Share News

17 మండలాల్లో కరువు

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:21 AM

జిల్లాలో రబీ సీజన్‌లో 17 మండలాల్లో కరువు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో 11 మండలాల్లో తీవ్రస్థాయిలో ఉండగా మరో ఆరుచోట్ల ఒక మో స్తరు ఉన్నట్లు పేర్కొంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా సోమ వారం ఉత్తర్వులు జారీచేశారు.

17 మండలాల్లో కరువు

11 చోట్ల తీవ్ర, ఆరుచోట్ల ఒక మోస్తరు

రబీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు

తాగునీరు, పశుగ్రాసానికి నిధులిచ్చే అవకాశం

ఒంగోలు మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రబీ సీజన్‌లో 17 మండలాల్లో కరువు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో 11 మండలాల్లో తీవ్రస్థాయిలో ఉండగా మరో ఆరుచోట్ల ఒక మో స్తరు ఉన్నట్లు పేర్కొంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా సోమ వారం ఉత్తర్వులు జారీచేశారు. వర్షపాతం నమోదు, భూగర్భ జలమట్టాలు, పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనాతోపాటు వర్షాలు సకాలంలో కురిశాయా? లేదా? అన్న అంశాల ఆధారంగా ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. రబీ సీజన్‌లో అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈ అంశాల ఆధారంగా ఫిబ్రవరి ఆఖరులో నివేదికలను ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుత వేసవిలో పలు జిల్లాల్లో తాగునీరు, పశు గ్రాసం ఇతరత్రా సమస్యలను ఎదుర్కొనేందుకు కరువు ప్రాంతాల ప్రకటనతోపాటు నిధుల కల్ప నను ఇటీవల నిర్వహించిన సమావేశంలో పలువురు కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మన కలెక్టర్‌ కూడా 14 మండలాల్లోని 230 అవాసాలకు ట్యాంకర్లతో నీటి సరఫరాకు రూ.11.20 కోట్లు కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయా జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించి ఆరు జిల్లాల్లోని 51 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. అందులో మన జిల్లాకు సంబంధించే 17 మండలాలు ఉన్నాయి.

జిల్లా అంతటా అదే పరిస్థితి

ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం జిల్లాలో 11 మండలాలు తీవ్ర, మరో ఆరు ఒక మోస్తరు తీవ్రత కరువు నెలకొన్న మండలాలుగా ఉన్నాయి. జిల్లా అంతటా రబీలో కరువు వాతావరణం నెలకొంది. కీలకమైన అక్టోబరు, నవంబరుల్లో సరైన వర్షాలు లేవు. పంటల సాగు కూడా అంతంతమాత్రంగానే ఉంది. అయితే డిసెంబరులో రెండు విడతలుగా అకాల వర్షాలు కురిశాయి. దీంతో చాలా మండలాల్లో ఈశాన్య రుతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతంతోపాటు పంట సాగు జరిగింది. మొత్తంగా ఈ కాలంలో 384.80 మి.మీ సాధారణ వర్షపాతానికి 376.80 మి.మీ నమోదైంది. అదేసమయంలో 3.99 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి 3.01 లక్షల ఎకరాలు మాత్రమే సాగైంది. అంటే దాదాపు 25శాతం విస్తీర్ణంలో పంటలు పడలేదు. దీనికి తోడు సకాలంలో వర్షాలు కురవక పలుమార్లు డ్రైస్పెల్స్‌ ఏర్పడ్డాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని 17 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది.

తీవ్ర కరువు మండలాలు

పుల్లలచెరువు, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, కంభం, తర్లుపాడు, పెద్దారవీడు, సంతనూతలపాడు, ఒంగోలు, వెలిగండ్ల, బేస్తవారపేట

ఒక మోస్తారు తీవ్రత ఉన్నవి..

కొనకనమిట్ల, మార్కాపురం, చీమకుర్తి, సీఎస్‌పురం, పామూరు, రాచర్ల

ఆయా మండలాల్లో తాగునీరు, పశుగ్రాసం కోసం నిధులు వచ్చే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకం పనులను గరిష్ఠంగా 100 రోజులకు బదులు 150 రోజుల వరకు పెంచనున్నారు.

Updated Date - Apr 01 , 2025 | 01:21 AM