Suresh Productions: రామానాయుడు స్టూడియోలో 15.17 ఎకరాలు వెనక్కి
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:07 AM
విశాఖపట్నంలో సురేశ్ ప్రొడక్షన్స్‌కు కేటాయించిన 15.17 ఎకరాలు దుర్వినియోగం చేస్తూ, వాటిని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2003లో భీమిలి బీచ్‌రోడ్డు వద్ద సురేశ్ ప్రొడక్షన్స్‌కు భూమి కేటాయించబడింది

ఆ భూములు దుర్వినియోగమైనట్టు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం
స్టూడియాకు 2003లో 34 ఎకరాల భూమి
నిర్మాణం చేయగా మిగిలిన ఖాళీ భూములపై గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దల కన్ను
ఆ భూముల్లో అక్రమంగా లేఅవుట్
విశాఖపట్నం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో సురేశ్ ప్రొడక్షన్స్‌కు కేటాయించిన భూమిలో దుర్వినియోగమైనట్లు గుర్తించిన 15.17 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నిర్వాహకులకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని విశాఖ కలెక్టర్‌ను గురువారం ఆదేశించింది. విశాఖపట్నంలో సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం 2003లో భీమిలి బీచ్‌రోడ్డులో మధురవాడ సర్వే నంబరు 336/పిలో 34.44 ఎకరాల భూమిని రామానాయుడు స్టూడియో కోసం సురేశ్ ప్రొడక్షన్స్‌కు ఎకరా రూ.5.2 లక్షలు చొప్పున కేటాయించింది. అందులో కొంత భూమిలో స్టూడియో నిర్మించారు. మిగిలిన భూమి ఖాళీగా ఉంచేశారు. స్టూడియో భూములను వెనక్కి తీసుకోకుండా ఉండేందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘పెద్దలు’ 15 ఎకరాలు డిమాండ్ చేశారు. భూ వినియోగ మార్పిడికి వీఎంఆర్‌డీఏకు దరఖాస్తు చేయించారు. స్టూడియో కోసం ఇచ్చిన భూముల్లో లేఅవుట్ వేస్తున్నామని, దానికి అనుమతులు ఇవ్వాలని జీవీఎంసీకి 2023లో సురేశ్ ప్రొడక్షన్స్‌తోనే దరఖాస్తు చేయించారు. అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాకముందే కొండపై భూమిని లేఅవుట్‌గా మార్చేసి ప్లాట్లుగా విభజించేశారు.
సుప్రీంకోర్టుకు వెళ్లిన వెలగపూడి
స్టూడియో భూములను వైసీపీ పెద్దలు అడ్డగోలుగా కొట్టేస్తున్నారని గుర్తించిన జనసేన నాయకుడు పీతల మూర్తియాదవ్ స్థానికంగా ఫిర్యాదు చేశారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే (టీడీపీ) వెలగపూడి రామకృష్ణబాబు ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. అది కోస్తా నియంత్రణ మండలి పరిధిలో ఉందని, ఢిల్లీ స్థాయిలో అనుమతులు అవసరం కాగా, జిల్లా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి లేఅవుట్‌కు అనుమతులు ఇచ్చారని తెలియజేశారు. దీంతో ఆ భూమిలో లేఅవుట్ వేయకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దీంతో వైసీపీ పెద్దలు ముందుకు వెళ్లలేకపోయారు. కూటమి ప్రభుత్వం రావడంతో విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచిన రామకృష్ణబాబు ఈ భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై కలెక్టర్‌ను ప్రభు త్వం నివేదిక కోరింది. నిబంధనలకు విరుద్ధంగా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ 15.17 ఎకరాల్లో లేఅవుట్ వేసిన మాట నిజమేనని కలెక్టర్ నివేదించారు. దీంతో ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది.
ఆ భూములపై వ్యాపారవేత్త ఆదర్శం
డీపట్టా భూముల్ని తెలిసో, తెలియకో కొనుగోలు
స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించిన వైనం
ఎక్కడ ప్రభుత్వ భూములు ఖాళీగా కనిపించినా కబ్జా చేస్తున్న రోజుల్లో, తాను తెలిసో, తెలియకో కొనుగోలు చేసిన డీపట్టా భూములను ఆయన స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించి, పదిమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయనే విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన వ్యాపారవేత్త కడియాల రాజేశ్వరరావు. రాజేశ్వరరావు 2022లో అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం ఆర్.భీమవరంలో సర్వే నంబర్లు 223/2, 224, 226/1, 227/1, 227/2, 128 పరిధిలోని 30.46 ఎకరాల డీపట్టా భూములను కొనుగోలు చేశారు. అయితే రాజేశ్వరరావు ఆ డీపట్టా భూములను ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. గురువారం చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎ్‌సఎన్ రాజుతో కలిసి అనకాపల్లిలో కలెక్టర్ విజయకృష్ణన్‌ను కలిసి భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు అంగీకార పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కడియాల రాజేశ్వరావు మాట్లాడుతూ, తాను అప్పగించిన భూములను ప్రభుత్వ అవసరాలకు, పేదల కోసం వినియోగించాలని కోరినట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News