Kidney : అలా నిర్మించి.. వదిలేశారు
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:05 AM
Kidney Research Center Unfinished ఉద్దానంలో వేలాది మంది కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ చేయించుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. ఇక్కడ కిడ్నీ రోగాల వ్యాప్తికి గల కారణాలు పూర్తిస్థాయిలో కనుగొనలేదు. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కిడ్నీ రోగులను ఉద్దరిస్తున్నట్లు.. మూలకారణాలను అన్వేషించేలా పరిశోధనలు చేపడతామని, వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకున్నట్లు అప్పటి కీలక నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కాగా.. క్షేత్రస్థాయిలో ‘కిడ్నీ రీసెర్చ్ సెంటర్’ భవనం మాత్రమే నిర్మించి వదిలేశారు.

వైసీపీ హయాంలో రీసెర్చ్ సెంటరంటూ ప్రగల్భాలు
అప్పుడు నిర్మించింది భవనం మాత్రమే..
ఇప్పటికీ అరకొర సిబ్బంది.. కీలక పోస్టులన్నీ ఖాళీ
2014-19 మధ్య ఇచ్చిన డయాలసిస్ యంత్రాలే ఇప్పటికీ
కూటమి ప్రభుత్వం వచ్చాక మెరుగవుతున్న సేవలు
స్వచ్ఛంద సంస్థ సహకారంతో అంబులెన్స్ ఏర్పాటు
శ్రీకాకుళం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో వేలాది మంది కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ చేయించుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. ఇక్కడ కిడ్నీ రోగాల వ్యాప్తికి గల కారణాలు పూర్తిస్థాయిలో కనుగొనలేదు. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కిడ్నీ రోగులను ఉద్దరిస్తున్నట్లు.. మూలకారణాలను అన్వేషించేలా పరిశోధనలు చేపడతామని, వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకున్నట్లు అప్పటి కీలక నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కాగా.. క్షేత్రస్థాయిలో ‘కిడ్నీ రీసెర్చ్ సెంటర్’ భవనం మాత్రమే నిర్మించి వదిలేశారు. కీలక పోస్టులు భర్తీ చేయక.. పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.
టీడీపీ హయాంలో మంజూరైనవే..
ఉద్దానం ప్రాంతం నుంచి గతంలో డయాలసిస్ కోసం కిడ్నీ రోగులు.. శ్రీకాకుళం లేదా విశాఖపట్నం వెళ్లేవారు. రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ఉద్దానం కిడ్నీ రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని 2014-19 మధ్యకాలంలో జనసేనాని పవన్‌కల్యాణ్.. ఈ ప్రాంతం వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే స్పందించి ఉద్దానంలో కిడ్నీ రోగులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డయాలసిస్ యూనిట్లను పెంచారు. పలాసలో ఇప్పటికీ ఆ డయాలసిస్ యూనిట్లే నిర్వహిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కిడ్నీరీసెర్చ్ అంటూ పలాసలో భవనం నిర్మించింది. కానీ, రోగులకు అనుగుణంగా డయాలసిస్ సెంటర్లను సైతం పెంచలేదు. పూర్తిస్థాయిలో సిబ్బంది కూడా లేరు. గత సీఎం జగన్మోహన్‌రెడ్డి స్వయంగా పలాసకు వచ్చి గొప్పగొప్ప ప్రకటనలు చేసేశారు. కానీ రీసెర్చ్‌కు అవసరమైన సిబ్బందిని.. పరికరాలను కూడా పూర్తిస్థాయిలో సమకూర్చలేదు. దీంతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్... డయాలసిస్ కేంద్రంగానే నడుస్తోంది. ఇటీవల ‘గ్లో’ సంస్థ కిడ్నీ రీసెర్చ్‌సెంటర్‌కు వెళ్లే రోగులకు అవసరార్థం అంబులెన్స్‌ను సమకూర్చింది. సేవలు మెరుగుపరిచేలా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
కీలకపోస్టులు, సిబ్బంది ఖాళీ
పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రంలో కీలక పోస్టుల్లో ఉండాల్సిన అధికారులు, వైద్యులు.. అత్యధికంగా ఖాళీగానే ఉన్నాయి. ఆస్పత్రి ఉద్యోగుల విధులు.. ఇతరత్రా పనులకు సంబంధించి కీలకమైన పరిపాలన అధికారి(ఏఓ) పోస్టు కూడా ఖాళీ. నెఫ్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు రెండు, వస్కులర్ సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు, జనరల్ సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు రెండు, జనరల్ మెడిసన్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులు నాలుగు ఖాళీగా ఉన్నాయి. యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు రెండు ఉండాల్సి ఉండగా.. ఒకరు మాత్రమే ఉన్నారు. అనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్లు నలుగురికిగానూ ఉన్నది కేవలం ఒక్కరే. రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, పాథాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, మైక్రోబయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, బయోకెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్, న్యూట్రిషనిస్ట్ లేరు. జనరల్ కాజువల్ మెడికల్ ఆఫీసర్లు 12 మందిని భర్తీ చేయాల్సి ఉంది. రీసెర్చ్ ల్యాబ్‌లో రెండు ప్రాజెక్టు మేనేజర్ పోస్టులు ఖాళీ. రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు రెండు ఖాళీ. అలాగే ఇద్దరేసి సీనియర్ రీసెర్చ్, జూనియర్ రీసెర్చ్‌లు ఖాళీ. డయాలసిస్ టెక్నీషియన్లు పది మందికిగానూ నలుగురు మాత్రమే ఉన్నారు. మొత్తం అన్ని విభాగాలు కలిపి.. 206 మంది ఉండాల్సి ఉండగా.. 129 మంది ఉన్నారు. 77 పోస్టులు ఖాళీ. రెగ్యులర్‌గా ఉండాల్సిన 27మంది వైద్యులు, కాంట్రాక్టు పద్ధతిలో ఉండాల్సిన 22 మంది వైద్యులు ఇప్పటికీ లేకపోవడం వల్ల కిడ్నీ రోగులకు ఏ విధమైన సేవలు లభిస్తాయి.. ఇక్కడ పరిశోధనలు ఎలా జరుగుతాయన్నదీ ప్రశ్నార్థకమవుతోంది. ఇక్కడ పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి(రిమ్స్-జీజీహెచ్) వెళ్లాల్సి వస్తోందని కిడ్నీ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు దృష్టిసారించి కిడ్నీ పరిశోధన కేంద్రానికి అవసరమైన సిబ్బందిని నియమించి.. సేవలు మెరుగుపరచాలని కోరుతున్నారు.
సేవలు మెరుగుపడుతున్నాయి
గత ప్రభుత్వంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని చెప్పుకున్నా.. డయాలసిస్ కేంద్రంగానే సేవలు అందేవి. అవసరమైన సిబ్బంది, పరికరాలు లేకపోవడం వాస్తవమే. పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు తెలియజేశాం. మంత్రి నారా లోకేశ్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లాం. ఇప్పుడిప్పుడే సేవలు మెరుగుపడుతున్నాయి. ప్రభుత్వ సహకారంతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఆశించినస్థాయిలో పని చేసేలా చర్యలు చేపడుతున్నాం.
- గౌతు శిరీష, ఎమ్మెల్యే, పలాస