Share News

coconut: సంక్షోభంలో కొబ్బరిపీచు పరిశ్రమ

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:27 AM

Coconut Oil Industry కంచిలి కొబ్బరి పీచు పరిశ్రమ తీవ్ర సంక్షోభవంలో కూరుకుపోయింది. పంట దిగుబడి తగ్గడం, ముడి సరుకు ధరలు పెరగడం, నిర్వహణ భారం ఎక్కువకావడం, ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోవడం తదితర కారణాలతో కొబ్బరి పీచు పరిశ్రమ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమలు ఒక్కొక్కటీ మూతపడుతున్నాయి.

coconut: సంక్షోభంలో కొబ్బరిపీచు పరిశ్రమ
కంచిలిలో చెత్త కొనుగోలు కేంద్రంగా మారిన కొబ్బరి పరిశ్రమ భవనం

  • కంచిలిలో మూతపడుతున్న ఫ్యాక్టరీలు

  • నిర్వహణ భారం, నష్టాలే కారణం

  • గోడౌన్‌లుగా మారుతున్న భవనాలు

  • కార్మికులకు కరువైన ఉపాధి

  • ఇతర రాష్ట్రాలకు వలస బాట

  • ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే మనుగడ

  • కొబ్బరి పీచు పరిశ్రమ అనగానే ఒకప్పుడు ఠక్కున గుర్తుకొచ్చే ప్రాంతం కంచిలి. ఇక్కడి మార్కెట్‌తో పాటు పీచు పరిశ్రమలకు స్థానికంగానే కాకుండా రాష్ట్ర, దేశస్థాయిలో ఎంతో గుర్తింపు ఉండేది. వందలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారు. నిత్యం ఈ ప్రాంతం కళకళలాడేది. ఇదంతా గతం. ప్రస్తుతం కొబ్బరి పీచు పరిశ్రమ దీనస్థితికి చేరింది. చీడ పీడలు, తెగుళ్ల కారణంగా కొబ్బరి కాయల్లో నాణ్యత లోపించింది. కొనేవారు లేకపోవడంతో ఆ ప్రభావం కంచిలి మార్కెట్‌, పీచు పరిశ్రమలపై తీవ్రంగా పడింది. పీచు పరిశ్రమలు మూతపడ్డాయి. గతంలో 14 పరిశ్రమలు ఉండగా.. ఇప్పుడు 4 మాత్రమే మిగిలాయి. ఇక్కడ పని చేసే కార్మికులు వలస బాటపట్టారు. ప్రభుత్వం విద్యుత్‌ రాయితీ, సబ్సిడీపై రుణాలు అందిస్తే కొబ్బరి పీచు పరిశ్రమకు పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది.

  • .........................

  • కంచిలి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): కంచిలి కొబ్బరి పీచు పరిశ్రమ తీవ్ర సంక్షోభవంలో కూరుకుపోయింది. పంట దిగుబడి తగ్గడం, ముడి సరుకు ధరలు పెరగడం, నిర్వహణ భారం ఎక్కువకావడం, ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోవడం తదితర కారణాలతో కొబ్బరి పీచు పరిశ్రమ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమలు ఒక్కొక్కటీ మూతపడుతున్నాయి. నాలుగు దశాబ్దాల కిందట కంచిలితో పాటు పరిసర గ్రామాల్లో సుమారు 14 కొబ్బరి పీచు పరిశ్రమలు ఉండేవి. ఈ పరిశ్రమల్లో ఆయా గ్రామాలకు చెందిన వందలాది మహిళలు, యువకులు పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. కంచిలిలో తయారయ్యే పీచుకు మంచి గిరాకీ ఉండేది. నాణ్యమైన కొబ్బరి పీచును తయారు చేసి దేశంలోని గుజరాత్‌, కేరళ, తమిళనాడు, అహ్మదాబాద్‌ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. దీంతో కార్మికులతో ఈ ప్రాంతం నిత్యం కళకళలాడేది. కాలక్రమంలో ఉద్దానంలో ప్రకృతి విలయాలకు కొబ్బరి పంట పూర్తిగా నాశనం కావడడం, చీడ పీడలు, తెగుళ్లతో కాయల నాణ్యత, దిగుబడి తగ్గడంతో ఆ ప్రభావం ప్రత్యక్షంగా కొబ్బరి మార్కెట్‌పై, పరోక్షంగా పీచు పరిశ్రమలపై పడింది. మొదట్లో వాటిని ఎలాగో యజమానులు నెట్టుకొచ్చారు. రానురాను నష్టాలు ఎక్కువ కావడంతో భరించలేక పరిశ్రమలను మూసివేశారు. ప్రస్తుతం కేవలం 4 మాత్రమే నడుస్తున్నాయి. ప్రభుత్వాల నుంచి చేయూత లేక, పెరుగుతున్న నిర్వహణ వ్యయాన్ని భరించలేక, యంత్రాల మరమ్మతులకు గురికావడం, అప్పుల పాలవ్వడం వంటి కారణాలతో పరిశ్రమలను మూసివేసినట్లు పలువురు యజమానులు చెబుతున్నారు. గతంలో కొబ్బరి పీచు పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు అమలాపురం వంటి ప్రాంతాల్లో ఉచితంగా, లేదా తక్కువ ధరకే లభించేది. ప్రస్తుతం ముడి సరుకును అధిక ధరకు కొనుగోలు చేయాల్సి రావడం కూడా పీచు పరిశ్రమ దివాలాకు కారణమైందని యజమానులు వాపోతున్నారు.

