Sunil Yadav: బతుకుతానో లేదో!
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:25 AM
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో ముడిపడిన వ్యక్తుల వరుస మరణాల నేపథ్యంలో... మరో నిందితుడు తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో రెండో నిందితుడు (ఏ2)గా ఉన్న సునీల్ యాదవ్ బుధవారం కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ను కలిశారు.

వైసీపీ నుంచి ప్రాణ హాని ఉంది..
జైల్లో తోటి నిందితులే భయపెట్టారు!
వివేకా హత్య కేసులో ఏ2 సునీల్ ఆందోళన
కడప ఎస్పీకి లిఖితపూర్వక ఫిర్యాదు
‘హత్య’ సినిమా నిలిపివేయాలని డిమాండ్
కడప క్రైం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో ముడిపడిన వ్యక్తుల వరుస మరణాల నేపథ్యంలో... మరో నిందితుడు తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో రెండో నిందితుడు (ఏ2)గా ఉన్న సునీల్ యాదవ్ బుధవారం కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ను కలిశారు. తనకు రక్షణ కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తననూ చంపేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో 39 నెలలు ఉన్న సమయంలో తనను కొందరు బెదిరించారని తెలిపారు. ఇదే కేసులో జైల్లో ఉన్న వారు, అప్పటి అధికార పార్టీ వారు, వారి అనుచరులు బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. ‘‘39 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాక కూడా నరకం అనుభవిస్తున్నాను. జైల్లో పడ్డ ఇబ్బందులపై ఇంతవరకు ఎక్కడా నోరు విప్పలేదు. ఇప్పుడు మాట్లాడుతుంటే కొందరికి నచ్చడం లేదు. గత ప్రభుత్వం వల్లే ఇబ్బందులు పడుతున్నాను. ఆ పార్టీకి (వైసీపీ) చెందిన వారి నుంచే నాకు ప్రాణహాని ఉంది.
వారి పేర్లు కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారు’’ అని సునీల్ యాదవ్ తెలిపారు. రెండ్రోజుల క్రితం తన ఇంటి వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్న వారు తమను ఇబ్బందికి గురిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘వారి వద్ద డబ్బు, హోదా ఇప్పుడు ఉంటాయేమో! రేపు ఉండవు కదా! అలాగే నేను బతుకుతానో లేదో కూడా తెలియదు’ అని వ్యాఖ్యానించారు. దస్తగిరి విషయం మాట్లాడదలచుకోలేదన్నారు. తన పైన, నా తల్లిపైన ఆరోపణలు చేస్తూ, వక్రీకరణలతో తీసిన ‘హత్య’ సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దానిని గతంలో అధికారంలో ఉన్న పార్టీ నిర్మించిందన్నారు. ‘‘వివేకా హత్యలో 8 మందిపై కేసు నమోదైంది. కానీ నలుగురే హత్య చేసినట్లు సినిమాలో చూపించారు. నా గురించి సినిమాలు చేసుకోవచ్చు.. రాసుకోవచ్చు. కానీ నా తల్లినీ ఇందులోకి లాగారు. వాళ్ల తల్లులపై కూడా ఇలాగే వస్తే.. వారు, వారి భార్యలు, వారింట్లో ఆడవారు బయట ఎలా తిరగగలుగుతారు’’ అని నిలదీశారు.