Share News

12న రామతీర్థం తిరునాళ్ల

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:22 PM

ప్రసిద్ధిగాంచిన రామతీర్థం గంగమ్మతల్లి తిరునాళ్లను చైత్రశుద్ధ పౌర్ణమి రోజైన ఈనెల 12వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించటానికి సన్నాహకాలు ప్రారంభమయ్యాయి.

12న రామతీర్థం తిరునాళ్ల
ప్రభ నిర్మాణానికి కొబ్బరికాయలు కొడుతున్న టీడీపీ నాయకులు

11న చీమకుర్తిలో మందిరాల సంబరాలు

ప్రారంభమైన ప్రభల నిర్మాణాలు

చీమకుర్తి, మార్చి 31(ఆంధ్రజ్యోతి) : ప్రసిద్ధిగాంచిన రామతీర్థం గంగమ్మతల్లి తిరునాళ్లను చైత్రశుద్ధ పౌర్ణమి రోజైన ఈనెల 12వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించటానికి సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. ముందురోజైన 11వ తేదీన చీమకుర్తిలో మందిరాల సంబరాలు నిర్వహించనున్నారు. ఐదురోజుల పాటు సంప్రదాయబద్ధంగా నిర్వహించే తిరునాళ్ల మహోత్సవంలో రామతీర్థం నిధిలో 12న ప్రధాన ఘట్టం జరుగుతుంది. ఉదయం నుంచే మొక్కుబడి పొంగళ్లు భక్తులు చెల్లిస్తారు. రాత్రివేళ భారీ విద్యుత్‌ప్రభలను ఏర్పాటుచేసి టీవీ, సినీ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరునాళ్లలో ఏర్పాటు చేసే విద్యుత్‌ ప్రభల నిర్మాణ పనులకు వివిధ పార్టీలకు చెందిన వారు ప్రారంభించారు. సోమవారం హరిహరక్షేత్రం సమీపంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ప్రభ నిర్మాణ పనులకు నాయకులు కొబ్బరికాయలు కొట్టి శ్రీకారం చుట్టారు. రామతీర్థం నిధిలో చీమకుర్తి నుంచి టీడీపీ, జనసేన, వైసీపీల నుంచి ఒక్కొక్కటి, అలాగే రాజుపాలెం, బూదవాడ, కంభంపాడు గ్రామాల నుంచి టీడీపీ ప్రభలు నిర్మించటానికి ఇప్పటి వరకు సన్నాహకాలు జరుగుతున్నాయి. మొత్తం మీద తిరునాళ్ల నాటికి పది వరకూ ప్రభలు ఏర్పాటుచేసే అవకాశం ఉంది. చీమకుర్తి పట్టణంలో కూడా మందిరాల ప్రభలను మందిరాల సంబరాల నాడు ఏర్పాటు చేయటానికి సంసిద్ధులవుతున్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:22 PM