Share News

business: జోరుగా వ్యాపారాలు

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:45 AM

business: ఉగాది వేళ జిల్లాలో వివిధ వ్యాపారాలు జోరుగా సాగాయి. ఉగాది రోజున కొత్తవస్తువు కొనుగోలు చేస్తే మంచిదని ప్రజల నమ్మకం.

 business: జోరుగా వ్యాపారాలు
కిటకిటలాడుతున్న శ్రీకాకుళంలోని ఓ బంగారు దుకాణం

- కొనుగోలుదారులతో కిటకిటలాడిన బంగారు, వెండి దుకాణాలు

-ఎలక్ర్టానిక్‌, గృహోపకరణాల షాపులు కూడా..

- ఒక్కరోజే రూ.100కోట్ల వ్యాపారం

శ్రీకాకుళం/నరసన్నపేట, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఉగాది వేళ జిల్లాలో వివిధ వ్యాపారాలు జోరుగా సాగాయి. ఉగాది రోజున కొత్తవస్తువు కొనుగోలు చేస్తే మంచిదని ప్రజల నమ్మకం. దీంతో ఆదివారం బంగారం, వెండి, వస్త్ర, సెల్‌, ఎలక్ర్టానిక్‌, గృహోపకరణాలు తదితర సామగ్రి కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడంతో దుకాణాలు కిటకిటలాడాయి. జిల్లాలో ఒక్క ఆదివారం రూ.100 కోట్లకు పైగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వ్యాపారాలు సాగాయని రాష్ట్ర జీఎస్టీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో సగభాగం బంగారం, వెండి వ్యాపారానిదే అని చెబుతున్నారు. జిల్లాలో 600కు పైగా బంగారు, వెండి దుకాణాలు ఉన్నాయి. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, కాశీబుగ్గ సోంపేట, ఆమదాలవలస, రణస్థలం, పలాస, పాతపట్నం, హిరమండలాల్లో బంగారం, గృహాపకరణాల విక్రయాలు జోరుగా సాగాయి. సెల్‌ఫోన్లు, కొత్తవాహనాలు కూడా కొనుగోలు చేశారు. గతేడాది ఉగాదికి తులం బంగారం రూ.85వేలు ఉండగా, ఈ ఏడాది రూ.లక్షా7వేలకు చేరుకుంది. 22 క్యారెక్టు బంగారం రూ.97వేలు పలికింది. బంగారం ఆల్‌ టైం రికార్డు సృష్టించినా.. కొనుగోలు దారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. వెండి కొనుగోలు కూడా బాగా జరిగాయి. కిలో వెండి రూ.లక్షా 5 వేలకు చేరింది. కొన్నిచోట్ల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి సిల్వర్‌ క్వాయిన్లు ఇస్తామని, మరికొన్ని చోట్ల ఆభరణాలపై తరుగు శాతాన్ని తగ్గిస్తామని, గృహాపకరణాలకు లక్కీకూపన్లతో బహుమతులు ఇస్తామని వ్యాపారులు ఆఫర్లు ప్రకటించారు. దీంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు.

Updated Date - Mar 31 , 2025 | 12:45 AM