Share News

పారదర్శకంగా భూముల రీసర్వే

ABN , Publish Date - Mar 31 , 2025 | 01:47 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన దానికి భిన్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

పారదర్శకంగా భూముల రీసర్వే

ప్రతి మండలంలో రెండు గ్రామాలు ఎంపిక

గ్రామసభలు, ర్యాలీలు నిర్వహించాలని జేసీ ఉత్తర్వులు

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన దానికి భిన్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏపీ రీసర్వే ప్రాజెక్టు-2 కింద చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసి కొత్తగా భూసర్వే చేసి హద్దులు నిర్ధారించనున్నారు. ఈమేరకు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ ఉత్తర్వులు జారీచేశారు. మారిన ప్రామాణిక కార్యాచరణ విధానం ప్రకారం గ్రామాల్లో భూ వివా దాల పరిష్కారంతోపాటు రికార్డులను నవీకరిం చడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఎంపిక చేసిన గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులకు భూసర్వే కార్యక్రమాన్ని వివరించనున్నారు. ర్యాలీలు నిర్వహించి వారిని చైతన్యవంతం చేసేలా మండల, క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

పాటించాల్సిన నిబంధనలు ఇవీ..

మండల తహసీల్దార్‌, సర్వేయర్లు ఆయా గ్రామాల్లో భూములను 200 నుంచి 250 ఎకరాల వరకు ఒక బ్లాకుగా విభజించి ఒక్కో దానికి ఒక సర్వే బృందాన్ని కేటాయించాలి. ఆ బ్లాకు పరిధిలోని భూముల రైతులకు రీసర్వేకు సంబంధించిన సమా చారం నోటీసుల ద్వారా తెలియజేయాలి. వారి మొబైల్‌ నంబర్లతో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి సమాచారం ఎప్పటికప్పుడు అందులో ఉంచాలి. మండల తహసీల్దార్‌, సర్వేయరు ఆ గ్రామానికి సంబంధించిన షెడ్యూల్‌ను సిద్ధం చేయాలి. గ్రామ సరిహద్దులు, బ్లాక్‌ హద్దులు, ప్రభుత్వ భూములు, సంస్థలకు సంబంధించిన భూములు, ప్రైవేటు వ్యక్తుల భూముల వివరాలను సిద్ధం చేయాలి. సర్వే నంబర్ల వారీగా ఉన్న విస్తీర్ణాన్ని ఆర్‌ఎస్‌ఆర్‌, ఎఫ్‌ఎల్‌ఆర్‌ ఆధారంగా వెబ్‌ల్యాండ్‌లోని ధ్రువీకరిం చుకోవాలి. రీసర్వేకు ఎంపిక చేసిన గ్రామాల్లో ఆర్డీవోలు గ్రామసభలు నిర్వహించి రైతులకు వివరించాలి. సర్వే కార్యక్రమాలను వీడియో లేదా ఫొటోల ద్వారా చిత్రీకరించి మొత్తం కార్యక్రమం పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగించాలి. రీసర్వేకు నియమితులైన ఉద్యోగులను తహసీల్దార్లు, ఎంపీడీవోలు రిలీవ్‌ చేయాలి. జిల్లా సర్వేయర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని జేసీ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 01:47 AM