చివరి తడి కోసం రైతుల పాట్లు
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:16 AM
సాగర్ జలాలు బంద్ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని మోదేపల్లి మేజరుకు వారాబందీ విధానంతో సరఫరా అవుతున్న సాగర్ జలాలు గతనెల 31న నిలిపివేశారు. అధికారులు ముందుగా ప్రకటించిన విధంగానే సాగర్ నీటిని నిలిపివేయడంతో వరి సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.

నిలిచిన సాగర్ జలాలు
కాలువల్లో అడుగంటిన నీరు
మరో వారం రోజుల్లో సరఫరా చేస్తేనే పంట చేతికొస్తుంది
ఆందోళనలో రైతులు
ముండ్లమూరు, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): సాగర్ జలాలు బంద్ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని మోదేపల్లి మేజరుకు వారాబందీ విధానంతో సరఫరా అవుతున్న సాగర్ జలాలు గతనెల 31న నిలిపివేశారు. అధికారులు ముందుగా ప్రకటించిన విధంగానే సాగర్ నీటిని నిలిపివేయడంతో వరి సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పంట చివరి దశంలో ఉంది. ఈదశలో నీటి తడి అవసరమని రైతులు పేర్కొంటున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి సాగర్ కాలువలో పూర్తిగా నీరు అడుగంటిపోయింది. మరో వారం రోజుల పాటు నీరు విడుదల చేస్తే పంట చేతికి వస్తుందని రైతులు ఎంతో ఆశతో ఉన్నారు. అయితే, 31వ తేదీకే కాలువలకు నీరు నిలిపివేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మోదేపల్లి మేజరు పరిధిలో ఆరు వందల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. ప్రస్తుతం పంట వెన్ను విరిసి ఉంది. ఈపరిస్థితుల్లో వరి పైరుకు నీరు ఎంతో అవసరం. లేకుంటే దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశాలు ఉండటంతో మేజరు పరిధిలోని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజులపాటు నీటిని విడుదలచేయాలని సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు. మేజరు పరిధిలోని వేముల, ఈదర, కొమ్మవరం, అయోధ్య నగర్, వేములబండ, ఉమా మహేశ్వర అగ్రహారం, పూరిమెట్లతో పాటు భీమవరం గ్రామాలకు చెందిన రైతులు వరి సాగు చేశారు. ఇప్పటికే రూ.25 వేల నుంచి రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. పంట చేతికి వస్తుందన్న సమయంలో నీటి ఎద్దడి ఏర్పడింది. వారాబందీ విధానం పెట్టినా చివరి భూములకు నీరందక అవస్థలు పడ్డారు. ఆఖరి తడి కోసం నీటిని విడుదలచేయాలని కోరుతున్నారు. లేకుంటే దిగుబడి గణనీయంగా తగ్గటమే కాక ప్రస్తుతం వెన్ను విరిసిన వరి పైరు అంతా తాలు గింజలుగా మారతాయని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.