Cultural Event : ఇలపై విరిసిన ఇంద్రధనస్సులు
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:27 AM
‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్) రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లోని 81 కేంద్రాల్లో జనవరి 3, 4, 5 తేదీల్లో ఘనంగా జరిగాయి.

ఉత్సాహంగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ముత్యాల ముగ్గుల పోటీలు
పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు, యువతులు, విద్యార్థినులు
ఏపీ, తమిళనాడు, కర్ణాటక విజేతలకు 11న విజయవాడలో ఫైనల్స్
తెలంగాణలో ఉమ్మడి జిల్లాల విజేతలకు 10న హైదరాబాద్‌లో...
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్) రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లోని 81 కేంద్రాల్లో జనవరి 3, 4, 5 తేదీల్లో ఘనంగా జరిగాయి. 12వేల మందికి పైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొని తమ రంగవల్లులతో సంక్రాంతి శోభను ఇనుమడింపజేశారు. ప్రతి కేంద్రంలో ప్రథమ బహుమతి రూ.6,000, ద్వితీయ బహుమతి రూ.4,000, తృతీయ బహుమతి రూ.3,000తో పాటు అనేక కన్సొలేషన్ బహుమతుల్ని మహిళలు గెల్చుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపికైన పదిమంది మహిళలకు ఈ నెల 10న హైదరాబాద్‌లో ఫైనల్ పోటీలు జరుగుతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని 13 పాత జిల్లాలు, తమిళనాడు, కర్ణాటకల నుంచి ఒక్కొక్కరు... మొత్తం 15 మందికి ఈ నెల 11న విజయవాడలో ఫైనల్స్ జరుగుతాయి. ఫైనలిస్టులకు రూ.1,70,000కు పైగా బహుమతులు, ఇంకా గిఫ్ట్ హ్యాంపర్లు లభిస్తాయి.
ఉత్సాహంగా ముగ్గుల పండుగ
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. పెద్దసంఖ్యలో మహిళలు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు తీర్చిదిద్దిన రంగవల్లులతో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు కేంద్రాల్లో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీల్లో అత్యధికంగా 717 మంది మహిళలు, యువతులు పాల్గొని పోటీలు పడి రంగవల్లులను తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలైన కర్నూలులో 373 మంది, చిత్తూరులో 312 మంది, విశాఖపట్నంలో 234, విజయనగరంలో 176, ఏలూరులో 115 మంది, శ్రీకాకుళంలో 109 మంది చొప్పున మహిళలు ఈ పోటీలకు హాజరయ్యారు. విజయవాడ ఎస్‌ఎ్‌సఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా నలుమూలల నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మిగిలిన జిల్లాలోనూ ముగ్గుల పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా పలుచోట్ల నిర్వహించిన గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, జానపద నృత్యాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాకినాడలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, మచిలీపట్నంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కర్నూలులో రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.