Share News

Southwest Monsoon: ‘నైరుతి’లో సాధారణ వర్షపాతమే

ABN , Publish Date - Mar 22 , 2025 | 05:52 AM

దేశంలో ఏడాదిలో కురిసే మొత్తంవర్షపాతంలో 70శాతం ఈ సీజన్‌ (జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు) 4నెలల్లోనే కురుస్తోంది. అంతటి ప్రాధాన్యం కలిగిన నైరుతి సీజన్‌ ప్రస్తుత వాతావరణ పరిస్థి తుల నేపథ్యంలో ఈ ఏడాది ఎలా ఉంటుందోననే సమాచారం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Southwest Monsoon: ‘నైరుతి’లో సాధారణ వర్షపాతమే

వాతావరణ నిపుణుల అంచనా

రుతుపవనాలకు సానుకూల పరిస్థితులు

విశాఖపట్నం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేవి నైరుతి రుతుపవనాలే. దేశంలో ఏడాదిలో కురిసే మొత్తంవర్షపాతంలో 70శాతం ఈ సీజన్‌ (జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు) 4నెలల్లోనే కురుస్తోంది. అంతటి ప్రాధాన్యం కలిగిన నైరుతి సీజన్‌ ప్రస్తుత వాతావరణ పరిస్థి తుల నేపథ్యంలో ఈ ఏడాది ఎలా ఉంటుందోననే సమాచారం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. దీనిపై తాజాగా వాతావరణ నిపుణులు స్పష్టత ఇచ్చారు. నైరుతికి సానుకూల పరిస్థితులు ఏర్పడను న్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి సీజన్‌ తొలి అర్ధభాగంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నైరుతి సీజన్‌లో వర్షాలపై ప్రతి ఏడాదీ ఏప్రిల్‌లో భారత వాతావరణ శాఖ అధికారికంగా బులెటిన్‌ విడుదల చేస్తోంది. ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో సాధారణ వర్షాలు కురుస్తాయని, ఆగస్టు వరకూ ఆశాజనకంగా ఉండేందుకు అవకాశాలు కనిపిస్తు న్నాయని కొందరు నిపుణులు విశ్లేషించారు. ఇందుకు గల కారణాలను వారు విశ్లేషించారు.


పసిఫిక్‌పై వాతావరణం కీలకం

నైరుతి రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు కురవాలంటే పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు ప్రధాన భూమిక పోషిస్తాయి. గతేడాది డిసెంబరులో పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన బలహీనమైన లానినా ఈ నెలలో మరింత బలహీనపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఏప్రిల్‌ నాటికి తటస్థ పరిస్థితులు నెలకొనే అవకాశం 60శాతం ఉందని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు ఇప్పటికే వెల్లడించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. తరువాత నైరుతి రుతుపవనాలు ప్రవేశించే సమయానికి బలహీనమైన ఎల్‌నినో వస్తుందని అంచనా వేశారు. ఆగస్టుకల్లా ఎల్‌నినో కొంచెం బలపడుతుందని, అయితే అది కొంతకాలమే ఉండి నవంబరు, డిసెంబరుకల్లా లానినా తిరిగి బలపడుతుందని అమెరికాకు చెందిన వాతావరణ అంచనా విభాగం (క్లైమేట్‌ ప్రిడిక్షన్‌ సెంటర్‌) అంచనా వేసింది. పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు లానినా ఉన్నప్పుడు సగటు కంటే చల్లగా, ఎల్‌నినో కొనసాగితే వేడిగా ఉంటాయి. అదే తటస్థ పరిస్థితులు ఉన్నప్పుడు సాధారణంగా ఉంటాయి. వచ్చేనెల నుంచి పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదయ్యే అవకాశం ఉందని, నైరుతి ప్రవేశించే సమయానికి కొంచెం వేడెక్కుతాయని చెబుతున్నారు. పసిఫిక్‌ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం మీదుగా చల్లని గాలులు భారత్‌లోకి ప్రవేశించడంతో నైరుతి సీజన్‌లో వర్షాలు కురుస్తాయి. మంచి వర్షాలకు హిందూ మహాసముద్రంలో ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ పాజిటివ్‌గా ఉండాలి. ప్రస్తుతం ఐవోడీ పాజిటివ్‌గా ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జూన్‌ నుంచి ఆగస్టు వరకు సాధారణ వర్షాలే కురుస్తాయని అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 05:52 AM