దగా పడుతున్న మిర్చి రైతులు
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:10 PM
మిర్చి రైతులు అవసరాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు నిలువునా ముంచుతున్నారు. సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు పరిసర గ్రామాలలో పెద్ద ఎత్తున మిరప సాగు చేస్తుంటారు. ఆయా గ్రామాలలో మిర్చి సాగు చేసే రైతులలో 70 శాతం మంది సన్న, చిన్న కారు రైతులు, కౌలు రైతులు ఉన్నారు. దీనికి తోడు ఈనాం భూములు కావడంతో బ్యాంక్‌లలో పంట రుణాలు కూడా అంతంత మాత్రంగానే ఇస్తున్నారు. దీంతో అత్యధిక శాతం రైతులు పెట్టుబడులకు వ్యాపారుల మీద ఆధార పడాల్సిందే. ఈ నేపథ్యంలో వ్యాపారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నాణ్యత లేని విత్తనాలు మొదలు, పురుగు మందులు విక్రయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

నకిలీ విత్తనాల వద్ద నుంచి ధరల వరకు అదే పంథా
ఆరుగాలం కష్టపడినా చేతికి వచ్చేది చిల్లి గవ్వే
కొమ్మాలపాడు పరిసర గ్రామాల రైతుల ఆవేదన
అద్దంకి, మార్చి 27 (ఆంద్రజ్యోతి) : మిర్చి రైతులు అవసరాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు నిలువునా ముంచుతున్నారు. సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు పరిసర గ్రామాలలో పెద్ద ఎత్తున మిరప సాగు చేస్తుంటారు. ఆయా గ్రామాలలో మిర్చి సాగు చేసే రైతులలో 70 శాతం మంది సన్న, చిన్న కారు రైతులు, కౌలు రైతులు ఉన్నారు. దీనికి తోడు ఈనాం భూములు కావడంతో బ్యాంక్‌లలో పంట రుణాలు కూడా అంతంత మాత్రంగానే ఇస్తున్నారు. దీంతో అత్యధిక శాతం రైతులు పెట్టుబడులకు వ్యాపారుల మీద ఆధార పడాల్సిందే. ఈ నేపథ్యంలో వ్యాపారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నాణ్యత లేని విత్తనాలు మొదలు, పురుగు మందులు విక్రయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత్యంతరం లేక రైతులు వాటినే అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇక పంట చేతికి వచ్చిన తరువాత పచ్చి మిర్చిని వ్యాపారుల కనుసన్ననలోని దళారులకే అమ్మాల్సి రావటం రైతులకు మ రింత నష్టం చేకూర్చుతుంది. బహిరంగ మార్కెట్ కంటే మరింత తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా ఉండే దళారులకే అమ్మాల్సి రావడం, బయట వ్యాపారులను స్థానికంగా కొనుగోలు చేసేందుకు రానివ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో స్థానికంగానే అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ఏటా రైతులు ఆందోళనలు చేయడం పరిపాటిగా మారింది. ఇది చాలదన్నట్లు స్థానికంగానే నకిలీ మిరప విత్తనాలను ప్రాసెసింగ్ చేయడం కూడా రైతులను మరింత ఆందోళన కలిగిస్తోంది. సమీప గ్రామాలలో పండే మిరప కాయల నుంచి విత్తనాలు తీసి ప్రాసెసింగ్ చేసి కంపెనీ లేబుల్స్ వేసి అమ్మకాలు చేస్తుండడం స్థానిక రైతులను కలవరపాటుకు గురిచేస్తుంది. పెద్ద కంపెనీల పేర్లతో స్థానింగా లభించే విత్తనాలను అమ్మకాలు చేస్తుండడం తెలుసుకున్న రైతులు విస్మయానికి గురవుతున్నారు. ఇలా విత్తనాల వద్ద నుంచి పురుగుమందులు, ఇతర పెట్టుబడుల వరకు స్థానిక వ్యాపారుల మీద ఆధారపడాల్సి రావడంతో ఆరుగాలం కష్టపడ్డా తీరా చేతికి వచ్చేది మాత్రం ఏమి ఉండడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు, మామిళ్లపల్లి, ఏల్చూరు, బల్లికురవ మండలం రామాంజనేయపురం, యస్‌యల్ గుడిపాడు తదితర గ్రామాల రైతులు ఎక్కువ విస్తీర్ణం లో మిరప సాగు చేస్తున్నారు. అదే సమయంలో కొ మ్మాలపాడులోని వ్యాపారుల వద్ద పెట్టుబడులకు ఆశ్రయిస్తుంటారు. అధికారులు స్పందించి రైతులకు రుణాలు అందించే చర్యలు చేపట్టడంతో పాటు నకిలీ, కల్తీ విత్తనాలు, పురుగు మందుల అమ్మకాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.