Share News

Oil Palm Cultivation: 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యం

ABN , Publish Date - Mar 31 , 2025 | 06:06 AM

తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

Oil Palm Cultivation: 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యం

ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమంపై సీఎం దృష్టి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సత్తుపల్లి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నిర్మించనున్న ఆయిల్‌పామ్‌ కర్మాగారానికి ఆదివారం రాత్రి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో పది లక్షల ఎకరాలు, వచ్చే సీజన్‌లో మరో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పామాయిల్‌ సాగులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉంటుందన్నారు. ఇతర దేశాల నుంచి నాణ్యమైన, తక్కువ కాల పరిమితిలో దిగుబడి వచ్చే, ఎత్తు తక్కువగా పెరిగే ఆయిల్‌పామ్‌ మొక్కలను తెప్పించాలని ఆయిల్‌ఫెడ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ.. ఆరు పథకాల హామీని నెరవేర్చే దిశగా కృషి జరుగుతోందన్నారు. ఇందుకోసం ఇప్పటి వరకు రూ.33 వేల కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో సాగు చేసిన పంటలకు బీమా కల్పించి పంట నష్టపోయిన రైతులకు పరిహారం సొమ్ము చెల్లించేందుకు ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 06:06 AM