  • కార్మికులు వలస..

  • కంచిలి మండలంలోని ఎస్‌ఆర్‌సీ పురం, అంపురం, బురదపాడు, పద్మతుల, గొల్లకంచిలి తదితర గ్రామాల్లో కొబ్బరి కార్మికులు ఉన్నారు. గతంలో స్థానికంగా నిర్వహిస్తున్న కొబ్బరి బడ్డీలు, కొబ్బరి పీచు పరిశ్రమల్లో పనులు చేసుకుంటూ వీరంతా జీవనం సాగించేవారు. ప్రస్తుతం కొబ్బరి పీచు పరిశ్రమలు మూతపడడంతో వాటి భవనాల్లో చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని భవనాలు చెత్తను విక్రయించే షాపులుగా, గౌడౌన్‌లుగా మారాయి. అలాగే, మార్కెట్‌ కూడా పూర్తిగా దెబ్బతింది. కార్మికులు స్థానికంగా పనులు లభించక వలస పోతున్నారు. గతంలో ఇక్కడ తయారు చేసిన పీచును ఏ రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారో, ఇప్పుడు అదే రాష్ర్టాలకు వలస కూలీలుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • ఎస్‌ఆర్‌పీపురం గ్రామానికి చెందిన పాలిన భీమారావు, పాలిన దివాకర్‌, అంపురం గ్రామానికి చెందిన మల్లార్పు సోమయ్య, పద్మతుల గ్రామానికి చెందిన మునకాల పురుషోత్తం తదితరులు గుజరాజ్‌, అహ్మదాబాద్‌ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లారు. వీరంతా ఎటువంటి భద్రతలేని పనుల్లో ఉంటూ కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్నారు. వీరితో ‘ఆంధ్రజ్యోతి’ మాట్లాడగా... పీచు పరిశ్రమలు, కొబ్బరి బడ్డీలు మూత పడటంతో గత్యంతరం లేక కుటుంబ పోషణ కోసం వలస వచ్చినట్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఇళ్ల వద్ద భార్యాపిల్లలతోపాటు వృద్ధులైన తల్లిదండ్రులను వదిలి ఇలా బతుకీడ్చుతున్నామని వాపోతున్నారు. స్థానికంగా పనులు కల్పిస్తే తమ వెతలు తీరుతాయని చెబుతున్నారు.

  • అనుబంధ సంస్థలను ప్రోత్సహించాలి..

  • కొబ్బరి కార్మికుల వలసలు నివారించాలంటే మొదటగా ఉద్దానం కొబ్బరి పంట అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సర్వత్రా కోరుతున్నారు. ప్రకృతి విలయాలు, చీడ పీడలు, తెగుళ్ల బారిన పడిన కొబ్బరి పంటకు జవసత్వాలు నింపేలా చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా రైతులను చైతన్యపరిచి, వారికి సబ్సిడీపై విత్తనాలు, ఇతర ప్రోత్సహాకాలను అందించాల్సిన అవసరం ఉంది. అలాగే, గిడ్డంగుల సదుపాయం, మార్కెట్‌ ధరలకు విక్రయించేలా పట్టిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి రైతులకు సంబంధించి అనుబంధ పరిశ్రమల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కొబ్బరి దిగుబడులు పెంచడం ద్వారా రైతులకు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో కూలీలకు ఉపాధి లభిస్తుంది. దీంతో ఈ ప్రాంతం నుంచి వలసలు నివారించవచ్చనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొబ్బరి అనుబంధ పరిశ్రమలకు విద్యుత్‌ రాయితీలు కల్పించడం, సబ్సిడీపై రుణాలు మంజూరు చేయడం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడితే ఉపాధి అవకాశాలు పెంచవచ్చు.

  • చేయూత అందించాలి

  • నిర్వహణ ఖర్చులు పెరగడం, ముడి సరుకుల స్థానికంగా లభించకపోవడంతో పీచు పరిశ్రమ నిర్వహించడం చాలా కష్టంగా ఉంది. పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వం చేయూత అందించాలి. సబ్సిడీపై రుణాలు అందించడం, రాయితీపై యంత్రాలు మంజూరు చేయడం చేస్తే పరిశ్రమ అభివృద్ధి చెందడమే కాకుండా పది మందికి ఉపాధి లభిస్తుంది.

    - పండి రవి, పీచు పరిశ్రమ నిర్వాహకుడు


coconut-1.gif

Updated Date - Mar 30 , 2025 | 12:27 AM