Share News

SIT Investigation: పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి కేసులో ‘సిట్‌’ దూకుడు

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:04 AM

పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతిపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీస్ బృందాలు త్వరలో కేసు వివరాలను వెలికితీసే అవకాశం ఉంది.

SIT Investigation: పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి కేసులో ‘సిట్‌’ దూకుడు

ఇన్‌చార్జిగా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌

కేసుపై సీఎం సమీక్ష... ఒకట్రెండు రోజుల్లో కొలిక్కి!

రాజమహేంద్రవరం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): తీవ్ర సంచలనం సృష్టించిన పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ కుమార్‌ అనుమానాస్పద మృతిపై సిట్‌ దర్యాప్తు వేగవంతమైంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ ఇన్‌చార్జిగా సిట్‌ దర్యాపు జరుగుతోంది. సీఎం చంద్రబాబు, పోలీసు ఉన్నతాధికారులు కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పాస్టర్‌ ప్రవీణ్‌ సొంత జిల్లా కడప అని ప్రచారం ఉంది. చాలా కాలంగా సికింద్రాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో ఉంటూ క్రైస్తవ ప్రచారకుడిగా పేరు గడించారు. ఈ నెల 26 నుంచి 3రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం మార్కొండపాడులో రక్షణ సువార్త మహాసభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగానే ఆయన బుల్లెట్‌పై హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. 24వ తేదీ అర్ధరాత్రి సమయంలో కొంతమూరు హైవే వద్ద ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయనకు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఇల్లు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే, అంతపెద్ద వ్యక్తి బుల్లెట్‌పై రావడం ఏంటనే ప్రశ్నలు వచ్చాయి. సంఘటన జరిగిన తీరునుబట్టి ఇది ముమ్మాటికీ హత్యేనని క్రైస్తవ సంఘాలు ఆరోపించడంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.


కాగా, పాస్టర్‌ మరణానికి దారి తీసిన కారణాలను వెలికితీసే పనిలో సిట్‌ బృందం నిమగ్నమైంది. ప్రత్యేక పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ముమ్మరం చేశారు. మంగళగిరిలోని పోలీసు కేంద్ర కార్యాలయం నుంచి ఇద్దరు ఫోరెన్సిక్‌ నిపుణులు శుక్రవారం ఘటనా స్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కేసు పరిశీలనకు మొత్తం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు రెండు పోలీసు బృందాలు, విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు మరో రెండు పోలీసు బృందాలు దారి పొడవునా సీసీ పుటేజ్‌ల ఆధారంగా విచారిస్తున్నారు. ఒక దర్యాప్తు బృందం ఇప్పటికే సికింద్రాబాద్‌లోని పాస్టర్‌ కుటుంబ సభ్యులను విచారించి వారి వాంగ్మూలం నమోదు చేసింది. ఒకటి రెండు రోజుల్లో కేసు కొలిక్కి రానున్నట్టు సమాచారం.


Also Read:

42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..

మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు

కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 29 , 2025 | 05:04 AM