Share News

Private Travels: ఇదోరకం దందా!

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:08 AM

Private Travels:జిల్లాలో కొన్ని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిబంధనలు పాటించడం లేదు. చాలా ట్రావెల్స్‌ స్టేజ్‌ క్యారీయర్‌ అనుమతులు తీసుకొని టిక్కెట్‌ సర్వీసులు చేస్తున్నాయి.

 Private Travels: ఇదోరకం దందా!
ప్రైవేట్‌ ట్రావెల్స్‌

- ప్రయాణికుల మాటున సరుకుల రవాణా

-కొన్నిసార్లు గంజాయి, బంగారం కూడా..!

- స్టేజ్‌ క్యారియర్‌ పేరుతో టికెట్‌ సర్వీసులు

- ప్రభుత్వానికి భారీగా పన్నుల ఎగవేత

నరసన్నపేట, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో కొన్ని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిబంధనలు పాటించడం లేదు. చాలా ట్రావెల్స్‌ స్టేజ్‌ క్యారీయర్‌ అనుమతులు తీసుకొని టిక్కెట్‌ సర్వీసులు చేస్తున్నాయి. ఇంకొన్ని ట్రావెల్స్‌ ప్యాసింజర్ల పేరిట సరుకులను రవాణా చేస్తున్నాయి. బస్సుల టాప్‌ మీద పరిమితికి మించి లగేజీ వేస్తున్నాయి. పన్ను చెల్లించకుండా చాలా సర్వీసులు తిరుగుతున్నాయి. ఒకే నెంబరు మీద రెండు బస్సులు నడుస్తున్నాయి. ఎటువంటి బిల్లులు లేకుండా బంగారం, జీడిపప్పు, ప్లంబింగ్‌, ప్లైవుడ్‌, స్టీల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఆటోమొబైల్స్‌, రంగులు తదితర వస్తువులకు ఎగుమితి, దిగుమతి చేస్తున్నాయి. టిక్కెట్‌ రేట్లు కూడా ఆర్టీసీ కంటే అధికంగా ఉంటున్నాయి. సాధారణ సర్వీసులకూ ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దందాపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

- ఈ ఏడాది ఫిబ్రవరిలో నరసన్నపేట మండలం మడపాం వద్ద టాస్క్‌ఫోర్సు సిబ్బంది ప్రయాణికుల వాహనాలను తనిఖీ చేశారు. ఈ సోదాల్లో ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు.

- 2022 మార్చి 31న నరసన్నపేట, శ్రీకాకుళం నగరాలకు చెందిన కొంతమంది వ్యాపారులు అందజేసిన రూ.4.75 కోట్లు, కొంత బంగారం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద పోలీసులకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో పట్టుబడింది. అదే రోజు విజయవాడ నుంచి నరసన్నపేట వస్తున్న మరోక ట్రావెల్స్‌లో అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

- నాలుగేళ్ల కిందట నరసన్నపేటలోని పైడితల్లమ్మ ఆలయం వద్ద ఒక ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుకు రూ.కోటికిపైగా అందించే సమయంలో.. కోటబొమ్మాళి మండలానికి చెందిన ఒక ముఠా ఆ నగదును కాజేసింది. దీనిపై అప్పట్లో నరసన్నపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.


శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, పాతపట్నం, కొత్తూరు నుంచి వందలాది ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంటాయి. ఇవి విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరు వరకు వెళ్తుంటాయి. అదే విధంగా ఇచ్ఛాపురం, కవిటి, మందస, పలాస, పాతపట్నం, హడ్డుబంగి తదితర ప్రాంతాల నుంచి విశాఖపట్నంకు నిత్యం పదుల సంఖ్యలో ట్రావెల్స్‌ స్టేజ్‌ క్యారీయర్‌తో రాకపోకలు సాగిస్తుంటాయి. భువనేశ్వర్‌ వరకు మరో ఏడు ట్రావెల్స్‌ వెళ్తుంటాయి. వీటిలో కొన్ని ట్రావెల్స్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. నిబంధనల మేరకు ట్రావెల్స్‌లో ప్యాసింజర్‌కు చెందిన లగేజీ మాత్రమే అనుమతించాలి. అలా కాకుండా టాప్‌ మీద పరిమితికి మించి లగేజీ వేస్తున్నారు. ఏసీ బస్సుల్లో ఇంజిన్‌కు సమీపంలో ఎటువంటి లగేజీ ఉంచరాదు. కానీ, ఎక్కువ ట్రావెల్స్‌లో కింద భాగంలో లగేజీ బాక్సులు ఉంటున్నాయి. ప్యాసింజర్లు ఏ స్టేజీ నుంచి ఎక్కడ వరకు ప్రయాణం చేస్తారో ముందుగానే సంబంధిత పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఫోన్‌నెంబరు తప్పనిసరిగా తీసుకోవాలి. కాని కొన్ని ట్రావెల్స్‌ అసలైన ప్యాసింజర్ల సమాచారంతో కాకుండా తమ దగ్గర ఉన్న ప్రయాణికుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి టిక్కెట్‌ సర్వీసు నడుపుకొంటున్నారు. మరికొందరు ట్రావెల్స్‌ యజమానులు ప్యాసింజర్లను మాత్రమే రవాణా చేస్తున్నట్లు అధికారుల నుంచి అనుమతి తీసుకుని సరుకులను కూడా తీసుకెళ్తున్నారు. బస్సులో ఉన్న సీట్ల మేరకే వారు పన్ను చెల్లిస్తున్నారు. కార్గోకు ఎటువంటి పన్ను చెల్లించడం లేదు. ముఖ్యంగా ఇచ్ఛాపురం, కవిటి, మందస, పాతపట్నం నుంచి విశాఖపట్నం నడిచే కొన్ని ప్రైవేటు బస్సులు స్టేజ్‌ క్యారీయర్‌ అనుమతులు తీసుకొని పలాస, సోంపేట, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, రణస్థలం మీదుగా విశాఖపట్నం వరకు టిక్కెట్‌ సర్వీసు చేస్తున్నాయి. ఇలా రోజూ 30 పైగా సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో కొన్ని సర్వీసులను పన్ను చెల్లించకుండా రోడ్డు మీద తిప్పుతున్నారు. ఒకే సర్వీసుకు పన్ను చెల్లించి.. ఒకే నెంబరు మీద రెండు బస్సులు కూడా తిప్పుతూ పన్నులకు ఎగనామం పెడుతున్నారు.


