ఉపయోగించుకోవాలని ప్రస్తుత సీఎండీ పృథ్వీతేజ్ కార్యాచరణ రూపొందించారు. ఇటీవల రెండో దశలో 907 కి.మీ. మేర భూగర్భ కేబుల్ వేయడానికి పనులు ప్రారంభించారు. దీనికోసం మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో రహదారులను తవ్వాల్సి వచ్చింది. దీనికి ఆ సంస్థ కి.మీ.కు కోటి రూపాయలు కట్టాలని డిమాండ్ చేసింది. ఈ ప్రాజెక్టు వ్యయమే అంత లేదని కలెక్టర్‌కు చెప్పి ఆ ఖర్చును తగ్గించుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎండీ పృథ్వీతేజ్...భూగర్భంలో కేబుల్ వేయడానికి తవ్వకం ఖర్చు కి.మీ.కు కోటి రూపాయలు అవుతుంటే..ప్రస్తుతం ఇంటర్‌నెట్ సేవలు అందిస్తున్న సంస్థలు ఓఎఫ్‌సీ వేయడానికి, నిర్వహణకు ఇంకెంత వెచ్చిస్తున్నాయో లెక్కలు వేశారు. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక్కడకు అనేక ఐటీ సంస్థలు రావడానికి ఆసక్తి చూపుతున్నందున ఇప్పటికే 218 కి.మీ. పొడవున వేసిన 96 ఎఫ్ ఓఎఫ్‌సీని ఎవరికైనా లీజుకు ఇస్తే అదనపు ఆదాయం వస్తుంది కదా?...అని యోచించారు. నగరంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఇలాంటి ఓఎఫ్‌సీనే పలు సంస్థలకు అద్దెకు ఇచ్చింది. ఒక ఫైబర్‌కి కి.మీ.కు ఏడాదికి రూ.20 వేలు వసూలు చేస్తోంది. ఆ లెక్కన చూసుకుంటే ఈపీడీసీఎల్ వద్ద 96 ఫైబర్లు, 218 కి.మీ. పొడవున ఉన్నాయి. భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో వీటిని లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఓఎఫ్‌సీని సాంకేతికంగా నిర్వహించే పరిజ్ఞానం లేకపోవడంతో సప్లయ్, ఇనస్టాలేషన్, కమిషనింగ్, టెస్టింగ్...వంటి పనులన్నీ లీజు సంస్థే చేయాలనే నిబంధనలతో పదేళ్లకు లీజుకు ఇవ్వడానికి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీచేసింది. దీనికి జాతీయ స్థాయిలో స్పందన వస్తోంది. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి ఎయిర్‌టెల్, వీటీఎల్ వంటి సంస్థలు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నాయి. విశాఖపట్నం వంటి నగరంలో వీధి వీధినా రోడ్లు తవ్వి ఓఎఫ్‌సీ కేబుల్ వేయడం ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో ఇప్పటికే వేసి ఉన్న కేబుల్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉండడంతో చాలామంది ముందుకు వస్తున్నారు.
రెండో దశలో 907 కి.మీ.
విశాఖపట్నంలో రెండో దశలో 907 కి.మీ. పొడవున భూగర్భ విద్యుత్ కేబుల్ వేస్తున్నారు. అయితే ఇందులో ఈపీడీసీఎల్ ఓఎఫ్‌సీ వేయడం లేదు. నిధులు తక్కువగా ఉన్నందున ఆ ఆలోచన విరమించుకుంది. అయితే తమ విద్యుత్ కేబుల్‌తో పాటు భూగర్భంలో ఓఎఫ్‌సీ వేసుకునేందుకు అవకాశం ఇస్తామని, ఎవరైనా మంచి ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరింది. దీనికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. ఓఎఫ్‌సీ వేయడానికి కిలోమీటరుకు సుమారు రూ.4 లక్షల వ్యయం అవుతుంది. దాని నిర్వహణ అంతా మళ్లీ మామూలే. ఇందులో ఎవరు ఎక్కువ ఆదాయం ఇస్తారో వారికి లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. ఈ ఆదాయం కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.