48 గంటల్లోనే చేతి‘‘కంది’’న డబ్బు
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:08 AM
దళారులు లేరు.. దందా అంతకంటే లేదు.. మార్కెట్ మాయాజాలం లేనేలేదు.. ఇక తూకాల్లో తేడాలు లేవు.. ఉన్నదల్లా ఒకటే ధర. అదీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర.. అధికారులు సూచించిన మేరకు రైతులు తాము పండించిన కందులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకుంటే చాలు. పంట అమ్మిన 48 గంటల్లో డబ్బు బ్యాంక్ ఖాతాల్లో పడిపోతుంది. ఇలా మర్రిపూడి మండలం చిమట గ్రామంలో పంటను అమ్మిన 45 మంది రైతులకు 55 లక్షలు జమయ్యాయి.

కందుల కొనుగోలు వేళ.. అన్నదాతల ఆనందహేళ
ప్రభుత్వ కేంద్రాల్లో వేగవంతంగా చర్యలు
జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచిన చిమట పాయింట్
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
దళారులు లేరు.. దందా అంతకంటే లేదు.. మార్కెట్ మాయాజాలం లేనేలేదు.. ఇక తూకాల్లో తేడాలు లేవు.. ఉన్నదల్లా ఒకటే ధర. అదీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర.. అధికారులు సూచించిన మేరకు రైతులు తాము పండించిన కందులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకుంటే చాలు. పంట అమ్మిన 48 గంటల్లో డబ్బు బ్యాంక్ ఖాతాల్లో పడిపోతుంది. ఇలా మర్రిపూడి మండలం చిమట గ్రామంలో పంటను అమ్మిన 45 మంది రైతులకు 55 లక్షలు జమయ్యాయి.
మర్రిపూడి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించడమే కాకుండా ఉత్పత్తులను ప్రభుత్వ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడంతోపాటు 48 గంటల వ్యవధిలో వాటి తాలూకు డబ్బు జమవుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కర్షకులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలో 45 కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మండలంలో మర్రిపూడి, చిమట సహకార కేంద్రాల ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాలతో జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ హరిక్రిష్ణ నిరంతర పర్యవేక్షణలో చిమట సొసైటీలో కొనుగోలు ప్రక్రియ ఊపందుకుంది.
చిమటలో అత్యధిక కొనుగోళ్లు
జిల్లాలో ఇప్పటివరకు 750 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు జరగగా, ఒక్క చిమట సొసైటీ పరిధిలో 200 మెట్రిక్ టన్నులకుపైగా కందులను కొన్నారు. మర్రిపూడి సొసైటీలో 100 మొట్రిక్ టన్నుల కందుల కొనుగోలు చేశారు. చిమట కందుల కొనుగోల పరిధిలో ఇప్పటి వరకు 45మంది రైతులకు రూ.55 లక్షల మేర నిధులు వారి ఖాతాలలో జమయ్యాయి. దీంతో మండలంలోని కేంద్రాలు కందుల కొనుగోలులో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచాయి. మండలంలో 5,880 హెక్టార్లలో 5,299 మెట్రిక్ టన్నుల కందుల పండించినట్లు ఏవో వెంకటేష్ తెలిపారు.
దళారుల బెడద తొలగిపోయింది
కొండూరి రజనీకాంత్, రైతు, జక్కరాజుపాలెం
గతంలో పండించిన పంటను అమ్ముకోవాలంటే తలప్రాణం తోకకు వచ్చేది. దళారులదే ఇష్టారాజ్యంగా ఉండేది. వారు ఇచ్చిన ధరకే అమ్ముకోవలసి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో దళారుల బాధ తప్పింది. సులభంగా పండించిన పంటను అమ్ముకోగలిగాం.
పారదర్శకంగా కందుల కొనుగోలు
మలసాని నాగేశ్వరరావు, రైతు, రామాయపాలెం
కందుల కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోంది. పంట వేసింది మొదలు కోత కోసే వరకు సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌లో రైతుల వివరాలను పొందుపరుస్తున్నారు. టోకెన్ విధానం ద్వారా పంటను కొనుగోలు చేస్తుండటంతో ఎలాంటి ఇబ్బంది లేదు. 50 క్వింటాళ్ల కందులను అమ్మా. అమ్మిన 48 గంటల్లో 3లక్షల 77వేల 500 రూపాయలు ఖాతాలో జమయ్యాయి.
సకాలంలో నిధులు జమకావడం సంతోషంగా ఉంది
కొత్తపల్లి ప్రసాదు, రైతు, జక్కరాజుపాలెం
25 క్వింటాళ్ల కందులను ఏకకాలంలో కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. మూడురోజుల్లోపే లక్షా 88వేల 750రూపాయల నగదు నా ఖాతాకు జమైంది. గతంలో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తే డబ్బు కోసం వాళ్ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వ చొరవతో ఎలాంటి జాప్యం లేకుండా నగదు జమ కావడంతో కుటుంబ అవసరాలకు ఉపయోగపడింది.