అక్రమ వ్యాపారం సాగుతుంది ఇలా..

- ఒడిశా నుంచి గంజాయిని అందంగా ప్యాకింగ్‌ చేసి పాతపట్నం, పలాస, భువనేశ్వర్‌ నుంచి నడిచే ట్రావెల్స్‌ ద్వారా కొందరు అక్రమంగా రవాణా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

- పలాస నుంచి వచ్చే ట్రావెల్స్‌ ద్వారా తెల్లబంగారంగా పిలబడే జీడిపప్పును డబ్బాల్లో ప్యాకింగ్‌ చేసి విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.

- నరసన్నపేటకు చెందిన కొందరు వ్యాపారులు బంగారాన్ని అట్టబాక్సులు, సంచుల్లో ప్యాకింగ్‌ చేసి ట్రావెల్స్‌లో విజయవాడకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు వ్యాపారులు నగదును కూడా ప్యాకింగ్‌ చేసి విజయవాడలో ఉన్న వ్యాపారులకు పంపిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ట్రావెల్స్‌ బస్సులపై నిఘా పెరగడంతో వ్యాపారులు రూట్‌ మార్చారు. నరసన్నపేట పట్టణం మీదుగా వచ్చే ట్రావెల్స్‌ను కాకుండా జాతీయ రహదారిపై వెళ్లే బస్సుల ద్వారా సాగిస్తున్నారు.

- విజయవాడ నుంచి ప్రతిరోజూ శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస, పాతపట్నంకు 30 వరకు ప్రైవేటు ట్రావెల్స్‌ నడుస్తున్నాయి. వీటిలో మోటారు ఇంజిన్ల విడిభాగాలు, ఆటోమొబైల్స్‌ విడిభాగాలు, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ సామగ్రితో పాటు ఇంటీరియల్‌, ప్లైవుడ్‌ మెటీరియల్‌, రంగులను భారీ స్థాయిలో దిగుమతి అవుతున్నాయి. ఒక్కొక్క ట్రావెల్‌ బస్సు టాప్‌ మీద సుమారు 10టన్నుల వరకు వివిధవస్తువులను ఎక్కించి జిల్లాకు చేర్చుతున్నారు. సీట్లు, బస్సు కింద భాగాల్లో కూడా మరికొన్ని వస్తువులను ఉంచి జిల్లాకు తీసుకొస్తున్నారు.

- రోజుకు సుమారు రూ.50లక్షల విలువ చేసే ఆటోమొబైల్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ వస్తువులు దిగుమతి అవుతున్నాయి.

- శ్రీకాకుళం ఆర్టీసీ డిపో వెనుక భాగంలోని ట్రావెల్స్‌ కార్యాలయాల వద్ద ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు లగేజీ దించేందుకు బస్సులు క్యూ కడతాయి. నరసన్నపేట ఆంజనేయస్వామి విగ్రహం వద్ద, కాశీబుగ్గలో పాతబస్టాండ్‌ వద్ద ట్రావెల్స్‌ నుంచి లగేజీలను భారీగా దించుతారు.

- కొందరు బంగారం వ్యాపారులు వినియోగదారుల నుంచి కొనుగోలు చేసిన పాతబంగారాన్ని యాసిడ్‌లో కరిగించి మేలిమి బంగారం అనిపించే విధంగా అచ్చులు పోస్తారు. వాటిని కోయంబత్తూరు, ముంబాయిలోని ఆభరణాలు తయారు చేసే కేంద్రాలకు తరలిస్తారు. ఈ బంగారాన్ని ఎగుమతి చేసేందుకు భువనేశ్వర్‌, పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం నుంచి బయల్దేరే ప్రైవేటు ట్రావెల్స్‌ను ఉపయోగిస్తున్నారు.

- మరికొందరు వ్యాపారులు నగదును బాక్సులో ప్యాకింగ్‌ చేసి వాటి పైభాగంలో ఎవరికీ అనుమానం రాకుండా చిరుతిండ్లు పెడుతున్నారు. ఈ బాక్సులను సొంత కార్లలో కాకుండా అద్దె కార్లలో తరలిస్తున్నారు. అటు నుంచి ఇదే మాదిరిగా బంగారం ఆభరణాలను అవతల పార్టీ వీరికి అందజేస్తుంది. ఇదంతా సినిమాల్లో చూపించేవిధంగా హవాలా మార్గంలో జరుగుతుంది. ఈ అక్రమ దందాపై రవాణా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడా ట్రావెల్స్‌ను తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఒక అధికారి నిరాకరించారు.

Updated Date - Apr 13 , 2025 | 01:08 AM